సంధ్య తల్లికి తన కాలేజీ కబుర్లు చెప్పి నవ్విస్తూ వుండగా- రత్నం ఓ బట్టలమూట పట్టుకుని పైకి వచ్చింది.
    
    వెంటనే జూలీ కూడా అరుస్తూ వచ్చింది.
    
    "ఇవి చూసేనమ్మా జూలీ అరుస్తోంది" అంది రత్నం.
    
    సంధ్య ఆ బట్టలు చూసి- "ఓహ్! ఇవి చాయవి" అంది ఆమె ఆశ్చర్యంగా.
    
    "మరి జూలీ ఎందుకమ్మా అలా అరుస్తోంది?" ఆలోచనగా అంది రత్నం.
    
    కాంచన నవ్వేసి- "కొత్తవాళ్ళ బట్టలుకదా! అందుకే అరుస్తోంది. ఎంతయినా దాని విశ్వాసం దానిదే. కొత్తవాళ్ళని కానీ, వాళ్ళ తాలూకు వస్తువులు కానీ వాసన వస్తే చాలు పట్టేస్తుంది" అంది.
    
    "ఈ ఇంటి తిండి తిన్న విశ్వాసం" అంది రత్నం.
    
    "జూలీ.....జూలూ.....స్టాప్! చాల్లే ఓవర్ ఏక్షన్! అందరూ మెచ్చుకున్నారుగా.....ఇక ఆపెయ్యి! అందుకే అలా తమిళ డబ్బింగ్ సినిమాలు నిన్ను చూడద్దనేది" అంది జూలీని ఎత్తుకుని సంధ్య.
    
    సంధ్య మాటలకి కాంచనా, రత్నం నవ్వేసారు.
    
    జూలీ మాత్రం "గుర్.....ర్...." మంటూనే వుంది ఆ బట్టల్ని చూసి.
    
    పెరట్లో మొలిచిన ముళ్ళమొక్కని అశ్రద్ద చేసినట్లుగా సమస్యల్ని పెంచుకుని, ఆ తర్వాత గొడ్డళ్ళ కోసం వెదికి ప్రయాసపడతాం!
    
                                          * * *
    
    శరీరాలు ట్యూన్ అవ్వాలి. అప్పుడే మనసు రాగరంజితం అవుతుంది.
    
    ఎక్కడో లోయల్లో.....లోతుల్లో ముడుచుకున్న సంతృప్తి గులాబీ మొగ్గ విప్పుకుంటుంది.
    
    తరులతా నికుంజాలనుండి వసంతరుతువు ప్రతిఫలాన్ని కోరదు!
    
    అలాగే శృంగారంలో కూడా....అంతా ఇవ్వడమే! ప్రతిఫలాన్ని ఆపేక్షించకూడదు!
    
    నిశ్శబ్దాన్ని కడుపులో దాచుకుని మౌనంగా చూస్తోంది ఆ విభావరి!
    
    ఉండుండీ పూలవూసులూ, గాలికబుర్లూ, భారాలు, తేలికైనా నిట్టూర్పులూ, సంగీత తరంగాల్లా వినిపించీ వినిపించకుండా మటుమాయమవుతున్నాయి.
    
    కిరణ్ ఆమె నడుము ఒంపుల్నీ, ఆ నడుము క్రిందిభాగాన్ని చూస్తూ, "ఈ ఒంపు మలిచేటప్పుడు ఆ విశ్వశిల్పి వులి ఎంత కష్టపడిందో గదా!" అనుకున్నాడు.
    
    చాయ మెడ వెనక్కి తిప్పి కిరణ్ ని చూస్తూ- "ఏవిటలా ఆగిపోయావు?" అంది.
    
    "నేను.....నేను......నిజంగా ఎంత అదృష్టవంతుడ్ని చాయా!" పారవశ్యంగా అన్నాడు కిరణ్.
    
    "సర్లే.....రా!" చాయ నవ్వుతూ అని వెల్లకిలా తిరిగింది.
    
    నీటిలో సగం తడిసిన ఆమె శరీరం మంచు తడిసిన గులాబీలా వుంది.
    
    "ఖజురహో" అన్నాడతను.
    
    "ఏవిటి?" అడిగింది చాయ.
    
    "ఖజురహో శిల్పాన్ని నీకు చూపించాలి చాయా!" అన్నాడు కిరణ్.
    
    "ఇప్పుడా రాళ్ళ గురించీ, రప్పల గురించీ మాట్లాడ్తావేంటీ?" అంది చిరాగ్గా చాయ.
    
    "ఎందుకంటే...." ఆమె చెవిలో గుసగుసలాడాడు కిరణ్.
    
    "ఏయ్!" అతని భుజంలో ఆమె పన్ను గుచ్చుకుంది.
    
    "రాక్షసీ!" ప్రేమగా అన్నాడు కిరణ్.
    
    అతను ఆమె గుండెల్లో తలదాచుకుంటూ అన్నాడు- "నేను మళ్ళీ పుడ్తూనే వుంటాను. నిన్ను ప్రేమించడానికి ....ప్రేమించి పొందడానికి.....పొంది నిన్ను మళ్ళీ నాలో ఐక్యం చేసుకోవడానికి....ఈ ప్రేమ తపస్సు అంతా నీ కోసమే!"
    
    చాయ గలగలా నవ్వింది.
    
    అచ్చు ఆ నవ్వు టెలిఫోన్ ధ్వనిలా వుంది.
    
    కిరణ్ మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి ఆమెని చూడసాగాడు. అయినా రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి.
    
    టెలిఫోన్ ధ్వనిలా ఆమె నవ్వు వినిపిస్తూనే వుంది.....కాదు నిజంగా టెలిఫోన్ ధ్వనే.
    
    తను స్థాపించుకున్న శృంగార సామ్రాజ్యంలోంచి బలవంతంగా తనను బయట పడవేస్తున్న ఆ ధ్వనిని తిట్టుకుంటూ ఫోన్ వైపు చూశాడు కిరణ్.
    
    అది ఆగకుండా మ్రోగుతూనే వుంది.
    
    ఫోన్ అందుకోవడానికి లేస్తూ, చాయని పక్కకి జరపాలనుకున్నాడు. కనీ అక్కడ చాయ లేదు. అప్పటివరకూ అతని అల్లరి మురిపెంగా సహించిన తలగడ మెత్తగా పక్కకి జారిపోయింది. అతని మత్తు వదిలిపోయింది. అదంతా కల అంటే అతనికి చాలా నిరాశగా అన్పించింది.
    
    చిరాగ్గా ఫోన్ అందుకుని "హలో!" అన్నాడు.
    
    అవతలి నుండి వినిపించిన స్వరానికి అతని మత్తు పూర్తిగా వదిలిపోయింది.
    
    "గుడ్ మార్నింగ్ అంకుల్" అన్నాడు.
    
    "గుడ్ మార్నింగ్ కాదురా! గుడ్ ఆఫ్టర్ నూన్ అను. నీ వాటం చూస్తూ వుంటే ఇంకా నిద్ర మంచంమీదే వున్నట్లున్నావు. ఏ లోకాల్లో విహరిస్తున్నావు? త్వరగా ఈ లోకంలోకీ, అందులోని మన ఆఫీసులోకీ తగలడు!" గాండ్రించినట్లుగా చెప్పి, రిసీవర్ హుక్ చేశాడు భగవంతరావు.
    
    "ఎస్ అంకుల్...." అంటూనే కిరణ్ మంచంమీద నుండి టక్కున లేచి నిలబడి, జారిపోతున్న లుంగీని ఓ చేత్తో పట్టుకుని, ఇంకో చేత్తో బ్రష్ పట్టుకుని బాత్ రూంలోకి పరిగెత్తాడు.
    
    గబగబా మొహం కడుక్కుని తలకి షాంపూ పెట్టుకుంటూ పైకి చూసిన కిరణ్ కి చాయ గుర్తొచ్చింది.
    
    "కిరణ్ అలా రూఫ్ కి అద్దం వుండే బాత్ రూమ్ ఎంత బాగుంటుందో తెలుసా?" అతని జుట్టు నిమురుతూ ప్రేమగా, అన్నట్లే వుంది.
    
    "అవును చాయా.....చాలా బావుంటుంది. నువ్వు ఏం చెప్పినా చాలా బావుంటుంది. నీకు బాగుండడమే అసలు దాని అదృష్టం. నీకు బాగుండడం కోసం ఏమైనా చేస్తాను. నా తల నరికి నీ పాదాల మీద పెట్టమన్నా పెట్టేస్తాను...." అనుకుంటూ వుండగానే అతని కళ్ళు చుర్రుమని మండాయి. కళ్ళల్లోకి షాంపూ వెళ్ళింది. అవి నలుపుకుంటూ షవర్ ఆన్ చేశాడు.
    
    చల్లని నీళ్ళు శరీరాన్ని కోస్తూ క్రిందకి జారుతూ వుంటే, వెచ్చని చాయ తాలూకు ఆలోచనలు శరీరం లోపల రక్తనాళాలగుండా ప్రవహిస్తూ తమాషాగా అన్పించింది.
    
    "టర్.....ర్....ర్..."
    
    మళ్ళీ ఫోన్!