ఇవి కూడా ఫేస్ ప్యాక్‌లే!

 

ఇవి కూడా ఫేస్ ప్యాక్‌లే!

 

ఫేస్ ప్యాక్ అనగానే ముల్తానీ మట్టి, పెరుగు, తేనె, పసుపు... ఇలాంటి పదార్థాలే గుర్తుకువస్తాయి. కానీ మన చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పదార్థాలనే ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. కాదేదీ ఫేస్ ప్యాక్‌కు అనర్హం అనేది వారి మాట!

 

టమాటా ఫేస్ ప్యాక్ :- వంటకాలకి రుచి తేవాలన్నా, ఒంటికి పోషకాలు లభించాలన్నా టమాటాను మించింది లేదు. అలాంటి టమాటాని మొహానికి పట్టిస్తే అందానికి కూడా తిరుగుండదంటున్నారు. ఇందులో ఉండే A విటమిన్ చర్మానికి కాంతిని ఇస్తుంది. ఇక పులుపుదనంతో కూడిన C విటమిన్ మొటిమల వంటి సమస్యలు దూరమవుతాయి. టామాటాల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

 

 

పుదీనా ఫేస్ ప్యాక్ :- టూత్‌పేస్టు దగ్గర నుంచి టీ పౌడరు వరకూ వీలైనన్ని పదార్థాలలో పుదీనాని వాడతాం. పుదీనా కలిగించే తాజాదనం, సువాసన అలాంటిది మరి! టామాటాలో ఉన్నట్టే పుదీనాలో కూడా A,C విటమిన్లు పుష్కలంగా కనిపిస్తాయి. వీటికి తోడు పుదీనాలో ఉండే మెగ్నీషియం చర్మం పైపొరలో జరిగే రక్తప్రసరణను పెరుగుతుంది, జిడ్డుదనాన్ని తగ్గుతుంది. ఇక పుదీనా ఫేస్ ప్యాక్‌తో చర్మం తాజాగా మారిపోతుందని వేరే చెప్పాలా!

 

 

బంగాళదుంప ఫేస్ ప్యాక్ :- ఎండవేడికి చర్మం కమిలిపోయినా, మచ్చలు పడినా, నల్లబడుతున్నా... బంగాళదుంప ముక్కలు పెట్టుకుంటే ఫలితం దక్కుతుందని చెబుతారు. అలాంటిది బంగాళదుంపతో ఏకంగా ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఇక చెప్పేదేముంది. బంగాళదుంపలకి కాస్తంత పెరుగుని జోడించి మొహానికి పట్టించారంటే.... యవ్వనం మళ్లీ తిరిగి వచ్చేస్తుంది.  బంగాళదుంపలో ఉండే A,B,C విటమిన్లు; ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చర్మానికి మేలు చేసి తీరతాయి.

 

 

క్యారెట ఫేస్ ప్యాక్ :- క్యారెట్ తింటే చర్మానికి ఎంత మేలో తరచూ వింటూనే ఉంటాం. క్యారెట్‌ని చర్మానికి పట్టించినా కూడా అందులోని బీటాకెరోటీన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చివేస్తుంది. చర్మంలో ఉన్న జిడ్డుని తొలగించేందుకు, వెడల్పుగా ఉండే స్వేద రంథ్రాలు కనిపించకుడా చేసేందుకు, చర్మం మృదువుగా మారేందుకు, తెల్లగా కనిపించేందుకు... క్యారెట్ ఫేస్ ప్యాక్ ఉపయోగించి చూడమని చెబుతున్నారు.

ఇవే కాదు! అవకాడో, ఓట్మీల్, గోధుమపిండి, వాల్నట్, అరటిపండు... అబ్బో! ఇలా చాలా పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. మన అవసరం, వీలుని బట్టి వీటికి తెనె, అలోవెరా, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, చందనం, పెరుగు లాంటి పదార్థాలను జోడించి ఇంట్లోనే అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకోవచ్చు.

- నిర్జర.