"నా పేరు అబూ..." అతను భయపడుతూనే నెమ్మదిగా అన్నాడు.
    
    "ఎన్నాళ్ళ నుంచి దేవానంద్ ఇంటికి వాచ్ మెన్ గా పనిచేస్తున్నావు?" సర్కిల్ మరో ప్రశ్న వేశాడు.
    
    "సుమారు పదేండ్ల మంచి"
    
    "అతనెప్పుడు నీ దగ్గరకు వచ్చాడు?"
    
    "వారం క్రితం"
    
    "అతనిపేరు తెలుసా నీకు?"
    
    "తెలీదు సార్ కానీ అతను నాతో మాట్లాడుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు. అప్పుడు అతని లైటర్ మీద జె అనే అక్షరం ఉండటాన్ని గమనించాను."
    
    "అతనెలా ఉన్నాడు?"
    
    "మంచి పర్సనాలిటీ ఐదడుగుల పదంగుళాల ఎత్తులో, ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్నాడు సార్."
    
    "ఇంకా చెప్పు."
    
    "నల్లగా ఉన్నాడు సార్. గుబురాయిన మీసాలు, ఒత్తయిన కనుబొమలు... కళ్ళు మాత్రం ఎర్రగా రక్తాన్ని చిమ్ముతున్నట్లున్నాయి."
    
    "ఇంకా వివరించు. బాగా గుర్తుకు తెచ్చుకో" కమీషనర్ అబూని స్ట్రెస్ చేశాడు.
    
    "పళ్ళు గారపట్టి బ్రౌన్ గా ఉన్నాయి. నోట్లో పాన్ పెట్టుకొని మేకలా నమిలాడు. కుడికాలు కొద్దిగా షార్ట్ అనుకుంటాను. ఒకింత కుంటుతున్నట్లు నడిచాడు."
    
    "వెరీగుడ్.... మొదటిసారి కల్సుకున్నప్పుడు ఏం మాట్లాడాడు నీతో?" కమీషనర్ ఇంటరాగేషన్ లో మరింత లోతుకు వెళుతూ అడిగాడు.
    
    "సరిగ్గా వారంక్రితం... అంటే ఆదివారం రోజు సాయంత్రం నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. మా సాబ్ ని చూసేందుకు అప్పుడప్పుడు వారి అభిమానులు రావటం, నన్ను పర్మిషన్ అడగటం నాకు మామూలే. నేనతన్ని చూసి దేవానంద్ సాబ్ అభిమానే అనుకున్నాను. సాబ్ ఇంట్లో ఉన్నారా అని అడిగాడు. లేరు- ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్స్ కి ఇంగ్లాండ్ వెళ్ళారని చెప్పాను. నిజమేనా అని అడిగాడు. నిజమే అని చెప్పాను. ఎప్పుడొస్తారని అడిగాడు. బహుశా ఒక నెల పట్టవచ్చని చెప్పాను. అప్పుడతను చిన్నగా నవ్వి తలెత్తి నాకేసి చూశాడు. అతని పళ్ళను చూసి నేను ఓ క్షణం భయపడ్డాను. సరిగ్గా మూడోరోజు సాయ్మత్రం ఆరు, ఏడుగంటల మధ్య దేవానంద్ సాబ్ ఇంట్లోకి తను ప్రవేశించాలని, ఓ గంటపాటు కాంపౌండ్ లో మూలగా వున్న మామిడి చెట్టుమీద సెటిల్ అవుతానని, అందుకు పదివేలిస్తానని అన్నాడు. ముందు అతను దొంగేమో అనుకున్నాను. అతను జేబులోంచి పదివేలు తీసి నాకివ్వజూపాడు. అక్కడ కూర్చుని ఏం చేస్తానని అడిగాను. ఒక వ్యక్తిని చంపుతానని అన్నాడు. నేను భయపడి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని హెచ్చరించాను. అప్పుడతను మరో జేబులోంచి ఒక ఫోటో తీసి నాకు చూపించాడు. నేను ఫోటో చూసి షాక్ తిన్నాను."
    
    అబూ ఆయసంతో, ఆవేశంతో చెప్పటం ఒక్కక్షణం ఆపాడు.
    
    "ఏముందా ఫోటోలో...?" కమీషనర్ షార్ప్ గా రియాక్ట్ అవుతూ అడిగాడు.
    
    "నా మనుమరాలు- నాకూతురి కూతురు ఆ ఫోటోలో వుంది. నా మనుమరాలు చదువుకొనే స్కూల్ కి వెళ్ళి నేను తీసుకురమ్మన్నానని చెప్పి నా మనుమరాలిని కిడ్నాప్ చేశారట ఆరోజు మధ్యాహ్నమే. నేను అతను చెప్పే పనికి అంగీకరించనేమోనని ముందే అనుమానించి ఆ పని చేశాడట.  మర్యాదగా తను చెప్పిన దానికి అంగీకరించనేమోనని ముందే అనుమానించి ఆ పని చేశాడట. మర్యాదగా తను చెప్పిన దానికి అంగీకరించకపోతే నా మనుమరాలిని చంపేస్తానని బెదిరించాడు. తన పని పూర్తయ్యే వరకు నా మనుమరాలిని వదిలిపెట్టనని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియవచ్చినా అదే దుష్పలితాన్ని అనుభవిస్తానని నన్ను హెచ్చరించి నా చేతిలో పదివేలుంచి వేగంగా వెళ్ళిపోయాడు" అబు బాధా తప్తహృదయంతో చెప్పటం ముగించాడు.
    
    "అప్పుడతని కూడా మరెవరన్నా ఉన్నారా?" సర్కిల్ ప్రశ్నించాడు.
    
    "లేరు సార్."
    
    "ఆ తరువాతేం జరిగింది?"
    
    "వాడు చెప్పినట్లుగానే నా మనుమరాలు ఆరోజు, మరుసటిరోజు ఇంటికి రాలేదు. మూడోరోజు సాయంత్రం సరిగ్గా 6.05 నిమిషాలకు అతను ఒక సూట్ కేస్ తో తిరిగి నా దగ్గరకు వచ్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతన్ని లోపలకు వెళ్ళనిచ్చాను."
    
    "ఆ తరువాత?"
    
    "అతను ఆ సూట్ కేస్ తో మామిడిచెట్టు మొదలు దగ్గరకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దానిలోంచి ఒక తాడుని, ఒక డబ్బాని బయటకు తీసి ఆ సూట్ కేస్ ని మూసివేసి వాటితో ఆ చెట్టు ఎక్కాడు. తరువాత ఆ తాడును పట్టుకొని జర్రున క్రిందకు జారాడు."
    
    "అప్పుడు టైమెంత" సర్కిల్ ప్రశ్నించాడు.
    
    "నేను చూసుకోలేదు. బహుశా ఆరు పది అయి వుండవచ్చు."
    
    "ఆ తరువాత?"
    
    "మరలా ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేసి ఓ పెద్ద గన్ ని, బ్యాట్రీలైట్ ని తీసుకొని చెట్టెక్కేశాడు."
    
    "వూ... తరువాత?"
    
    "ఆ తరువాత ఏం చేశాడన్నది నేను చూడలేదు. భయంతో గేటు బయటకొచ్చి నించున్నాను. అంతలో అక్కడికి జీప్ వచ్చి ఆగింది...."
    
    "ఆ జీప్ లో ఎవరున్నారు?"
    
    "అతనెవరో మరి? ఓపెన్ జీప్ కాదు. బాడీ ఉన్న జీప్ అది అనుకోకుండా మా గేటుకి పదడుగుల అవతల ఆగిపోవటంతో ఏదయినా ట్రబులేమో అనుకున్నాను. అందుకు ఆధారం కల్పిస్తూ అతను బాయ్ నెట్ ఎత్తి ఏదో రిపేర్ చేసుకోసాగాడు. నా ఆలోచన కరెక్టే అని ఊరుకున్నాను."
    
    "అతనెలా వున్నాడు?" కమీషనర్ అడిగాడు. బొంబాయి నగరపు పోలీస్ కమీషనర్ అంటే మాటలు కాదు. ఆయనే ప్రత్యేకంగా తమ స్టేషన్ కొచ్చి ఒక వ్యక్తిని అత్యంత శ్రద్ధతో ఇంటరాగేట్ చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాహ్డు. కేసు అత్యంత జటిలమయినది అయుండాలి. బడా స్వాములు ఎవరో ఇందులో ఇన్ వాల్వ్ అయుండాలి. ఆ స్టేషన్ ఎస్.ఐ.సి.ఐ. అక్కడున్న నలుగురు కానిస్టేబుల్స్ ఇలా ఆలోచిస్తున్నారు.