అమ్మ వివరాలు కనుక్కోమని తెగ పోరింది.

 

    "మన ముక్త ఫోటో ఇస్తే వెళ్ళి మాట్లాడ్తాను" అంది.

 

    "సరయూ... దాన్ని తీసుకెళ్ళి ఫోటో తీయించవే" అని వేడుకుంది అమ్మ.

 

    ఈ విషయంలో నా నిమిత్తం ఏం లేనట్లు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. వయసులో ఉన్న ప్రతి ఆడపిల్లకీ కూర్చోబెట్టీ నిలబెట్టీ పెళ్ళి సంబంధాలకోసం ఫోటోలు తీయిస్తారు. నాకు ఆ సమస్య రాదనుకున్నాను. కానీ దైవలిఖితాన్ని ఎవరు తప్పించగలరూ!

 

    "పద ముక్తా ఫోటో తీయిస్తాను" అంది పెద్దక్క.

 

    "నాకు ఒంట్లో బాగాలేదు. ఓపిగ్గా ఉన్నప్పుడు తీయించుకుంటాలే. అంతగా అయితే బస్ పాస్ మీదున్నది తీసుకెళ్ళి చూపించు" అన్నాను.

 

    "ఆ జిడ్డుమొహం ఫోటోనా? ఎంచక్కా తయారయ్యి పట్టుచీర కట్టుకుని జడనిండా పూలు పెట్టుకుని తీయించుకుందువుగాని" అంది.   

 

    నేను నవ్వి "ఆ మొగుడు జీవితాంతం ఈ జిడ్డు మొహాన్నే చూడాలి మరి! ప్రతిపూటా పట్టుచీరతో జడనిండా పూలతో చూడడుగా!" అన్నాను.

 

    "నీ వితండం నాకు నచ్చదు. మేం పెద్దవాళ్ళు ఏం చెప్తే అది విన్నాం బాబూ!" అంది.

 

    "అక్కా...ఇప్పుడు మాత్రం కాదు. నువ్వెళ్ళు. నేను తీయించుకొంటాలే" అన్నాను.

 

    "ముక్త పిన్ని పెళ్ళెప్పుడు అని పిల్లలుకూడా సరదా పడ్తున్నారు. పెద్దదానికి కంచిపట్టు పరికిణీ కావాలట పేచీ పెడ్తోందమ్మా" అంది.

 

    'ఆలూ చూలూ లేదు... అప్పుడే పిల్లలనీ, పెద్దల్లుడనీ ఫర్మాయిషులు మొదలూ!

 

    నేను ఇంట్లో ఉండడానికి విసుగుపుట్టి పుస్తకాలు తీసుకుని త్వరగా కాలేజీకి వెళ్ళిపోయాను.

 

    వైజయంతి పరుగులాంటి నడకతోవచ్చి "ముక్తా ...సందీప్ వచ్చాడు" అంది.

 

    సందీప్ కాలేజీ వదిలి వెళ్ళిపోయాక, మళ్ళీ ఇదే రావడం. నేను పెద్దగా ఇంట్రస్టు చూపించలేదు. క్లాసుకి వెళ్ళిపోయాను. వెంకట్, రఫీ వచ్చి నా బెంచీలో కూర్చుని "సందీప్ నిన్ను ఒకసారి రమ్మంటున్నాడు" అన్నారు.

 

    "నన్నా!" ఆశ్చర్యంగా చూశాను.

 

    "ఔను." అన్నారు ఒక్కసారిగా.

 

    "పదండి!" అని వెళ్ళాను వాళ్ళతోపాటు!

 

    సందీప్ ఏమీ మారలేదు. అదే స్టయిల్! ఎక్స్ స్టూడెంట్ హోదాలో సిగరెట్ వేళ్ళ మధ్య పెట్టుకునే కాలేజీలో తిరుగుతున్నాడు. నన్ను చూసి ఎవరితోనో మాటలాపి-

 

    "ఎక్స్యూజ్ మీ" అంటూ నా దగ్గరకి వచ్చాడు.

 

    అతను అంత దగ్గరగా నిలబడితే నాకు దుఃఖం ముంచుకువచ్చింది. ఎంతగా తపించిపోయానీ మనిషికోసం! తొలిప్రేమ పులకింతనీ, నిదురరాని వ్యధిత రాత్రులనీ ఎలా మరిచిపోనూ...

 

    అదే చూపు...ఇదే ఇంటిమేట్ స్ప్రే పరిమళం! నన్ను ఎంతెంత దూరం లాక్కెళ్ళాయీ!

 

    "ఆముక్తా... హౌ ఆర్ యూ?" నవ్వుతూ అడిగాడు.

 

    ఆడపిల్లల జీవితాలు అతనికి నవ్వులాటలే.

 

    "ఎందుకు పిలిచావు?" ముఖం చిట్లించి అడిగాను.

 

    "ఆముక్తా... యూ ఆర్ టూ సెంటిమెంటల్... మన ఫ్రెండ్ షిప్ అలా బ్లంట్ గా కట్ చేసెయ్యడం నాకు ఏ మాత్రమూ నచ్చలేదు" అన్నాడు సందీప్.

 

    "నా వ్యక్తిత్వం గట్టిది. అందుకే నీ సంగతి తెలిశాక కూడా ప్రలోభంలో పడి శలభంలా నీ చుట్టూ తిరగలేదు" అనుకున్నాను.

 

    "ఫ్రెండ్ షిప్ ఈజ్ స్మూతింగ్ ఆఫ్ ది పాత్ వెన్ ది గోయింగ్ బికమ్స్ రఫ్, దిజాయ్ ఆఫ్ కంపానియన్ షిప్ ఎట్ ఆల్ టైమ్స్" అన్నాడు.

 

    "నీ అభిప్రాయాలు నీవి. కానీ ఎదుటివారి అభిప్రాయం కూడా కలిసినప్పుడే నువ్వు ఆశించేలాంటి స్నేహాలు కంటిన్యూ అవుతాయి" కఠినంగా అన్నాను.

 

    "మే బీ ఐ యామ్ మిస్టేకెన్... సారీ ఫర్ హర్టింగ్ యువర్ ఫీలింగ్స్" అన్నాడు సందీప్.

 

    అతని కంఠంలో సిన్సియారిటీ నాకు తెలిసింది.

 

    "ఇంతకీ ఇప్పుడు ఎందుకు పిలిచావు?" అడిగాను.

 

    చేతిలోని కవర్ లోంచి ఓ కార్డ్ బయటికి తీశాడు.

 

    "వెడ్డింగ్ కార్డ్... టెన్తుకి నా పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి" బ్రతిమిలాడుతున్నట్లుగా అన్నాడు.

 

    నిరాసక్తంగా అందుకుని విప్పి చూశాను. ఎవరో ఎక్స్ ఎమ్.పి.గారి అమ్మాయి. పేరు ప్రేమ!"చివరికి నీ ప్రేమ నీకు దొరికిందన్నమాట!" అన్నాను.

 

    "డాడీ మాటిచ్చారుట. లాంగ్ బ్యాక్ అనుకున్నదే! నా చదువుకోసం ఆగారు" అన్నాడు.

 

    "లేకపోతే ఇప్పటికి ఇద్దరు పిల్లలుండేవారు" అన్నాను.

 

    అతను పెద్దగా నవ్వి "మా ఫ్యామిలీస్ లో ఎర్లీ మేరెజెస్ ఆర్ వెరీకామన్. ఆ...చిత్రా, వైజయంతీ వాళ్ళకి కూడా ఇచ్చాను. అందరూ తప్పకుండా రండి" అన్నాడు.

 

    "సరే..." అని రాబోయాను.

 

    హఠాత్తుగా అతను నా చెయ్యి పట్టుకుని "ముక్తా... ఐకాంట్ ఫర్ గెట్ యువర్ వర్జిన్ కిస్సెస్...ఎంతో సిగ్గుగా, ఎంతో మృదువుగా భయం భయంగా నీ చేతులు నా మెడచుట్టూవేసి, నా పెదవులకి నీ పెదవులు తగలగానే, అనాలోచితంగా నా తలని గట్టిగా అదుముకుంటూ, మునివేళ్ళమీద నిలబడి నువ్వు అందించిన ముద్దులు... ఎలా మరచిపోతాను? నీ అంత ముగ్ధంగా, అమాయకంగా వుండే అందమైన ఆడపిల్ల ఇంకెక్కదా నాకు తటస్థపడలేదు!" అన్నాడు.