ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది...

ఫ్యాషన్ అనేది స్థిరంగా ఉండదు. మారుతూనే ఉంటుంది. దీనిమీద ఒక జోక్ కూడా ఉంది. రోమ్ లో ఒకావిడ లేటేస్ట్ ఫ్యాషన్ దుస్తులు తీసుకుని, అక్కడే ట్రయల్ రూం లో వేసుకుంది. బిల్లు చెల్లించిన వెంటనే పరుగుకు లంకించుకుంది. మధ్యలో ఒక స్నేహితురాలు ఎదురై "ఎదైనా ఘోరం జరిగిందా, ఎందుకు పరిగెడుతున్నావు?" అని అడిగింది. "అవును, ఘోరాలే జరుగుతున్నాయి. ఈ నిమిషం ఉన్న ఫ్యాషన్ రెండో నిమిషానికి మారిపోతోంది. అందుకే ఈ దుస్తులు అవుట్ డేటెడ్ కాకముందే కొందరైనా చూడాలని పరుగు తీస్తున్నా" అని చెప్పిందట.

నిజంగా ఫ్యాషన్స్ చాలా త్వరగా మారిపోతున్నాయి. కొన్నాళ్ళు పొట్టి చేతులు ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు పొడవు చేతులు ఫ్యాషన్. మరి కొన్నాళ్ళు మోచేతులదాకా ఫ్యాషన్. కొన్నాళ్ళు రిస్టువాచీ దాకా చేతులుంటే ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు మెగా స్లీవ్స్., మరికొన్నాళ్ళు స్లీవ్ లెస్ .. మెడలూ అంతే- రౌండ్ నెక్, వీ నెక్, స్క్వేర్ నెక్, బోట్ నెక్, లో నెక్, హై నెక్.. ఇలా ఎన్ని రకాల నెక్కులో! ప్రతిదీ మారుతుంటుంది. పాతనీళ్ళు పోతుంటాయి, కొత్తనీళ్ళు వచ్చి చేరుతుంటాయి. ఒకసారి టాప్, బాటమ్ కు మాచ్ అయితే ఫ్యాషన్. ఇంకోసారి కాంట్రాస్ట్ గా ఉంటే ఫ్యాషన్.

జీన్సులో ఎన్ని ఫ్యాషన్లు లేవు? రంగులు, డిజైన్ల సంగతి అలా ఉంచి వెలిసిపోయి, పాతబడినట్లు ఉండే ఫేడేడ్ జీన్స్, కాలిపోయినట్టు మసిబారినవి, చిరుగులతో ఉండేవి -ఇలా ఎన్ని రకాలో! పాంటుల్లో బెల్ టైపు, న్యారో టైపు, పారలల్సు, డిజైన్ ఉన్నవి, లేకుండా ప్లైయినువి ఇలా పలు రకాలు.

కనుక ఫ్యాషన్ చేంజెస్ కు తగ్గట్టు మన దుస్తులను డిజైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫ్యాషనబుల్ గా, అధునాతనంగా కనిపిస్తాం.