"బాధపడొద్దు. రేపే వస్తాడు అన్న మాటని అతికష్టంమీద దిగమింగి, "మీ అబ్బాయా అండీ?" అంది తిలక.
    
    "ఔనమ్మా! త్రాష్టుడు! మిగిలింది వాడొక్కడే నాకు. ఈ తీరున ఏడిపిస్తున్నాడు!" అందావిడ.
    
    రాధ అన్నం కలుపుకుంటూ "ముందు ఆవిడ్ని అన్నం తిననీ అత్తయ్యా!" అంది.
    
    "ఆవిడ కాదు, టీచర్ అనమన్లేదూ!" అంది తిలక!
    
    రాధ నవ్వి, "అనాలనిపించడంలేదక్కా!" అంది.
    
    "ఆ పిలుపుకి తిలక మనసంతా నిండి భుక్తాయాసంగా అనిపించింది.
    
    ఆమె ఆ ఇంట్లో కల్తీలేని పాలనీ, స్వచ్చమైన గాలినీ, అరమరికలు లేని బంధుత్వాలనీ, దెప్పిపొడుపులు లేని పరిహాసాల్నీ, ఆడంబరం లేని అనురాగాల్నీ చూసింది. అన్నింటినీ మించి రంగుల పూతలు లేని రాధ అందాన్ని అబ్బురంగా చూసింది.
    
    భోజనాలయ్యాక రాధ గదిలో వినాయకుడి పటానికి నమస్కరించి.....పలకమీద "మొదటగా ఏం రాయనూ అడిగింది తిలక.
    
    రాధ కళ్ళు కిందకి వాల్చి "మాధవ్" అంది.
    
    "హృదయఫలకంమీదున్న అక్షరాలూ పలకమీద రాయనా?" నవ్వుతూ అడిగింది తిలక.
    
    ఆ తర్వాత రాధ తనకొచ్చినవన్నీ రాసి చూపించింది.
    
    "ఎ ఫర్ అనుబంధం...
    
    బి ఫర్ బంధుత్వం.... ఇంకా ఎన్నో...
    
                                                            * * *
    
    శాంత చెప్పిన సంగతి విని ప్రకాశం విస్తుపోయాడు. "అనుకున్నాను కానీ, ఎవరికీ చెప్పలేదే?" అన్నాడు.
    
    "ఒకవేళ మీ అన్నగారికే ఈ ఆలోచన తట్టి టీచర్ని పిలిపించి ఉంటారు!" అంది శాంత.
    
    "ఆఁ అయ్యుంటుంది!" అన్నాడు గుండెలమీద పెద్ద బరువు దింపుకున్నట్టుగా.
    
    "పిల్ల ఆ పాంటూ, షర్టూ విప్పి పారేసి పరికిణీ ఓణి వేసుకుంటే లక్షణంగా ఉంటుంది!" అంది.
    
    "మరి వేసి చూడకపోయావా?" అన్నాడు ప్రకాశం.
    
    "రామచంద్రాయ... జనక రాజజా మనోహరాయ.
    
    మామకాభిష్టదాయ మహిత మంగళం....!" అని రాధ శ్రావ్యంగా పాడుతూ వుంటే తిలక నాట్యం చేస్తోంది.
    
    "మందహాస.... సద్వరద మంగళం!" అంటూ అటుగా వచ్చిన ప్రకాశం గొంతు కలిపాడు.
    
    తిలక గబుక్కున నాట్యం ఆపెయ్యబోతే 'కానీ...' అన్నట్లు సైగ చేస్తూ పాడసాగాడు.
    
    "విమల రూపాయ వివిధ వేదాంత..." వత్తులు చేసుకుంటూ పార్వతమ్మా, పూలు కడుతూ శాంతా, రాత్రి వంటకి కూరలు తరుగుతూ సూరమ్మ కూడా చూసి ఆనందిస్తున్నారు. వెనక నుండి వచ్చిన సన్యాసిరావు ఆమెను అనుకరించి తనూ ఆడుతుంటే రాధ ఆపుకోలేక పకపకా నవ్వేసింది.
    
    తిలక కూడా నాట్యం ఆపి నవ్వడంతో అందరూ ఆమెతో నవ్వసాగారు.
    
    ఇంతలో పెద్ద పెద్ద అంగలతో సుబ్బారాయుడు లోపలికి వచ్చాడు.
    
    అందరూ నవ్వుతూనే తలలు తిప్పి చూశారు.
    
    అందర్నీ ఒక్కసారి పరికించి చూసి తిలకవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
    
    ఆయన బుంగమీసాలు చూడగానే తిలకకి భయం వేసింది. ఊపిరి బిగబట్టి నిలబడింది.
    
    ప్రకాశం గబుక్కున వెళ్ళి ఆయన చేతిలోని సూట్ కేస్ అందుకున్నాడు.
    
    తండ్రివైపు రాధ కళ్ళల్లో వేసుకున్న వత్తులు వెలిగించినట్లుగా చూసింది.
    
    పార్వతమ్మ ఏదో అడగడానికి నోరు తెరిచింది.
    
    "పెద్దాడా..... వచ్చావుట్రా!" అంటూ లేచి కూర్చుంది తాయారమ్మ.
    
    "ఆ...." అని గదిలోకి వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు.
    
    "ప్రయాణం చేసొచ్చాడు కదూ! అలసిపోయినట్టున్నాడు, పాపం!" అంది సూరమ్మ.
    
    రాధ గదిలోకి పరుగెత్తబోయి కాళ్ళకేవో బంధాలు పడినట్లు ఆగిపోయింది. సహజమైన సిగ్గుతెర ఆమెను ముందుకు కదలనీయలేదు. కాటికతో నల్లబడ్డ ఆమె విశాలమైన కళ్ళు రెండూ భయంగా గదివైపు చూస్తున్నాయి. అప్పటిదాకా హాయిగా ఉయ్యాలలూగిన పైట భారమైన గుండెల్ని కప్పడం కష్టమై చిన్నగా కంపిస్తోంది.
    
    ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్నట్లుగా తిలక భుజంమీద చెయ్యి వేసి చిన్నగా నవ్వింది.
    
    రాధ ఆమెవైపు చూడగానే చిన్నగా చెవిలో పాడింది.
    
    "రామదాసాయ... ....
    
    స్వామి భద్ర గిరివరాయ మహతమంగళం....!"
    
    రాధ కూడా చిన్నగా నవ్వింది. ఆమెకి ఆ సమయంలో తన ఈడు పిల్ల తోడుగా ఉండటం ఊరటనిచ్చింది.
    
                                                           * * *
    
    సుబ్బారాయుడి భోజనం పూర్తయ్యేవరకూ పక్కన కూర్చుని విసనకర్రతో విసురుతూ అతనేదన్నా చెప్తాడేమోనని ఎదురుచూసింది పార్వతమ్మ.
    
    అతను గంభీరంగా భోజనం చేసి లేచి పెరట్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు.
    
    తుండు అందిస్తూ నెమ్మదిగానే, "వెళ్ళినపని ఏమైందండీ" అని అడిగింది పార్వతమ్మ.
    
    అతనోసారి భార్య మొహంవైపు తీక్షణంగా చూశాడు.
    
    ఇంతలో ప్రకాశం వచ్చి "అన్నయ్యా! నీకోసం రామనాథంగా రొచ్చారు. వెంట ఎవరినో తీసుకొచ్చారు!" అన్నాడు.
    
    సుబ్బారాయుడు తలఊపి తుండు భుజం మీద వేసుకుని వసారాలోకి నడిచాడు.
    
    అక్కడ కూర్చున్న నలుగురూ లేచి నిలబడ్డారు.
    
    "నమస్కారం! కూర్చోండి!" అన్నాడు సుబ్బారాయుడు.
    
    అందరూ కూర్చున్నారు.
    
    కిటికీలోంచి తొంగి చూస్తున్న తిలక, రాధతో "ఆ పొన్నుకాయ లాంటి తలకాయ ఉన్నాయన ఎవరు?" అని రాధ చెవిలో అడిగింది.