సరిగ్గా ఆ సమయానికి చస్తూ బ్రతుకుతూ ఇద్దరు కానిస్టేబుల్స్ లూనా మీద అక్కడకు వచ్చి, చటుక్కున దానిమీంచి దిగి, సెల్యూట్ చేసి లగేజి అందుకున్నారు.

 

    లక్ష్మీనారాయణ, ఆయన భార్య, కూతురు నెమ్మదిగా సింహద్వారం వద్దకు చేరుకున్నారు.

 

    కానిస్టేబుల్స్ లగేజీ అంతా రెండు దఫాలుగా అక్కడకు చేర్చి లక్ష్మీనారాయణ ఇచ్చిన కీతో డోర్ లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు.

 

    ముందుగా లోపలకు అడుగు పెట్టింది డి.ఐ.జి. భార్య బోసిగావున్న డ్రాయింగ్ హాల్ ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది.

 

    భార్య ఎందుకలా వున్నచోటే శిలా ప్రతిమలా అయిందో అర్థంకాక డి.ఐ.జి. లోపలకు నడిచి తనూ షాక్ తిన్నాడు.

 

    ఆ తరువాత ఆయన కూతురు, ఇద్దరు కానిస్టేబుల్స్ అదే స్థితికి గురయ్యారు. దాన్నెలా అర్థం చేసుకోవాలో అక్కడున్న ఎవరికీ వెంటనే వీలుపడని అచేతన స్థితికి గురయ్యారు.

 

    అది దొంగతనమే అని అనుకుంటే ఒక డి.ఐ.జి. ఇంట్లో అది సాధ్యమా...?!

 

    ముందుగా తేరుకున్న డి.ఐ.జి. భార్య ఒక్కసారి బావురుమంది-

 

    "నేనప్పుడే చెప్పాను - ఇప్పుడేమయిందో చూడండి? వేసిన తలుపులు వేసినట్టే వున్నాయి. ఇంట్లో వున్న విలువైన సామానంతా...?" మిగతా మాటలు పూర్తిచేయకుండానే ఆమెకేదో స్ఫురించి సంధించి వదిలిన బాణంలా ఫస్ట్ ఫ్లోర్ కేసి పరుగుతీసింది.

 

    డి.ఐ.జి. క్రిందున్న మిగతారూమ్స్ చెక్ చేసేందుకు పక్కకు వెళ్ళిపోగా ఆయన కూతురు అక్కడే వున్న సోఫాలో కూర్చుండిపోయింది.

 

    ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మొఖాలు పాలిపోయాయి. ఉరుము ఉరిమి ఎవరిమీదో పడడం అనే సామెత వాళ్ళకు చాలాసార్లు అనుభవమవుతుంటుంది. ఇంకొద్దిసేపట్లో అదే జరగబోతోందని తలుచుకుని వణికిపోయారు.

 

    "విలువైన ఫర్నిచర్ అంతా మాయమైపోయింది" అంటూ ఆమె ఏడుపు మొహంతో మెట్లు దిగివచ్చి నిస్సత్తువుగా సోఫాలో కూతురు ప్రక్క కూచుండిపోయింది.

 

    క్రింద గదులన్నీ చెక్ చేసి మధ్య హాల్లోకి వచ్చిన డి.ఐ.జి. లక్ష్మినారాయణ మొఖాన్ని చుట్టానికి కానిస్టేబుల్స్ కి ధైర్యం చాలలేదు.

 

    పోయిన సొమ్ము విలువ ఆమె కళ్ళముందు కదలాడుతుంటే 'తన ఇంట్లోనే దొంగతనం చేయడం ఎంత సాహసం?' ఆయన ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. "స్టేషన్ కి ఫోన్ చేసి సి.ఐ.ని రమ్మను" సీరియస్ గా ఓ కానిస్టేబుల్ వేపు చూస్తూ ఆజ్ఞ జారీచేశాడు డి.ఐ.జి.

 

    కానిస్టేబుల్ ఒణికిపోతూ ఫోన్ దగ్గరకు వెళ్ళి స్టేషన్ కి రింగ్ చేశాడు.


                               *    *    *    *


    పీటర్ కొట్టిన దెబ్బకు కనకారావు కళ్ళముందు నక్షత్రాలు మెరిసాయి.

 

    నిజానికి కనకారావు తప్పేమీలేదని పీటర్ కి తెలుసు. అయినా కనకారావు చెప్పిన సామంత్ కోరిక విని ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు.

 

    అతను కోపంతో ఊగిపోతూ వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు.

 

    కనకారావు వంచిన తల ఎత్తలేదు.

 

    ఒకింతసేపటికి ఆ గదిలో పేర్కొన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు పీటర్.

 

    "వాడికి బ్రతకాలని లేదా...?"

 

    'ఎన్నో విధాలుగా బెదిరించి చూసాను సార్. కాని లెక్క చేయలేదు..." భయపడుతూనే అన్నాడు కనకారావు.

 

    కొద్దిక్షణాలు ఆలోచిస్తూండిపోయాడు పీటర్.

 

    అర్జున్ రావు మూలంగా అతని భయం అతనికుంది.

 

    ఓ ప్రక్క పెళ్ళి ఏర్పాట్లు ముమ్మరంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడా ఏర్పాట్లలోనే అర్జున్ రావు నిండా మునిగివున్నాడు. తన పథకం ఏ అవరోధాలు లేకుండా విజయవంతమవుతుందనే ఆనందంలో వున్నాడు.

 

    సరీగ్గా అలాంటిసమయంలో పెళ్లికొడుకు మొరాయిస్తున్నాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ఖచ్చితంగా బేడ్ గా రియాక్ట్ అవుతాడు.

 

    అలాగని ఊరుకుంటే ఆ సామంత్ ఎటన్నా వెళ్ళిపోతే...? లేదా జరుగుతున్న విషయాన్నంతా నాగమ్మగారి ముందుంచితే...? ఆమె అందర్నీ పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేస్తుంది.

 

    సామంత్ కి పది లక్షలన్నా ఇవ్వాలి - లేదా భయపెట్టాలి. మొదటి దానికి అర్జున్ రావు ఒప్పుకోడు. రెండవదాన్ని ఎవరిద్వారా సాధించాలి..?

 

    పీటర్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. కనకారావు అలాగే భయం భయంగా ఒదిగి నించుని వున్నాడు.

 

    ఓ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు పీటర్ కనకారావు కేసి చూసాడు.

 

    "సామంత్ జాతకం తెల్సిన ఎస్.ఐ. ఎవరైనా వున్నారా...?" పీటర్ ప్రశ్నించాడు సాలోచనగా.

 

    "వున్నారు సార్"

 

    "ఎవరు...? అతను ఎంత రాక్షసుడైతే మనకంత మంచిది. ఎవరతను...?"

 

    "నరరూప రాక్షసుడు - పరమ దుర్మార్గుడైన ఎస్.ఐ. ఒకతనున్నాడు సార్... అతని పేరు నరసింహం. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. సార్. అతనే ఓసారి సామంత్ ని ఇరగ్గొట్టి ఊరిబయట తుప్పల్లో పడేయించాడు. అతని పేరు చెబితే ఎంత పెద్ద రౌడీ అయినా పచ్చి మంచినీళ్ళు ముట్టడు. యమా డేంజరస్..."

 

    పీటర్ నవ్వాడు.

 

    అతని మెదడులో సామంత్ ని లొంగదీసుకొనే పథకమొకటి క్రమంగా రూపుదిద్దుకోసాగింది.


                                                          *    *    *    *


    పావుగంటకు టూ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్టీఫెన్స్ రోడ్ లోని ఆరవనెంబర్ ఇంట్లో వున్నాడు.

 

    "మీరే సిగ్గుపడతారా? లేక అందరం సిగ్గుపడదామా...?" ఉరిమినట్లన్నాడు డి.ఐ.జి. లక్ష్మీనారాయణ.

 

    భయంతో సి.ఐ. నోట మాట పెగల్లేదు.

 

    "ఒక డి.ఐ.జి. ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే రేపు ఎక్కడైనా ఎవరింట్లోనైనా దొంగతనం జరగవచ్చు. అప్పుడిక మనమెందుకు? మన డిపార్ట్ మెంటెందుకు..? ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు సేవ చేయనప్పుడు మనం గాజులు తొడుక్కుని మిమ్మల్ని మీరే రక్షించుకోండని చెప్పి మనం గనుల్లోనో, ఖార్కానాల్లోనో పనిచేయడం బెటర్..." ఆవేశంతో మాటలు తడబడుతున్నాయి డి.ఐ.జి.కి.