కాసేపు ఆలోచనలో పడ్డాడు భుజంగరావు. తన కూతురు మనసులో మెదిలింది. ముందు జాగ్రత్త చర్యగా తనో నిర్ణయం తీసుకోక తప్పదని నిర్ణయించుకుని-

 

    "మీకు ఇల్లు కావాలంటే మీరు అబద్ధం చెప్పాలోయ్. చెబుతారా?" భుజంగరావు పరిశీలనగా ఆంజనేయుల్నే చూస్తూ అన్నాడు.

 

    "అబద్ధమా...? ఛస్తే చెప్పను" గబుక్కున అనేశాడు ఆంజనేయులు.

 

    "అబద్ధం చెప్పవా!"

 

    "చెప్పను సార్!"

 

    "అయితే నీ కిల్లు ఇవ్వటం కష్టం."

 

    ఆంజనేయులు నిరాశగా లేచి నించుకున్నాడు.

 

    "నువ్వు నాకు మరీ, బాగా నచ్చావోయ్" ఆంజనేయుల్ని ఉద్దేశించి అన్నాడు భుజంగరావు.

 

    "ఎందుకు సార్ మీకు పదే పదే నేను నచ్చుతున్నాను! నచ్చితే ఇల్లు ఇవ్వొచ్చుగా..." ఆంజనేయులు తిరిగి ఆశపడ్డాడు.

 

    "వాడితో మీకెందుకు సార్! ఏ అబద్ధం ఆడాలో చెప్పండి... ఒకటి కాదు... ఇండియన్ పొలిటీషియన్స్ లా గంటలో లక్ష అబద్ధాలు చెప్పి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయగలను" అన్నాడు ఆనందం ఆంజనేయుల్ని చూపులతోటే కసురుకుంటూ.

 

    "పూర్వం సినిమాల్లో హీరో ప్రక్క ఒక కోతిగాడుండేవాడు. రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం లాగా. అలాగే కనిపిస్తున్నావ్" అన్నాడు భుజంగరావు చిరాగ్గా.

 

    ఆనందం ఏడవలేక నవ్వాడు బలవంతంగా.

 

    "ఎందుకు నవ్వుతావు... నేనేసింది జోకు కాదు. నిజమే. అవునూ రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం బాగున్నారా? ఏక్ట్ చేస్తున్నారా ఇంకా?"

 

    ముందాయనడింగిందేమిటో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు.

 

    అర్థం కాగానే బిక్కముఖం వేశారు. ఏడుపొకటే తక్కువ.

 

    "ఏమిటో ఈ కాలం పిల్లలకి ఏం తెలిసి చావదు. బొత్తిగా లోకజ్ఞానం లేకుండాపోతుంది" అన్నాడాయన ఒకింత విచారంగా.

 

    ఆనందానికి భుజంగరావుని పీకపిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. అవసరం ఉంది గనుక తమాయించుకున్నాడు.

 

    "అబద్ధం చెప్పి ఇంట్లో చేరతారా లేదా? అద్దె మాకక్కర్లేదు. రెంట్ బాధ ఉండదు. ఫ్రీగా లంకంత కొంప... ఏమంటావ్ ఆంజనేయులు...!!" ఆతృతని కనబర్చాడు భుజంగరావు.

 

    "ఎలాగోలా మాతో అబద్ధం మీరే ఆడించి గది ఇచ్చేలా ఉన్నారే? ఎందుకు సార్ అలా!" ఆంజనేయులు అయోమయంగా చూస్తూ ప్రశ్నించాడు.

 

    భుజంగరావు ఒక్కక్షణం కలవరపడ్డాడు.

 

    తన పథకాన్ని పసిగట్టాడా అని ఒకింత భయపడ్డాడు కూడా.

 

    "ఏదో మీ మీద జాలి. అంతే... వేరే ఉద్దేశ్యం లేదు" అన్నాడు భుజంగరావు.

 

    "నేనబద్ధం ఆడను గాక ఆడను" తేల్చి చెప్పాడు ఆంజనేయులు.

 

    "గొప్ప సత్య హరిశ్చంద్రుడు వచ్చాడండి. నోరు మూసుకో... నువ్వేం ఆడక్కర్లేదు అన్నీ నేనాడతాలే. అసలయినా ఓనర్లే క్లూ ఇచ్చి అబద్ధం ఆడి మా ఇంట్లో చేరిపోండని ఎక్కడన్నా, ఎవరన్నా చెబుతారా! మీకేం పర్వాలేదు బాబాయిగారు..." అన్నాడు ఆనందం.  

 

    "నీ నడవడిక ప్రతిక్షణం నన్ను ఆకట్టుకుంటుందోయ్. వెళ్ళండి... మా ఆవిడ వెనక గార్డెన్లో వుంది... నన్ను కల్సినట్టు చెప్పొద్దు... నీకు పెళ్ళయినట్టు మాత్రం చెప్పు. ఆవిడ్ని ప్రసన్నురాలిని చేసుకో... ఎలా చేసుకుంటావో నీ ఇష్టం... కేసు ఎలాగూ నా దగ్గరికొస్తుంది... నేను ఫైనల్ చేస్తాన్లే..." అని బుద్ధుడిలా అభయహస్తం పెట్టాడు.

 

    "ఓ.కే. సార్! థాంక్యూ సర్... పిన్ని గారిని ప్రసన్నురాలిని చేసుకునే పూచీ మా కొదిలేయండి సర్..." అంటూ ఆనందం, ఆంజనేయుల్ని బరబరా లాక్కుని వెళ్ళిపోయాడు.

 

    ఆంజనేయుల్ని వదలగూడదు మంచి అల్లుడిని తెచ్చుకోగలగటం గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం. ఆంజనేయులు అబద్ధమాడితే బాగుండే... లేదన్నా కనీసం ఆ కోతిగాడ్నన్నా ఆడనిస్తే బావుండు.

 

    ఎదురుగా ఉండే ఆంజనేయులి ప్రవర్తనని, అలవాట్లని, క్రమశిక్షణని బాగా స్టడీ చేసే అవకాశం వస్తుంది. అన్నీ బావుంటే ఫారెన్ లో చదువుకుంటున్న తన బిడ్డనిచ్చి పెళ్ళి చేయవచ్చు. అఫ్ కోర్స్ మ్యేరేజెస్ ఆర్ మెడిన్ హెవెన్... బట్ బ్రయిడ్ హిమ్ షుడ్ బీ సెలెక్టెడ్ బై బ్రయిడ్స్ పేరెంట్స్... అని ఆలోచిస్తున్నాడు భుజంగరావు.

 

    పెరటి తోటలో ఎర్రటి రంగు పట్టు చీరలో భుజంగరావు గారి సతీమణి భువనేశ్వరీదేవి స్వయంగా మొక్కలకు నీళ్ళు పోస్తోంది.

 

    "నిజంగా గాంధారీదేవిలా ఎంత హుందాగా ఉందిరా ఆవిడ..." చాలా భక్తి ప్రపత్తులతో దూరం నుంచే ఆవిడ్ని చూస్తూ అన్నాడు ఆంజనేయులు.

 

    "గాంధారీ, ద్రౌపది, హిడింబి లాంటి పేర్లు ఇక్కడ వాడావంటే, ఇక్కడే నిన్ను చంపేస్తాను. మరిచిపో... ఆ పేర్లు ముందు మరిచిపో..." గయ్ మని కసిరాడు ఆనందం.

 

    దాంతో చప్పున నోరు మూసేశాడు ఆంజనేయులు. దగ్గర్లో ఏదో శబ్దం వినబడడంతో తలతిప్పి చూసింది భువనేశ్వరీదేవి.

 

    వినయంగా చేతులు కట్టుకుని నిలబడిన ఆ ఇద్దరివేపు కళ్ళతోనే ప్రశ్నించింది.

 

    "వీడి పేరు ఆనందమండి... నా పేరు ఆంజనేయులండి... మిమ్మల్ని చూడ్డానికి వచ్చామండి"

 

    "నమస్కారం పిన్నిగారూ... మిమ్మల్ని ఇన్నాళ్ళూ దూరం నుంచే చూసి నమస్కారం పెట్టుకుని, ఆఫీసుకెళ్ళే వాడ్నండి. ఇప్పుడు దగ్గర్నించి చూసే అవకాశం కలిగింది పిన్నిగారూ. మా జన్మ ధన్యమై పోయింది" అన్నాడు ఆనందం ప్రపంచంలోని వినయాన్నంతా ప్రదర్శిస్తూ.

 

    ఆవిడకేం ఆ మాటలు అర్థం కాలేదు.

 

    "పిన్నిగారూ! మా ఆంజనేయులు 'కొంచెం' అమాయకుడండి... వాడికి లోకజ్ఞానం తక్కువండి. మేం ఇదే వీధిలో ఆ చివర ఉంటామండి. చాలా రోజుల వరకూ మాకు ఉద్యోగాలు రాలేదండి. ఒకరోజు మీరు వరండాలో నిలబడగా మాకు కనిపించారండి 'ఎవరీ లక్ష్మీదేవి' అని అనుకున్న వాళ్ళమై, మిమ్మల్ని మనసులోనే పూజించుకుని, ఆ రోజు మేమో ఇంటర్వ్యూకి వెళ్ళావండి అదేవిటో ఆ ఇంటర్వ్యూలో పాసైపోవడం, గబుక్కున మాకు ఉద్యోగాలొచ్చేయ్యడం జరిగిపోయాయండి. అంతే! ఆ రోజు నుంచి మేం ఉదయాన్నే ఆఫీసుకెళ్ళే టైమ్ లొ దూరం నుంచి కనబడే మీకు నమస్కారం పెట్టుకుని వెళ్ళడం అలవాటై పోయిందండి... మీ ముఖం కన్పించిన ప్రతీసారీ మాకు మంచే జరుగుతుందండీ పిన్నిగారు... కానీ..."

 

    చెప్పడం ఆపి రియాక్షన్ కోసం ఆవిడ ముఖం వేపు చూశాడు ఆనందం.