చాలామంది గంటల తరబడీ మాట్లాడారు నాయనా! నువ్వు రెండు నిమిషాలు మాట్లాడితే వచ్చే నష్టమేం లేదనుకుని అంగీకారంగా తలవూపాను.

 

    ఇద్దరం లోపలి గదిలోకి వెళ్ళాం. అక్కడ మంచం మీద కూర్చోడానికి అతను సందేహించి కిటికీలో కూర్చున్నాడు. నేను మంచం మీద కూర్చున్నాను.

 

    "మీ పేరు నాకు చాలా నచ్చింది. ఆముక్త! పోయెటిక్ గా ఉంది" అన్నాడు.

 

    నేను అతన్ని మొదటిసారిగా గమనించి చూశాను.

 

    వైట్ ఫుల్ హాండ్స్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ లో టక్ చేసుకున్నాడు. నీట్ గా దువ్వుకున్నాడు. కళ్ళకి జోడుంది. మంచి సేల్స్ రిప్రెజెంటేటీవ్ గా కన్పించాడు.

 

    ఒక అమ్మాయి చూడగానే ఇష్టపడకపోవడానికి అతనిలో ఏవీ లేదు! ఇష్టపడడానికే ఆస్కారం ఎక్కువ.

 

    "మిమ్మల్ని చూసాక పేరుకన్నా ఎక్కుపాళ్ళు అందగత్తె అన్న విషయం అర్థమైంది. మీరు నాకు నచ్చారు అన్నాడు.

 

    నేను నవ్వి "అమ్మాయి పేరూ, అందం... ఇవి చాలా! జీవిత భాగస్వామిని చేసుకోవడానికీ?" అన్నాను.

 

    నా మాటలకి అతను ఆశ్చర్యపోతున్నట్లు కళ్ళజోడు చూపుడు వేలితో పైకి తోసుకున్నాడు.

 

    "మరి అమ్మాయిలేం చూస్తారు?" అడిగాడు.

 

    "ఏమీ చూడరు! ఇష్టపడతారు. దట్స్ ఆల్! ఇష్టపడ్డాక అతనిలో అన్నీ విపరీతంగా నచ్చుతాయి" అన్నాను.

 

    అతను మాటలకోసం తడుముకున్నాడు. "నేను మీకు నచ్చానా? అదే...ఇష్టపడ్డారా?" అడిగాడు.

 

    చాలా ఇరకాటంలో పడేశావు శ్యామసుందరా! అనుకున్నాను. ఎందుకంటే నాకు సాధారణంగా అందరూ నచ్చుతారు. నిజంగా ఇతనిలో నచ్చకపోవడానికేం లేదు. గోళ్ళు కొరకడం కానీ కళ్ళు చిలికించడం కానీ, అనవసరంగా నవ్వడం కానీ, అతి తెలివి చూపించడం కానీ చెయ్యలేదు! నచ్చలేదని ఎలా చెప్పనూ?

 

    అలా అని నచ్చానని చెపితే పెళ్ళికి సిద్ధమే అనుకుంటాడు. ఏం చెయ్యాలో తోచని సంకట పరిస్థితిలో పడిపోయాను. ఇటువంటి అప్పుడు లిల్లీ వుంటే బాగుండేదనిపిస్తుంది!

 

    "నచ్చడం వేరూ...లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకోవడం వేరూ శ్యాంసుందరం గారూ?" అన్నాను.


    
    "ఏవిటి తేడా?" అడిగాడు.

 

    "యాడ్ ఫిల్మ్ లో మోడల్ కీ సినిమాలో నటించి పాత్రకి జీవంపోసే హీరోయిన్ కి వున్నంత తేడా!" అన్నాను.

 

    అతని మొహంలో పిచ్చి కన్ ఫ్యూజన్ కనిపించింది. "నాకు అర్థంకాలేదు!" అన్నాడు.

 

    "షోకేసుల్లో బొమ్మల్లా కనిపించే అమ్మాయిల్ని చూసి ఆనందించడమే కానీ భార్యగా చాలామంది అబ్బాయిలు వూహించుకోరు! తన జీవితాన్ని కంఫర్ట్ బుల్ గా వుంచే అమ్మాయి పెద్ద అందంగా లేకున్నా ఫరవాలేదనుకుంటారు. దట్ ఈజ్ కాల్డ్ ప్రాక్టికాలిటీ!" అన్నాను.

 

    "ఇప్పుడు నా విషయంలో మీకు ఏం అనిపిస్తోందో డొంకతిరుగుడు లేకుండా చెప్పండి చాలు!" అన్నాను.

 

    అతనికి నేను చాలా నచ్చానని అతడు మాట్లాడ్తున్న పద్ధతి బట్టి తెలుస్తోంది.

 

    బయట కూర్చున్న నా తల్లిదండ్రులకి అతను 'ఊ' అనడం పండగతో సమానం! నేను తొందరపడి 'నిన్ను పెళ్ళిచేసుకోను' అని చెప్పేస్తే... ఇతను వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తే తట్టుకోలేరు.

 

    అలాగని ఇతనికీ ఆశలు పెట్టలేను. బాగా ఆలోచించి "నాకు టైం కావాలి" అన్నాను.

 

    "ఎంత?" అడిగాడు.

 

    "నెల" అన్నాను.

 

    "రైట్! వచ్చే నెల ఇదే తారీఖు...అంటే ఏడో తారీఖునాడు నేను వస్తాను. అప్పుడు మీ మనసులో మాట చెప్పండి. సరేనా?" నవ్వుతూ అడిగాడు.

 

    "సరే!" అన్నాను.

 

    "పదండి" అతను కిటికీలో నుండి కిందకి దిగాడు.

 

    "వెనకాల ప్యాంట్ కి సున్నం అంటింది తుడుచుకోండి!" టవల్ అందిస్తూ చెప్పాను.

 

    "థాంక్స్" అతను అది అందుకుంటూ నా వేళ్ళు తాకాడు. నేను గమనించనట్లు ఊరుకున్నాను.

 

    ఆ స్పర్శ నాలో పెద్దగా ఏం పులకింతలు రేపలేదు! అతను మాత్రం చాలా ఆనందంగా కనిపించాడు. మేం ఇద్దరం గదిలో చాలాసేపు మాట్లాడుకోవడం వల్ల నా తల్లిదండ్రుల మొహాల్లో వెలుగు కనిపిస్తోంది.

 

    కస్టమర్ కి ప్రొడక్ట్ ని అంటగట్టెయ్యబోతున్నప్పుడు కనిపించే ఆనందం, కన్నవాళ్ళ మొహాల్లో కనిపిస్తోంది.

 

    "గూడ్స్ వన్స్ సోల్డ్...విల్ నాట్ బీ టేకెన్ బ్యాక్!" అని బోర్డు కూడా పెట్టే వీలుంటే మరీ ఆనందించేవారు!

 

    "అన్నీ మాట్లాడుకున్నారా?" అక్క అడిగింది.

 

    "కొన్ని మాట్లాడుకున్నాం" శ్యాంసుందర్ చెప్పాడు.

 

    అతని జవాబు నాకు నచ్చింది.

 

    "ఇంక బయల్దేరుదామా?" పెళ్ళికొడుకు తండ్రి అడిగాడు.

 

    నాన్న చేతులు జోడించి, అతిదీనంగా "అదే చివరి పిల్ల... ఉన్న దాంట్లో లోటు చెయ్యకుండా పెళ్ళి చేస్తాం. మా స్థితిగతులు చూశారు కాబట్టి దయతో వ్యవహరించగలరు!" అన్నాడు.