చాలామంది విషయంలో ఇదే జరుగుతోంది.
    
    నాది కాని జీవితం నేను జీవిస్తున్నాను.
    
    నేను పొందవలసింది నేను పోగొట్టుకున్నాను.
    
    నిజమేననుకుందాం. ఈ తెలివితేటలు ముందే ఎందుకు లేకపోయాయి? అప్పుడెందుకు తొందరపడిపోయావు? అప్పుడు హడావుడి, మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఓ...ముందుకు దూసుకువెడదామన్న వేగిరపాటు.
    
    చాలా ముఖ్యవిషయాలు రాస్తున్నాను. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ చదవండి. నిజంగా మీ గురించి మీకు తెలీదు. "నాకన్నీ తెలుసులే" అన్న అహంభావాన్ని పక్కకుపెట్టి, "తెలిసుంటే మానె, ఇంకా బాగా తెలుసుకుందాం" అన్న ఉద్దేశాన్ని తెచ్చుకుని చూడండి.
    
    చాలా దాంపత్యాల్లో జరిగే యదార్ధమేమిటంటే-
    
    పెళ్ళి జరిగిన తొలిరోజుల్లో...ఆ మైకంలో సాధించామన్న గొప్పతనం ఫీలింగ్ లో, ఒక స్త్రీ తనకు అన్ని వనరులతో అందుబాటులోకి వచ్చేసిందన్న హీరోయిజంతో పురుషులూ, తనకు సమాజంలో గౌరవప్రదమైన సంపూర్ణత్వం లభించిందన్న మితిమీరిన సంతోషంతో స్త్రీ ఆ కొత్త స్పర్శలతో, సెక్స్ ఉద్రేకాలతో వేరే ప్రపంచం కనబడదు. అంతవరకూ స్నేహితులుగా వున్నవారు అదోరకంగా కనిపిస్తారు.
    
    "నా సర్వస్వం నీవే!" అంటుంది ఆమె.
    
    "నా ప్రాణం నువ్వే!" అంటాడతను.
    
    ఆమె తప్ప వేరే ప్రపంచం లేదన్నట్లు ప్రవర్తిస్తూంటాడతను. ఎడతెరిపి లేకుండా సినిమాలూ, షికార్లూ, ఎడతెరిపీ లేకుండా ఎంతకూ తెగని కబుర్లూ, ముందాలోచన లేకుండా యిచ్చిపారేసిన వాగ్దానాలూ... ప్రపంచంలో ఇంతకు ముందెవరికీ పెళ్ళి కానట్లూ, తమకే అయినట్లూ, ఒకవేళ ఇంకొకరికి అయినా తమది చాలా ప్రత్యేకత సంతరించుకుందన్న అతీతమైన ఊహ... అదో మహా ప్రవాహంలా వుంటుంది. ఈ ఉద్యోగం, వృత్తీ, మిగతా మనుషులంతా... ఇవన్నీ చాలా అల్పమైనవిగా తోస్తాయి.
    
    కొన్నాళ్ళకు మైకం వదిలి అసలు జీవితంలోకి తిరిగి రావటం మొదలవుతుంది. తప్పదు కాబట్టి.
        
    అప్పటినుంచీ ఒక్కొక్క పొరా విచ్చుకుంటూ వుంటుంది. అతని ఉద్యోగం, వృత్తిధర్మాలూ, కుటుంబసభ్యులూ, బంధుఉలూ. స్నేహితులూ వీరంతా వారి స్థానాలను ఆక్రమించటం ప్రారంభిస్తారు. అదీ తప్పదు కాబట్టి!
    
    అలాగే ఆమె కుటుంబసభ్యులూ....వగైరాలూ ఎందుకంటే బాధ్యతను గుర్తించాలి. కాబట్టి అప్పటినుంచీ ఇద్దరిలో అసహనం మొదలవుతుంది. "నా భర్తకు నేనుకాక వేరే జీవితం చాలావుంది. నాకన్నా ఉద్యోగధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ఇదివరకటి నుంచీ లేని స్నేహితులు ఇప్పుడు పుట్టుకువచ్చారు. ఆయన స్నేహితులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముందేమీ అలవాట్లు లేనట్లు కనిపించేవారు. ఇప్పుడు పేకాటా, అడపాదడపా డ్రింక్ పార్టీలూ..."
    
    "ఆయన ప్రవర్తన నాకేం నచ్చటంలేదు. మొదట్లో నన్ను చాలా ప్రేమగా, ఓ దేవతలా, నేనే సర్వస్వం అన్నట్లు చూసుకునేవారు. ఇప్పుడు చాలా మార్పొచ్చింది. ఎప్పుడూ స్నేహితులూ, ఏవో వ్యాపకాలూ, ఏవేవో పనులూ...." అన్న అభిప్రాయం ఆమెలో పెరుగుతూ వుంటుంది.
    
    అలాగే ఒకసారి తల్లికీ, తమ ఇంట్లోని అక్కచెల్లెళ్ళకూ, ఏవేవో కారణాలు తరుముకొస్తూ వుంటాయి.
    
    అతనికీ ఆశ్చర్యంగా వుంటుంది. కోపంగా వుంటుంది. అసూయగానూ వుంటుంది. తన సర్వస్వం నేనే అంది. నేను తప్పితే వేరే లోకం లేదన్నది. వాళ్ళకు అంత బలమైన స్థానం వున్నదన్నమాట. నా తిండీ, తిప్పలూ, వీటిగురించి కూడా పట్టించుకోకుండా ఆ ఉరుకులూ, పరుగులూ ఏమిటి? ఫోన్ బిల్ ఎంత అవుతుందో ఆలోచించకుండా ఆ ఫోన్లేమిటి? అక్కడ కొంపలు మునిగిపోతున్నట్లు మొహం అంత మాడ్చుకుని కూర్చోవడమేమిటి?
    
    ఈ అభిప్రాయాలు అతను మనసులో పెంచుకుంటూ వుంటాడు. లోలోపల అసహనం పెరిగిపోతూ వుంటుంది.
    
    చాలా బలమైనవీ అయినా, సున్నితమైనవీ అయినా చాలా విషయాలు మనం లోతుగా ఆలోచించాలి.
    
    అతి సున్నితమైన బలమైనవి.
    
    ఇక్కడ తమాషా ఏమిటంటే అతి సున్నితంగా కనిపించేవే అత్యంత బలీయంగానూ పరిణమిస్తూ వుంటాయి. అదే సున్నితత్వం జీవితాన్ని తీర్చిదిద్దటంలో ఫలితాలు సాధించలేకపోయినా, ఇబ్బందులు కలగజేయటమనే దుష్ఫలితాలు సాధించటంలో ముందడుగు వేస్తూ వుంటుంది.
    
    భార్యాభర్తల మధ్య సున్నితమైన రహస్యాలు వుంటాయి. బహుశా వుండి తీరవలసిన రహస్యాలు.
    
    ఇక్కడ రహస్యం అనేది కుట్రకాదు, వంచన కాదు, మోసం చేయటంకాదు. అక్కర్లేని విషయంగా పక్కన వుంచటం.
    
    ఉదాహరణకు... భార్య తల్లిదండ్రులలో ఇద్దరికీ, లేక ఒకరికి కొన్ని అంతరంగిక సమస్యలుంటాయి. అవి గతానికి సంబంధించినవీ కావచ్చు. ప్రస్తుతానికి సంబంధించినవే కావచ్చు. అలాగే ఆమె అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళ గురించి పెళ్ళయిన మోజులో ఆమె ముందూ వెనకా ఆలోచించకుండా అవన్నీ భర్తకు చెప్పేస్తూ వుంటుంది. అలా చెప్పటం నిష్కాపటం కాదు, అదో గొప్ప!
    
    అలాగే భర్త తన కుటుంబసభ్యుల వ్యక్తిగత జీవితాలగురించీ, వాళ్ళ బలహీనతల గురించీ తాను వాటన్నిటికీ అతీతుడైనట్లు ముందాలోచన లేకుండా చెప్పేస్తాడు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళిద్దరే జీవితం, మిగతా అంతా ఏదో మామూలు వ్యవహారం అనుకునే మైకంలో వుంటారు కాబట్టి.
    
    కొన్నాళ్ళు పోయాక పొరలు విచ్చుకుంటూ వుంటాయి. వాతావరణం మారుతూ వుంటుంది.
    
    "మీ అమ్మగారిలా... మీ అన్నగారిలా..." అని ఆమె, "మీ నాన్న తక్కువ తిన్నాడా? మీ అక్కయ్య చేసిన పనేమిటి? నువ్వు చెప్పినదేగా?" అంటూ అతనూ... దెప్పి పొడవటాలూ మొదలుపెడతారు.
    
    ప్రతిమనిషికీ భర్తస్థానంలో వున్నాసరే, భార్యస్థానంలో వున్నాసరే, ఒకరికొకరికి చెప్పుకోలేనివీ, చెప్పుకోనవసరం లేనివీ కొన్ని గోప్యాలుంటాయి. గోప్యంగా వుంచిన ప్రతిదీ హాని కలిగించే అంతరంగిక జీవితమని అనుకోరాదు. అతను లేక ఆమె ప్రాథమికంగా ఓ మనిషి తరువాతే భర్తస్థానమో, భార్యస్థానమో ఆక్రమించుకు కూర్చుంటారు. వాళ్ళకు విలువైన హక్కులుమ్తే వుండవచ్చు. కానీ ఆ హక్కులకు కూడా ఓ పరిమితి వున్నది. చీటికీ మాటికీ హక్కును ఆసరాగా చేసుకుని సాధింపు అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోకూడదు.
    
    కొన్ని విషయాలు మీకు తెలియజెయ్యకపోతే, "ఏ కారణంచేతో చెప్పటం ఇష్టం లేదేమో' అన్న మంచి భావనతో వుండండి.
    
    ఒక్క సత్యం గుర్తించండి. కుటుంబ పరిస్థితులను బట్టీ, ఆర్ధికపరిస్థితులను బట్టీ, ఇంకా కొన్ని నిస్సహాయస్థితులను బట్టీ, అతను కొన్ని విధులను సక్రమంగా నిర్వర్తించి వుండకపోవచ్చు. కానీ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆమెకోసం ఆరాటపడేదీ, సేదదీర్చగలిగేదీ అతనే? అలాగే రోగగ్రస్తమై లేవలేని స్థితిలో వున్నప్పుడు సమస్యల వలయంలో కూరుకుపోయి వున్నప్పుడూ మిగతా ప్రపంచంకంటే చేయూతనిచ్చేది భార్యే!