ఇప్పటి నుంచే అన్నిటినీ సమకూర్చుకోవాలి కనుక అక్కడి నుంచి కదిలాడు.

 

    మధ్యాహ్నం మూడుగంటల నుంచే నైఫ్ కోసం కాపు కాశాడు తిలక్. ఏకాంబరంతో చెప్పి సంపాదించిన కత్తిని మొలలో దోపుకున్నాడు. సాయంకాలం వరకు తనను పట్టించుకోవద్దని ఉత్తరుడికి, బుద్ధుడికి చెప్పి తోటలో ఓ మూల పాదులు చేస్తూ కూర్చున్నాడు.

 

    నాలుగు గంటలయింది.

 

    సూర్యుడు తప్పిపోయిన వీరుడిలా అయిపోయాడు. గాలి కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్టు మెల్లగా వీస్తోంది.

 

    నైఫ్, బాంబు పని ముగించుకుని బయటపడ్డారు. దూరంనుంచి వాళ్ళను గమనించిన తిలక్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కత్తిని ఒకసారి తడుముకున్నాడు.

 

    ముఖాలు కడుక్కోవడానికి నైఫ్, బాంబు కొళాయిల వేపు నడిచాడు.

 

    అక్కడ వరుసగా పది వాష్ బేసిన్ లు వున్నాయి. వాటి ముందు ఆరడుగుల ఎత్తుతో ఒంటిరాయి గోడ వుండడంవల్ల లోపల ఎవరున్నారో తెలియదు. పక్కనుంచి చూస్తే మాత్రం లోపల మొత్తం కనిపిస్తుంది.

 

    అప్పటికే కొళాయిల పక్కకు చేరిపోయాడు తిలక్.

 

    బాంబు మొదట లోపలికెళ్ళాడు.

 

    నైఫ్ ఇంక లోపలికి అడుగువేస్తాడనగా అతడిని ఎవరో పిలిచారు మెల్లగా.

 

    తన పేరు పెట్టి ఎవరో పిలవడంతో నైఫ్ ఆగాడు.

 

    తోటలో ఖైదీలు ఎవరిపాటికి వారు పనులు చేసుకుంటున్నారు. చెట్టు నీడ కింద దాదా పడుకుని వుండడం కనిపిస్తోంది.

 

    మరిక తనను పిలిచింది ఎవరో అర్థంగాక నాలుగువైపులా చూశాడు. ఎవరూ కనిపించలేదు.

 

    అంతలో బాంబు లోపలనుంచి బయటకు వచ్చాడు.

 

    "నైఫ్! ఎందుకిక్కడ నిలబడిపోయావ్? వెళ్ళి ముఖం కడుక్కుని రా! నేను గురువుగారి దగ్గరుంటాను" అని అతను ముందుకు సాగిపోయాడు.

 

    కొళాయిల వెనుక భాగాన నక్కివున్న తిలక్ బాంబు వెళ్ళిపోవడాన్ని పసికట్టాడు.

 

    తన పథకం కరెక్టుగా అమలు జరుగుతూ వుండడంతో తరువాత తను వేయాల్సిన మూవ్ కోసం ప్రిపేర్ అయిపోయాడు.

 

    అటూ ఇటూ చూసి విరిగిపోయిన నైఫ్ ముఖం కడుక్కోవడానికి లోపలికి అడుగుపెట్టాడు.

 

    కొళాయి తిప్పి ముఖంమీద నీళ్ళు చల్లుకున్నాడు.

 

    ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్న తిలక్ ఒక్క ఉదుటున లోపలికి చొరబడ్డాడు. ముందు గోడ వుండడంవల్ల తోటలోని ఖైదీలెవరికీ తను కనిపించనని అతనికి తెలుసు.

 

    ఇక ఆలస్యం చేయలేదు తిలక్. బొడ్లో వున్న కత్తిని బయటకు లాగి బలంకొద్దీ నైఫ్ తొడలో పొడిచాడు.

 

    అతను "అమ్మా" అని కేకపెట్టి కూప్పకూలిపోయాడు.

 

    తిలక్ అక్కడినుంచి కదిలి కుడివైపున దిగి, కొళాయిల వెనకకు వెళ్ళి టాయ్ లేట్ లో దూరాడు.

 

    నైఫ్ పెట్టిన కేకకు ఉలిక్కిపడి లేచాడు దాదా. మిగిలిన ఖైదీలంతా ఎక్కడి పనులు అక్కడే ఆపేసి కొళాయివైపు పరుగెత్తారు.

 

    బాధనంతా పళ్ళమధ్య బిగపట్టుకుని నైఫ్ బయటకు వచ్చాడు. అతని తొడ నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది.

 

    బాంబూ, గన్, నైఫ్ ను రెండు చేతులతోనూ పట్టుకుని మెల్లగా నడిపించుకుని ఆసుపత్రివైపు వెళ్ళారు.

 

    ఖైదీలంతా అటు తిరిగి వున్నారని గ్రహించిన తిలక్ టాయ్ లెట్ రూమ్ నుంచి బయటపడి న్యూజైలుకీ, కాంపౌండ్ వాల్ కీ మధ్య నున్న సందులో నడిచి తిరిగి తోటలో తేలాడు. ఏమీ తెలియని వాడిలా మిగిలిన ఖైదీలలో కలిసిపోయాడు.

 

    నైఫ్ ఫస్ట్ ఎయిడ్ చేసిం తరువాత బెడ్ మీద పడుకోబెట్టారు. కత్తి బాగా లోపలకు దిగినా ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వార్డర్లు వూపిరి పీల్చుకున్నారు. జైల్లో హత్య జరిగిందంటే లేనిపోని బెడద తమకు చుట్టుకుంటుందని వాళ్ళ బాధ.

 

    కాంపౌండర్ గాయాన్ని కడిగి కట్టుకట్టాడు. డాక్టర్ ఏవో రెండు ఇంజక్షన్ లు ఇచ్చాడు.

 

    ఇంటికెళ్ళడానికి బయల్దేరబోతున్న శ్రీపతితో జెయిలర్ వామనరావు "సార్! నైఫ్ ని... అదే దాదా మనిషిని ఎవరో కత్తితో పొడిచారు" అని నసుగుతూ చెప్పాడు.

 

    విషయం వింటూనే శ్రీపతి ఫైర్ అయిపోయాడు. "మీలాంటి దద్దమ్మలు జైలర్లుగా, వార్డర్లుగా వుంటే జైల్లో కత్తితో పొడుచుకోవడాలే ఏమిటి ఏకంగా మర్డర్లే జరిగిపోతాయి. అసలు జైల్లోని ఖైదీలకు కత్తులు ఎక్కడినుంచి వచ్చాయ్?"

 

    "సార్! అదీ..."

 

    "షటప్! ఇక లాభం లేదు. వాడెవడో కనుక్కుని నిలబెట్టి కాల్చేస్తాను. ఇంతకీ కత్తితో పొడిచింది ఎవడు?"

 

    "తెలియదు సార్"

 

    "కనీసం నీ పేరైనా నీకు తెలుసటయ్యా! నేనే వచ్చి కనుక్కుంటాను పద" అని విసురుగా కిందకు దిగాడు శ్రీపతి.

 

    నలుగురు గార్డులు వెంటరాగా ఆయన ఆసుపత్రికి వెళ్ళాడు.

 

    సూపరింటెండెంట్ ను చూస్తూనే నైఫ్ చుట్టూ వున్న దాదా, బాంబు, గన్ పక్కకు తొలిగారు.

 

    నీళ్ళు నిండిన కళ్ళుతో నైఫ్ రెండు చేతులూ జోడించాడు.

 

    "ఎవరు నిన్ను పొడిచింది? ముందు వాడిపేరు చెప్పు. చెట్టుకు కట్టి తుపాకీతో కాల్చి. ఎన్ కౌంటర్ లో చచ్చిపోయాడని పైవాళ్ళకు రాసేస్తాను" ఒళ్ళంతా అదురుతుండగా శ్రీపతి అడిగాడు.

 

    ఈమధ్య ఇలాంటి తలనొప్పులు ఎక్కువ కావడంతో ఆయన కోపంతో వూగిపోతున్నాడు.

 

    "ఏమో సార్, నాకు తెలియదు. ముఖానికి సబ్బు రాసుకుని వుండగా ఎవరో నా తొడలో కత్తితో పొడిచాడు సార్. కళ్ళు నలుముకుని చూసేసరికి ఎవరూ కనిపించలేదు సార్" ఏడుపు ఎక్కువ కావడంతో నైఫ్ మరిక మాట్లాడలేకపోయాడు.

 

                                *    *    *    *

 

    అన్ని రోజుల్లాగే ఆరోజూ మామూలుగా తెల్లవారింది.

 

    కనీ తిలక్ కి. అతని ఇద్దరు మిత్రులకి మాత్రం ఆరోజు కొత్తగా వుంది. సూర్యుడు తన సహస్ర చేతులతో ఆశీర్వదిస్తున్నట్టే వుంది.

 

    మరికాసేపట్లో జైలునుంచి విముక్తి లభిస్తుందన్న ఎగ్జయిట్ మెంట్ వాళ్ళను వూపేస్తోంది. అదే సమయంలో ఎన్నో భయాలు, మరెన్నో అనుమానాలు మనసుల్లో పెనవేసుకుంటున్నాయి. ఈసారైనా తమ శ్రమ ఫలిస్తుందో లేదోనన్న శంక గుండెల్లో పాము పిల్లలా పోరాడుతుంది.