అన్నిటికి హుందాగా, స్వచ్చమైన భాషలో సమాధానాలు ఇవ్వసాగాడు సామంత్.

 

    ఆమె ఆంగ్లంలో ప్రశ్నలు వేస్తే ఆంగ్లంలో, తెలుగులో వేస్తే తెలుగులో, హిందీలో వేస్తే హిందీలోనే సమాధానాలిస్తున్న సామంత్ ని చూసి అర్జునరావు షాక్ తిన్నాడు.

 

    కేవలం నాలుగే నాలుగు వారాల్లో ఇంత మార్పా...? మార్పా-? లేక నిజంగానే నాగరికత తెలిసిన విద్యాధికుడా? నాలుగు వారాల్లో ఒక దొంగని గొప్పవాడిగా మార్చటం సాధ్యం కాదని, నిజంగానే గొప్పింటి యువకుడ్ని పథకంలోకి ప్రవేశపెట్టారా? అర్జునరావు ఇలా ఆలోచిస్తూనే వున్నాడు.

 

    నాగమ్మ, సామంత్ గంభీరంగా మాట్లాడుకుంటూనే వున్నారు.

 

    సరిగ్గా అప్పుడే నాయకి మెట్లు దిగి ఈ గదికేసి వస్తోంది.

 

    సరిగ్గా అప్పుడే డి.ఐ.జి. లక్ష్మీనారాయణ కుటుంబం ఎయిర్ బస్ 320 నుంచి దిగింది.

 

    బేగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్ పోర్ట్ అవుట్ గేట్ నుంచి బయటకు వచ్చి టాక్సీ ఎక్కారు. అదిప్పుడు సరాసరి స్టీఫెన్స్ రోడ్ కేసి దూసుకుపోసాగింది. ఒకింత సేపటికి కారులోపల సంభాషణ మొదలయింది.

 

    "డాడీ..." పదిహేనేండ్ల పాప తన తండ్రి నుద్దేశించి అంది.

 

    "ఏమ్మా..." కూతురివేపు ప్రేమగా చూస్తూ ప్రశ్నించాడు డి.ఐ.జి. లక్ష్మీనారాయణ.

 

    "ఢిల్లీ చాలా బావుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఢిల్లీ వెళ్ళి ఒకటి రెండువారాలు గడుపుదామా డాడీ"

 

    ఆయన నవ్వుతూ అలాగే అన్నట్టు తలూపాడు.

 

    "మీతండ్రి కూతుర్ల వరస బాగానే వుంది. ఇల్లు వదిలేసి ఇలా ఊర్లట్టుకు తిరిగితే వంట చేసుకోవడానికి పాత్ర కూడా మిగలదు..." ఆ పాపకు తల్లి, ఆయనకు భార్య అయిన ఆమె అంది మందలిస్తున్న ధోరణిలో.

 

    ఆ పాప పెద్దగా నవ్వింది.

 

    "యు మీన్ రాబరీ...? డి.ఐ.జి. లక్ష్మీనారాయణ గారింట్లో దొంగతనమా? ఎవరికన్ని గట్స్?" పాప నాటకీయంగా అంది తల్లిని ఆట పట్టించాలని.

 

    "కరెక్ట్ గా చెప్పావ్ బేబీ. మన ఇంట్లో దొంగతనం కాదు. అసలు మన పేటలోనే దొంగతనం జరగదు. మనం అక్కడున్నంత కాలం..." అన్నాడు గర్వంగా గుబురుగా వున్న మీసాల్ని నిమురుకుంటూ.


                                *    *    *    *


    "అసలు దొంగలు తేలిగ్గా మనకెందుకు దొరికిపోతారో తెలుసా?" మూడో పెగ్ తీసుకోబోతూ అన్నాడు నరసింహం.

 

    ఎదురుగా వున్న మరో స్టేషన్ ఎస్.ఐ. ఎలా అన్నట్టు మత్తుగా వాలిపోతున్న కనురెప్పల్ని పైకెత్తి ప్రశ్నించాడు.

 

    "దొంగసొమ్ము చేతికి రాగానే కొన్నాళ్ళపాటన్నా ఆ సొమ్మును ఎక్కడో దాచేసుకుని సాదాగా వుంటే మనకనుమానం రాదు. డబ్బు చేతిలో పడగానే బార్లని, కేబరేలనీ, బట్టలని జల్సా చేస్తారు. అందుకని తేలిగ్గా దొరికి పోతారు. నేనయితే దోపిడీ చేసిన ఆర్నెల్లదాకా సొమ్మును బయటకు తీయను. అప్పులు చేసయినా అష్టదరిద్రంలో వున్నట్టు నటిస్తాను" అన్నాడు ఖాళీ అయిన బ్లాక్ అండ్ వైట్ ప్రీమియర్ స్కాచ్ విస్కీ బాటిల్ ని అసహనంగా చూస్తూ.

 

    "మనల్ని దొంగలతో పోల్చుకోగూడదేమో? నేనయితే ఫలానా దొంగను ఇలా పట్టుకుంటాననో, నేనయితే ఏ ప్రలోభాలకు లొంగనని చెప్పాలేమో మనం"

 

    నరసింహానికి ఆ మాటలతో కిక్కు దిగిపోయినట్టయింది. అతని కేసి కోపంగా చూశాడు నీతిపాఠాలు చెబుతావా అన్నట్టు.

 

    "నేననేది తెలివి తేటల గురించి" కోపంగా అన్నాడు నరసింహం.

 

    అతను నవ్వాడు.

 

    "తెలివితేటల గురించయితే నీకవి లేనట్టేగా?"

 

    నరసింహం ముఖం చిట్లించాడు.

 

    "ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ సొమ్ముతో ఇలా జల్సా చేసే వాళ్ళమా?"

 

    "నా గర్ల్ ఫ్రెండ్ సొమ్ము దొంగసొమ్ము కాదుగా?"

 

    "ఏమో? ఎవరికి తెలుసు?"

 

    అంతే... నరసింహం ఆవేశంగా లేచి అతన్ని చూసి లెంపకాయ వేశాడు.

 

    దాంతో అతనికి కోపం వచ్చింది.

 

    అతనూ నరసింహాన్ని ఒకటేశాడు.

 

    చూస్తుండగానే ఇద్దరి మధ్య ముష్టి యుద్ధం మొదలయింది.

 

    లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాల్సిన చట్ట ప్రతినిధులే ఆ విధంగా అల్లరి చేస్తుంటే ఇక సామాన్య ప్రజల్ని రక్షించేదెవరు?

 

    వాళ్ళిద్దరూ సివిలియన్స్ లా కనిపించడంతో బార్ మేనేజర్ వెంటనే దగ్గరే వున్న పోలీసు స్టేషన్ కి ఫోన్ చేశాడు కంగారుగా.

 

    "ఎస్.ఐ. గారున్నారా?" మేనేజర్ టెన్ షన్ గా ఫీలవుతూ అడిగాడు.

 

    "లేరు" ఆవేపు నుంచి తాపీగా వినిపించింది.

 

    "ఇక్కడ గొడవ జరుగుతోంది"

 

    "ఇక్కడంటే? మన ఊరికి ప్రెసిడెంట్ ఎవరు అని ఒక టీచర్ ఒక విద్యార్ధిని ప్రశ్నిస్తే 'మానాన్న' అన్నాడట ఆ విద్యార్థి. దాంతో ఆ విద్యార్థి పరీక్షలలో తప్పాడట. ఇంతకీ ఆ విద్యార్ధి ఎవరో తెలుసా? ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకే..." ఫోన్ ఎత్తిన కానిస్టేబుల్ సత్యం తాపీగా అన్నాడు.

 

    బార్ మేనేజర్ కి పిచ్చి కోపం వచ్చింది కానిస్టేబుల్ మాటలకు.

 

    "నీరో చక్రవర్తికి సరయిన వారసులు పోలీసులే అని రుజువు చేసావు. ఇక్కడ ఫర్నీచర్ నాశనమయిపోతోందని నేను భయపడి చస్తుంటే కథలు చెబుతావా నువ్వు? బుద్ధుందా నీకు...?" కోపంగా ప్రశ్నించాడు.

 

    ఎస్.ఐ. లిద్దరు వీధి రౌడీల స్థాయికి దిగిపోయి బార్ ని సర్వనాశనం చేసేస్తున్నారు. క్షణక్షణానికి అక్కడ పరిస్థితి విషమిస్తోంది.

 

    "నీకిప్పటికీ బుద్దిలేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పావా? ఎక్కడ గొడవ జరుగుతుందో చెప్పానా?" కానిస్టేబుల్ ఫోన్ కి ఆవేపు నుంచి ఘాటుగా అడిగాడు.

 

    "ఈగల్ బార్, గాంధీనగర్" మేనేజర్ చప్పున అన్నాడు.

 

    "పేటకి గాంధీగారి పేరెట్టుకొని బ్రాందీ దుకాణం పెడతావా? నీకసలు బుద్ధుందా...?" కానిస్టేబుల్ నవ్వుతూ ప్రశ్నించాడు.

 

    "మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా నలుగురు రౌడీల్ని నమ్ముకోవటం బెటర్. ఇంతకీ వస్తున్నారా లేదా?"

 

    "స్టేషన్ లో ఎవరూ లేరు. ఇంకాసేపట్లో ఎవరైనా వస్తే పంపిస్తా. లేదంటే మీ బాధలేవో మీరు పదండి" నిర్లక్ష్యంగా ఇవి మాకు మామూలే అన్నట్టు అన్నాడు.

 

    "ఇంతకీ మీ ఎస్.ఐ. ఎక్కడ చచ్చాడు?"