"తెలీనట్టు మాట్లాడతావేంట్రా... అదే మేరీ పియర్స్...నీ దగ్గరికి రాలేదా...?"

 

    "రేయ్...ఒకమ్మాయి కోసం, ఒకేచోట వున్న మనం తగవులాడు కోవడం బాగోదురా" అన్నాడు యోగి.

 

    "ఆ అమ్మాయితో నాకెందుకురా బాబూ...ఇప్పుడున్న సమస్యలతోనే సతమత మవుతున్నాను. నువ్వు ఆశ పడుతున్నావ్ కదా...నువ్వే చూస్కో..." అని శ్రీధర్ అంటుండగా ఎం.డి. ఛాంబర్ లోంచి మేరీ రావడం గమనించారిద్దరూ.

 

    "మేరీ వస్తోంది. తీసుకొస్తున్న ఆ ఫైల్ బహుశా నా టేబుల్ దగ్గరికే ననుకుంటా...ఇద్దరం ఒకేచోట వుంటే పక్కవాళ్ళేమన్నా అనుకుంటారు... నువ్వెళ్ళు" అన్నాడు శ్రీధర్.

 

    శ్రీధర్ భయానికి నవ్వుకుంటూ అతని సీటు దగ్గర కెళ్ళిపోయాడు యోగి.

 

    మేరీ పియర్స్ కు పాతికేళ్ళుంటాయి. అందంగా కంటే ఎక్సోటిక్ గా వుంటుంది. ఇంకా పెళ్ళి కాలేదు.

 

    "ఏంటి సీరియస్ గా రాసుకుంటున్నారు...?" అంది మేరీ తను తెచ్చిన ఫైల్ శ్రీధర్ టేబుల్ మీదుంచుతూ. అనాసక్తంగానే తలెత్తి ఆమెకేసి చూశాడు శ్రీధర్.

 

    "కళ్ళేమిటి ఎర్రగా వున్నాయి? నీరసంగా వున్నట్టున్నారు? రాత్రి నిద్ర లేదా?" అంది మత్తుగా.

 

    "మనసు బాగోలేదు ఆ ఫైల్ ఇక్కడ పెట్టేసెళ్ళు...తర్వాత మాట్లాడుకుందాం" అన్నాడు శ్రీధర్.

 

    అతని వైపే ఆరాధనగా చూస్తూ అయిష్టంగానే తన సీటు దగ్గరికెళ్ళి పోయింది మేరీ.


                                                 *    *    *    *


    సాయంత్రం అయిదింటికి ఆఫీసు నుంచి బయటపడ్డాడు శ్రీధర్.

 

    ఆటోలో తన ఫ్లాట్ కొచ్చాడు. ఆటో దిగి మీటర్ డబ్బులు పేచేసి లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాడు.

 

    "హాయ్ శ్రీధర్!" వెనుదిరిగి చూశాడు.

 

    ఎదురుగా జయారెడ్డి నవ్వుతూ కనిపించింది.

 

    ఆ నవ్వు నవ్వులా లేదు. మత్తుగా, కవ్వింపుగా వుంది. విష్ చేస్తూ- "హాయ్ జయా! ఏమిటి?" అన్నాడు పలకరించకపోతే బాగోదని.

 

    అతని దగ్గరగా వచ్చిందామె.

 

    "ఏంటి కళ్ళంత ఎర్రగా వున్నాయ్? రాత్రంతా నిద్ర లేనట్టు వుందే..."

 

    "అబ్బే-అదేం కాదు. అవంతే" అన్నాడు.

 

    "గీతాంజలి సినిమా చూశావా...? అదే మణిరత్నం గీతాంజలి-" అడిగింది జయారెడ్డి అదోలా చూస్తూ.

 

    "అది నేను అమెరికాలో వుండగా రిలీజైంది. అందుకే క్యాసెట్ చూశాను. ఏం అలా అడిగావ్?" అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యపోతూ.

 

    "సినిమా ప్రారంభంలో షావుకారు జానకి వైస్ ఛాన్సలర్ హోదాలో ప్రసంగించి డిగ్రీలు ప్రదానం చేస్తుండగా, నాగార్జున డిగ్రీ తీసుకోవడాని కొచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ 'ఐ లవ్ యూ' అంటూ కన్ను కొడతాడు...ఎంత అద్భుతంగా వుందో ఆ షాట్. గమనించలేదా?"

 

    ఆమె చెప్పేది విని వెర్రి చూపులు చూశాడు శ్రీధర్.

 

    "హుషారంటే అలా వుండాలి" అంది కన్నుకొడుతూ.

 

    కన్ను కొట్టడంలో ఎంతో నేర్పు, మరెంతో ప్రావీణ్యం వుంటే తప్ప అలా ఎవరూ కన్ను కొట్టలేరు. పక్క కన్ను కానీ, కనురెప్పగానీవీసమెత్తైనా కదల్చకుండా కుడికన్ను, కనురెప్పను అలా అలవోకగా వాల్చి పైకెత్తడమన్నది అంత తేలిగ్గా అలవడే ప్రక్రియ కాదు.

 

    అందుకే శ్రీధర్ బిత్తరపోయి ఆమెకేసి చూస్తుండిపోయాడు.

 

    "రిలాక్సవ్వాలంటే నువ్విప్పుడు మసాజ్ చేయించుకోవాలి. రా... మసాజ్ చేయిస్తా" అంటూ అతని చేయి పట్టుకుంది జయారెడ్డి.

 

    "వద్దు...వద్దు...వదిలేయ్" అని కంగారుపడిపోతూ చుట్టుపక్కలకు చూశాడు.

 

    "ఏం పర్లేదులే - రా..." అంటూ తన మెన్స్ పార్లర్ లోకి లాక్కెళ్ళింది జయారెడ్డి.

 

    "వయసులో వున్న మగాడివి అలా మొహమాట పడతావెందుకు?" అంటూ మసాజర్ కి సైగచేసింది.

 

    అతను శ్రీధర్ దగ్గరకొచ్చి అతని షర్టు తొలగించి, భుజాలపై చేతులేసి మసాజ్ చేయసాగాడు.

 

    "ఇంత మంచి బాడీ వుండి కూడా ఎందుకబ్బాయ్ అంత మూడీగా వుంటావ్?" నగ్నంగా వున్న శ్రీధర్ ఛాతీవేపు చూస్తూ కవ్వింపుగా, మత్తుగా అంది.

 

    శ్రీధర్ ఏం మాట్లాడలేదు. అతనికెందుకో ఆమె అక్కడుండటం అసహనంగా వుంది.

 

    "ఈ సమయంలో మీరిక్కడ వుండాలా? ఇతను ప్రొఫెషనల్ మసాజరే కదా?" అన్నాడు.

 

    "ఎక్కడో, దేశం కాని దేశంలో, దేశాలు పట్టుకు తిరుగుతున్న అమ్మాయి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు పిల్లాడా! నాతో స్నేహం చేయి. నీ వయసుకు సరిపడ ఔషధం అందిస్తాను..." అతని గుండెలకేసి కాంక్షగా చూస్తూ అంది జయ.

 

    శ్రీధర్ కంగారుగా మసాజర్ కేసి చూశాడు.

 

    "కంగారుపడకు. అతనికి చెవుడు" అంది జయ నవ్వుతూ.

 

    ఆ మాటకి రిలాక్సయ్యాడు శ్రీధర్.

 

    "ఇన్నిసార్లు నేను చెప్పలేను. అపర్ణకు తప్ప మరెవ్వరికీ నా మనసులో స్థానం లేదు..." అంటూ మసాజ్ టేబుల్ మీంచి లేవబోయాడు శ్రీధర్.

 

    "ప్లీజ్ టేక్ ఫుల్ మసాజ్. పోనీలే... స్నేహం చేయడానికేం అభ్యంతరం లేదుగా?" అడిగింది జయారెడ్డి. అతనితో వేరే రకంగా ప్రొసీడ్ అవడం అప్పుడప్పుడే అంత మంచిది కాదనే అభిప్రాయానికొస్తూ.

 

    ఆమెనెలా వదిలించుకోవాలో అర్థంకాలేదు శ్రీధర్ కి.

 

    అప్పుడే అతనికి పజిల్ విషయం గుర్తుకొచ్చింది.

 

    "నీతో స్నేహం చేయాలంటే ఒక పజిల్ ని విప్పాలి. విప్పగలవా?" అడిగాడు అపరిచితురాల్ని గుర్తుకు తెచ్చుకుని.