"నేను బయటపడ్డానికి ఈరోజు లేటయ్యింది. ఓ ఖైదీ పిల్లి కూర తిని ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అది సరేగానీ ఇక ఎప్పుడూ జైలులోకి రాకు. జైలర్ చూశాడంటే మమ్మల్ని తిడతాడు."

 

    "ఇంకెప్పుడూ ఇటురానులే" విసుగ్గా అన్నాడు కైలాసం తన పథకం ఫెయిలయిన విషయాన్ని తలుచుకుంటూ.

 

    "కలెక్షన్ యిటివ్వు. అందరూ దీనికోసమే చూస్తున్నారు."

 

    కైలాసం జేబులోంచి డబ్బు తీసిచ్చాడు. ఆర్ముగం లెక్కపెడుతుండగా "బయటే వుంటాను. క్షణంలో వచ్చేయ్. ఈరోజు మనసేం బాగాలేదు. ఆఫ్ బిగిస్తే తప్ప బండి ఆన్ లోకి రాదు" అని మరో మాటకు అవకాశమివ్వకుండా వడివడిగా అడుగులు వేశాడు కైలాసం.

 

    ద్వారం దగ్గర గార్డు ఆపాడు.

 

    ఏమిటన్నట్టు చూశాడు.

 

    "అదిగో గాటు చూడు. ఎవరో ముసల్ది. జైల్లో వున్న తన కొడుకును చూడటానికి వచ్చిందట. వెళ్ళి టాకిల్ చెయ్. ఇంత రాత్రివేళ ఖైదీని చూపించాలంటే కనీసం వందరూపాయలన్నా యివ్వాలని చెప్పు. ఎప్పుడోగానీ ఇలాంటిబేరం తగలదు. మంచి ఛాన్స్" అన్నాడు గార్డు వందలో తన వాటాను ఎంత వస్తుందో ఆలోచిస్తూ.

 

    కైలాసం అటు చూశాడు ఎవరూ కనిపించలేదు. నిషాతో, నీరసంతో తన కళ్ళు బైర్లు కమ్మినట్టు గ్రహించాడు. ఒళ్ళు కూడా పట్టు తప్పుతోంది.

 

    మెల్లగా గార్డు చూపించినవేపుకి నడిచాడు.

 

    చెట్టుకింద మసక చీకట్లో ఒక వృద్ధురాలు కూర్చుని వుంది. దగ్గరగా వెళ్ళి నిలుచున్నాడు.

 

    "ఎవరు నువ్వు?" చిరాకుగా అడిగాడు. అతనికి మందు తాగాలన్న కోరిక ఎక్కువగా వుంది. ఇంతరాత్రిపూట నసగిరాకీ అనుకున్నాడు.

 

    తనను ఎవరో ప్రశ్నిస్తున్నట్లు తెలిసిన ఆమె లేచింది. అయితే ఆమె పూర్తిగా నిలుచోలేకపోయింది. నడుము విల్లులా వంగిపోయి వుండడంవల్ల ముఖం నేలనే చూస్తోంది.   

 

    "బాబూ! నా కొడుకు ఈ జైల్లో వున్నాడు. ఓసారి చూపిస్తావా బాబూ! చచ్చి నీ కడుపున బడతా. మనసు ఉండబట్టలేక మావూరి నుంచి వచ్చా. వాడ్ని చూసి చాలారోజులయింది బాబూ" ఆమె దీనంగా వేడుకొంది.

 

    "ఇంత రాత్రిపూట ఖైదీని చూడాలంటే చాలా కష్టం. అయితే వంద రూపాయలిస్తే చూపిస్తాను డబ్బులివ్వు. అవతల నాకు చాలా పనులున్నాయి."

 

    "బాబ్బాబూ! అలా కసురుకోకు. మా వూరినుంచి ఇక్కడికి రావడానికే డబ్బుల్లేక చాలా కష్టాలు పడ్డాను. నూర్రూపాయలంటే మాటలా? పేద ముసల్దానివి... గొప్ప మనసు చేసి నా కొడుకును చూపించు బాబూ! నా దగ్గర ఏ రూపాయో, పావలానో మిగిలున్నాయి. అవి ఇచ్చేస్తాను బాబూ! నీకు పుణ్యముంటుంది."

 

    కైలాసానికి చిర్రెత్తుకొచ్చింది. పదివేల రూపాయల ఛాన్స్ మిస్సయ్యాడన్న బాధ అతన్ని మెలిపెడుతోంది. ఇక ఆమెతో మాటలు అనవసరమనుకుని అక్కడి నుంచి కదలబోయాడు.

 

    "బాబ్బాబూ..." ఆమె ప్రాధేయపడుతూ నడవడానికి ప్రయత్నించింది కానీ అడుగు ముందుకు పడలేదు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంవల్ల, దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణంవల్ల ఆమె పూర్తిగా నీరసపడింది గొంతులోంచి మాటే బరువుగా కష్టంగా వెలువడుతోంది.

 

    వెళ్ళిపోతున్న కైలాసానికి వినపడాలని "బాబ్బాబూ! అలా వెళ్ళిపోకు. దిక్కులేని ముసల్దానిని ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోను బాబూ! ఇక్కడ ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు. బాబ్బాబూ!"

 

    కైలాసం వెనక్కి తిరిగి చూడకుండా మరింత నిర్లక్ష్యంగా నడిచాడు.

 

    అంతలో ఆర్ముగం వచ్చి కలుసుకున్నాడు.

 

    "ఎవరితో అంత కటువుగా మాట్లాడుతున్నావ్?"

 

    "ఎవరో దిక్కులేని ముసల్ది. ఆమె కొడుకు ఇక్కడ ఖైదీ అట. చూడటానికి వచ్చింది."

 

    "మరి ఎంతో కొంత లాగలేకపోయావా? మందులోకి నంజుకునే మటన్ కయినా వచ్చుండేది."

 

    "దాని దగ్గర దాని ప్రాణలు తప్ప ఇంకేం లేవు."

 

    "అది ఎవరిక్కావాలి. భలే బేరమే"

 

    "అందుకే నీ చావు నువు చావని చెప్పి వచ్చేశాను"

 

    "మంచి పని చేశావ్" ఆర్ముగం అతని భుజం మీద మెచ్చుకోలుగా చేయి వేశాడు.

 

    ఇద్దరూ జైలును దాటి రోడ్డులోకి మలుపు తిరిగారు.

 

    వైన్ షాప్ లోకి వెళ్ళబోతున్న ఆర్ముగాన్ని ఆపాడు కైలాసం, "ఈరోజు అది అనేటట్టు లేదు నాటుకు పోదాం పద" అన్నాడు.

 

    ఆర్ముగం ఇక ఏమీ మాట్లాడకుండా పక్కనున్న సారాయి దుకాణంలోకి చూశాడు.

 

    ఇద్దరూ అక్కడినుంచి బయటపడేసరికి అర్థరాత్రయింది.

 

    ఆర్ముగాన్ని ఇంటికి పంపించి తిరిగి జైలుకొచ్చాడు కైలాసం. తను మామూలుగా పడుకునే సిమెంట్ చప్టామీద కూర్చున్నాడు.

 

    ఇంతక్రితం తనను బ్రతిమలాడుకున్న ముసల్దానికోసం చూశాడు. ఇంతకు ముందున్న చోటనే పడుకుని వుంది.

 

    ఆమె అక్కడే వుండడం చిరాగ్గా అనిపించి గార్డు దగ్గరికెళ్ళాడు.

 

    "ఏం కైలాసం? ఎక్కడినుంచి... అక్కడినుంచేనా?" నవ్వుతూ అడిగాడు గార్డు.

 

    "అవును గానీ, ఆ ముసల్దాన్ని తరిమెయ్యకుండా యిక్కడ్నే ఎందుకు పడుకోబెట్టారు? దాని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు."

 

    "తరమడానికి చాలాసేపు ప్రయత్నించాను కానీ గట్టి ముసల్ది కదల్లేదు. కొడుకును చూసిగానీ పోనంది. తుపాకీ చూపించినా చలించలేదు. రాత్రిపూట చూపు కూడా సరిగా ఆనదంట. ఇక ఏమీ చేయలేక వదిలేశాను"

 

    కైలాసం ముసల్దాన్ని మనసులోనే తిట్టుకుంటూ తిరిగి చప్టామీద వచ్చి పడుకున్నాడు.

 

    కడుపులోని సారా జోలపాట పాడినట్టు నిద్రలోకి జారిపోయాడు.

 

    అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియదు. ఎవరో తనను లేపుతున్నట్టు అనిపిస్తే దిగ్గున లేచి కూర్చున్నాడు.