ఒకరిపై ఒకరికి మితిమీరిన అధికారాలు.
    
    అసహ్యమైన డామినేషన్ లు.
    
    ఒకరి జీవితంలో ఒకరు అర్ధం పర్ధం లేకుండా అహంకారంతో దూరటాలు.
    
    తమ జీవితాలు నాశనమైపోయాయన్న సెల్ఫ్ పిటీలు.
    
    ఆత్మన్యూనతలు- భావశూన్యతలు-స్తబ్దుగా వుండటాలు- ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు పక్కవాళ్ళ ఆలోచనలతో సంబంధంలేకుండా విచ్చలవిడిగా ఉండటాలు.
    
    భర్త ఆర్ధికపరిస్థితి అంచనా వెయ్యలేకపోవటాలు, ఒకరికొకరు భయంకరంగా లొంగిపోవటాలు.
    
    కనీస స్వేచ్చను కూడా కోల్పోయి భయపడటాలు.
    
    అక్రమసంబంధాలు.
    
    సంసారాన్నీ, పిల్లల్నీ వొదలి లేచిపోవటాలు.
    
    ఆత్మహత్యలు విడాకులు.
    
    ప్రేమలు పటాపంచలవటాలు, ప్రేమ దుర్వినియోగం చేసుకున్నామన్న కాల్చేసే అసంతృప్తి.
    
    ఇన్ని... ఇంకా కొన్ని.... ఈ సంసారబంధంలోని వాతాహవరణంలో, ప్రతిక్షణంలోనూ నిండివుంటాయి.
    
    (సాఫీగా సాగిపోయే దాంపత్యాలు, అన్యోన్యంగా సాగిపోయే సంసారాలూ...ఇవి చాలా వున్నాయి. వాటిని కాదనే ధైర్యం నాకులేదు. ఈ గ్రంథమంతా సమస్యలు లేవనెత్తే అశాంతినీ, అగ్నిని గురించే ప్రస్తావిస్తున్నాను. సమస్య లేని ప్రదేశాన్ని అభినందించటం తప్పితే చర్చించవలసిన అవసరంలేదు!
    
    ఆ రాత్రి... అలా ఎన్నో రాత్రులు నిద్రపట్టలేదు. అలా గంటలతరబడి ఆలోచిస్తూ నా కుర్చీలో కూర్చుండిపోయాను.
    
    అవును, నిజం ఈ సమస్య గురించి నేను చాలా బాధపడుతున్నాను.
    
    వీటినుంచి విముక్తికీ, సక్రమమైన భార్యాభర్తల అనుబంధానికీ మార్గముందా? వీటికి పరిష్కారముందా?
    
    వాళ్ళ తత్వాలనూ, ప్రవర్తనలనూ సక్రమమైన మార్గంలోనికి మళ్ళించగలనా?
    
    వీటికి నేను పరిష్కారం సూచించగలనా?
    
    'పరిష్కారం' అనే పరిధి దాటి చాలా ముందుకు వెళ్ళిపోయారే!
    
    మరి... మరి... అంతేనా? చూస్తూ, వింటూ ఊరుకోవలసిందేనా?
    
    సూక్తులు వాళ్ళ జీవితాలను మారుస్తాయా?
    
    అవును మొదటే... ఈ అనుబంధంలోకి అడుగుపెట్టకముందే ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలే ఈ పర్యవసానాలకు కారణాలు. కాని అంత నిశిత నిర్ణయాలు తీసుకోవటం అందరికీ సాధ్యమా? ఒకవేళ ముందు మనం అనుకున్న విధంగానే సవ్యంగా సాగి, తర్వాత తత్వాలు మారిపోవటం లేదా?
    
    ఈ బలి ఇలా కొనసాగుతూ వుండాల్సిందేనా?
    
    ఆలోచన.....ఒక్కక్షణం....కొన్ని క్షణాల ఆత్మవిమర్శతో కూడిన ఆలోచన మీకో వెలుగుబాటను ప్రసాదిస్తుంది.
    
    మంచి ఆలోచన గురించి వెంటపడవద్దు. తపస్సు చేయవద్దు. ధాన్యం చేయవద్దు. అవన్నీ అక్కర్లేదని కాదు. సాధ్యం కాకపోతే వదిలేయండి.
    
    ఈ అధ్యాయం చాలా జాగ్రత్తగా, అహానికి పోకుండా చదవండి.
    
    మీలో మార్పును తీసుకొచ్చే ఎక్సర్ సైజులకోసం నేను కసరత్తు చేయలేదు. అలాంటివి కొన్ని సందర్భాల్లో పనిచేస్తాయి. అసలు మనలో లోపాలను సరిదిద్దుకునే ఉద్దేశమే లేకపోతే ఈ ఎక్సర్ సైజ్ లు ఎంతవరకు మేలు చేస్తాయి?
    
    మిమ్మల్ని సంస్కరించటం కోసం, మనవాళ్ళలో మంచిని తీసుకురావటం కోసం, చిత్తశుద్దితో పనిచేసే ఎస్.ఎస్.వై లాంటి ఉద్యమాలు ఎంతో ముందుకొస్తుంటాయి. మానసిక పరిపక్వత కోసం కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు, కొంతమంది ఉత్తమ లక్ష్యాలున్న గురువులు, మహాయోగ సాధనలు లాంటివి చేయిస్తున్నారు. వాటివల్ల కొంత ఫలితం వుంటోంది.
    
    కాని.... అది సరిపోవటంలేదు.
    
    ఎందుకంటే... చాలామందికి అలాంటి సాధనల దగ్గరకు వెళ్లేందుకు ఎన్నో కారణాలవల్ల కుదరటంలేదు.
    
    మంచిలోకి ప్రవేశింపచేయటం కేవలం ఆలోచనవల్లే సాధ్యపడుతుంది.
    
    ఉదాహరణకు సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యాం బెనగల్ వంటి మహాదర్శకుల చిత్రాలు ఎంతో మందిని ప్రభావితులను చేశాయి. కొత్త ఆలోచనలకు పదును పెట్టాయి.
    
    నా మట్టుకు నాకు ఆ చిత్రాలు చూసి వచ్చాక రాత్రులు నిద్రపట్టేదికాదు. నా ఆలోచనా ధోరణిలో ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళు అన్ని చిత్రాల్లోనూ సమస్యలకు పరిష్కారం సూచించి ఉండకపోవచ్చు. కాని ఆయా సమస్యలను అతి సహజంగా, ప్రజలగుండెల్లోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. ఇతరులెవరూ సమీపించలేని లోతుల్లోకి తీసుకు వెళ్ళగలిగారు. అంటే వాటి పని అవి చేసుకుపోయాయి.
    
    శరత్ బాబు తన నవలల్లో స్త్రీ పాత్రలను, వారి మనోభావాలనూ, కుటుంబంలో, సమాజంలో వారు నలుగుతున్న రీతినీ, అతి హృద్యంగా, గుండెలకు హత్తుకుపోయేలా చిత్రించాడు. ఎన్నో సమస్యలు. ఆ సమస్యలను మన కళ్ళముందు ఎవరూ అందుకోలేని లోతుల్ని స్పృశిస్తూ అలా పరిచాడు. ఎక్కడా పరిష్కారం చూపలేదు. ఆ పాత్రలను మన కళ్ళముందు చిరస్థాయిగా నిలబెట్టాడు. అవి ఎలా నిలబడిపోయాయంటే... ఓ వేశ్యగురించి ఆలోచిస్తే చంద్రముఖి గుర్తుకొస్తుంది. ఓ భగ్న ప్రేమికురాలి గురించి ఆలోచిస్తే పార్వతి గుర్తుకొస్తుంది. అలాగే... ఒక్కొక్క సందర్భాన్నిబట్టి 'చరిత్రహీనుల్లో' సావిత్రి, కిరణ్మయి, 'శేషప్రశ్న'లో కమల, 'శ్రీకాంత్'లో కమల, లత....ఎన్నోపాత్రలు. ఆ పాత్రలను బట్టీ, అవి చిత్రీకరించిన తీరునుబట్టీ స్త్రీ అంటే నాకు, నాలాంటి వారికెందరికో ఎనలేని గౌరవం కలిగింది. స్త్రీపట్ల నా ఆలోచనా దృక్పథం మారిపోయింది.
    
    'కల్కి ధర్మం' అని నేను ఓ ఆధ్యాత్మిక గ్రంథం రాశాను. అందులో భగవంతుడు, అతడి ఉనికి.... ఆ విషయాలలా వదిలేయండి. ఈ గ్రంథానికి నేను రాసిన సుదీర్ఘ పీఠికలో నా జీవితాన్ని సమన్వయ పరుచుకుంటూ ఎన్నో నిజాలు చర్చించాను. కావాలని చేయలేదు. ఆ గ్రంథం రాస్తూన్నప్పుడు నాలో పొంగిపొర్లిన నిజాయితీ కలాన్ని ఆ విధంగా పరిగెత్తించింది. మీరు నమ్మండి. ఆ గ్రంథం, అందులో ముఖ్యంగా పీఠిక రూపంలో సాగిపోయిన ముందుపేజీలు  కొన్ని వేలమందిని కదిలించిపారేశాయి. ఆ పేజీలు  వందలసార్లు చదువుతూ, వాటిల్లో లీనమైపోయిన పాఠకులెంతోమంది. అలా చదివి తమ జీవితగమనాన్ని మార్చుకున్న పాఠకులెంతోమంది వున్నారు. నిజం మీరు నమ్మండి.
    
    మనసులోంచి పొంగుతున్న తీవ్రమైన తపన, నేను పరిశీలించిన మనుషులు, నా దగ్గరకొచ్చిన మనుషులు.... ఎన్నో రూపాల్లో నా ముందు నిలబడి విచలితుడ్ని చేస్తున్నారు. ఆ ప్రవాహంలోంచీ, గందరగోళంలోంచీ కొన్ని నిజాల్లోకి నేను వెళ్ళి పోతున్నాను. నేను దర్శించగలుగుతున్న నిజాలు.
    
    బహుశా... 'ఆల్ ఫాస్టేజ్' అంటారే... ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను.