మర్నాడు ఉదయం-

 

    తొమ్మిది గంటలవేళ-

 

    యాడ్ ఇండియా ఆఫీసులో వుంది మహతి- అప్పటికింకా ఎమ్.డి. మధుకర్ రాలేదు.

 

    సుమదేవ్ తో మాట్లాడుతోంది మహతి.

 

    "యూత్ అండ్ సినిమా మేగజైన్స్ అన్నీ కవరు చెయ్యమంటారు. ఓ.కే.!"

 

    జన్నీ డ్రెసెస్ లో నాగార్జున ఫోటోల్ని చూస్తూ అడిగాడు సుమదేవ్.

 

    "యాడ్స్ షుడ్ బి సింపుల్ అండ్ ఎట్రాక్టివ్... విత్ సింపుల్ కాప్షన్!"

 

    "గివ్ మీ ట్వంటీఫోర్ అవర్స్ టైమ్. కొన్ని డిజైన్స్ పంపుతాను. ఓ.కే!"

 

    "యాక్సెప్ట్ చేసిన డిజైన్స్ తోపాటు చెక్ పంపుతాను" లేచింది మహతి.

 

    మహతి యాడ్ ఇండియాలోంచి బయటికొచ్చి ఆటో ఎక్కింది.

 

    అప్పుడే-

 

    అక్కడాగిన ఆటోలోంచి దిగాడు మధుకర్. మెట్లెక్కి ఆఫీసులో కెళ్ళాడు. సుమదేవ్ ని చూసి ఆశ్చర్యపోయాడు.

 

    "సడన్ గా వచ్చారే?"

 

    "బాంబే బేస్ డ్ కంపెనీ ఓ కొత్త సోప్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది స్నోబాల్ అని. బ్రోచర్స్ అన్నీ తెచ్చాను. యాడ్స్ ప్రిపేర్ చెయ్యాలి. అలాగే జన్నీ ఫాబ్రిక్స్ మానేజింగ్ పార్టనర్ ట... వచ్చారు. దీనికి నాగార్జున మోడలింగ్ చేసాడు చూడు. ఆ మానేజింగ్ పార్ట్ నర్ చాలా ఏక్టివ్. చూస్తుంటే జన్నీ మెటీరియల్ మార్కెట్లో సూపర్ హిట్టవుతుందనిపిస్తుంది. స్టేట్ లెవెల్లో కాంపైన్ కాబట్టి మన యాడ్ ఏజెన్సీకి కూడా ప్రెస్టేజ్ ఇష్యూ. ఇదిగో చూడు."

 

    జన్నీ మెటీరియల్, నాగార్జున ఫోటోలు, యాడ్ డిటైల్స్ కు సంబంధించిన పేపర్స్ వున్న కవర్ ను ముందుకు తోసాడు.

 

    "ఇందులో క్రియేటివిటీకి బాగా స్కోపుందిగదా సర్! జన్నీ మెటీరియల్ యాడ్స్ ని నేనుస్వయంగా టేకప్ చేస్తాను" అన్నాడు మధుకర్.

 

    "అయితే నేను స్నోబాల్ మీద కూర్చుంటాను. బై ది బై! నీ పర్మిషన్ లేకుండానే స్టాఫ్ నందర్నీ పరిచయం చేసేసుకున్నాను. జమ్స్  ని సెలక్టు చేసావ్. కంగ్రాట్స్!"

 

    ఆ కాంప్లిమెంట్ కి సంతృప్తిగా నవ్వాడు మధుకర్.

 

    "ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు మాయం అయిపో... ఏదైనా హోటల్ రూం తీసుకుంటావా?"

 

    "అంత అవసరం లేదనుకుంటాను సర్! రేపు మార్నింగ్ సెవనో క్లాక్ కల్లా రఫ్ డిజైన్స్ తో మీ దగ్గరుంటాను. ఈవెనింగ్ ఓ టూ అవర్స్ మాత్రం ఫ్రెండ్స్ తో బయటకెళ్ళాలి."

 

    "డ్రింక్ పార్టీ అయితే నన్ను పిలవ్వయ్యా! ఐ లైక్ డ్రింక్స్" నవ్వుతూ అన్నాడు సుమదేవ్.

 

    తనూ నవ్వేసి, జన్నీ ఫాబ్రిక్స్ మెటీరియల్ తో తన ఛాంబర్ లో కెళ్ళిపోయారు మధుకర్.

 

    వైట్ పేపర్స్ ముందేసుకుని కూర్చున్నాడు.

 

    సాయంత్రం ఆరయింది.

 

                        *    *    *    *    *

 

    డాక్టర్ హేమలత ఎదురుగా కూర్చుంది మహతి.

 

    "నీకిది హేపీ న్యూసో, అన్ హేపీ న్యూసో నాకు తెలియదుగానీ, నౌ యూ ఆర్ కేరీయింగ్. యూ ఆర్ ప్రెగ్నెంట్."

 

    ఆ మాటకు మహతి ఎర్రటి బుగ్గలు మరింత ఎర్రగా మారాయి.

 

    "ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ మి. మేల్ బేబీ, ఆర్ ఫిమేల్ బేబీ, చెప్పు హేమా!" సంతోషంతో ఉప్పొంగిపోతూ అడిగింది మహతి.

 

    "అంత తొందరయితే ఎలా? స్కానింగ్ రిపోర్టు రావాలిగదా?"

 

    "ఎంతసేపట్లో వస్తుంది?"

 

    "టూ అవర్స్ లో వస్తుంది. రాగానే చెప్తాను."

 

    "డెలివరీకి ఇంకెన్నాళ్ళు టైముంది హేమా?"

 

    "త్రీమంత్స్!"

 

    "త్రీమంత్స్!" తనలో తను అనుకున్నట్టుగా గొణుక్కుంది మహతి.

 

    "ఓ.కె. హేమా! ఓ టూ అవర్స్ తర్వాత ఫోన్ చేస్తాను" సీటులోంచి లేచింది మహతి.

 

    "చూడు మహీ! నిన్ను, నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న స్నేహితురాలిని గనక, చివరిసారిగా అడుగుతున్నాను. పెళ్ళి కాకుండా, గర్భవతి కావడం వల్ల నీకు థ్రిల్లింగ్ గా వుండవచ్చు. కానీ మీ ఫాదర్, మదరూ, స్టేటస్ వీటి గురించి ఆలోచించావా?"

 

    "నువ్వు నన్ను ఈ ప్రశ్న అడగడం లక్షన్నరోసారి. అవునా? నా జవాబు కూడా అంతే... డిటో!"

 

    హాస్పటల్ నుంచి బయటకొచ్చింది మహతి.

 

    ఆమె మనసంతా తెలియని ఆనందంతో నిండిపోయింది. ఎవరూ చూడకుండా, తన గర్భాన్ని ఒకసారి అరచేత్తో తడుముకుని చూసుకుంది.   

 

    మధుకర్ ఎక్కడుంటాడు? సడన్ గా మధుకర్ గుర్తుకొచ్చాడు.

 

    తప్పు పని చేసింది తను. బ్యాంక్ లో కల్సినప్పుడు ఎడ్రస్ తీసుకోవాల్సింది.

 

    ఆలోచిస్తూ నడుస్తోంది.

 

                            *    *    *    *    *

 

    "పెన్నంటే భయపడేవాడు, పెద్ద రచయితలా ఎలా రాసేస్తున్నాడో చూడ్రా!" లోనికొస్తూ మూర్తి కామెంట్ చేశాడు. పక్కనే నిధి దయాళ్ కూడా వున్నాడు.

 

    మధుకర్ ఎదురుగా వున్న కుర్చీల్లో ఇద్దరూ కూర్చున్నారు.

 

    "నన్నీవేళ ఒక్కరోజు వదిలెయ్యకూడదూ" నిధి దయాళ్ వైపు చూస్తూ అడిగాడు మధుకర్.

 

    "లేదురా! ఇన్నాళ్ళూ నిన్ను డిస్ట్రబ్ చెయ్యడం ఇష్టంలేకే, నీకు దూరంగా వున్నాం. ఇవాళొక్కరోజు. అదీ మన నిధిగాడి బర్త్ డే. మా మీద కోపం లేకపోతే రా. లేకపోతే నీ ఇష్టం" మూర్తి నిష్టూరంగా అన్నాడు.

 

    "టూ అవర్స్ లో వదిలెయ్యాలి. అలాగేనా?" చేతిలోని ఫైల్ ని మూస్తూ అన్నాడు మధుకర్.

 

    "ముందు రా! తర్వాత కండీషన్స్!"

 

    మధుకర్ తన ఛాంబర్ లోంచి బయటికొచ్చి సుమదేవ్ తో చెప్పాడు.

 

    ముగ్గురూ మెట్లు దిగారు.

 

    అప్పటికే అక్కడ మారుతీకారు రెడీగా వుంది.

 

    "అప్పటికి సమయం ఆరున్నరయింది.

 

    "పార్టీ స్పాట్ ఎక్కడరా?" కారులోంచి బయటికి చూస్తూ అడిగాడు మధుకర్.

 

    మళ్ళీ స్నేహితుల్ని కలుస్తాడనుకోలేదు. స్నేహితులతోపాటు కార్లో! కొన్ని నెలలుగా అలవాటుపడిన సాధారణ జీవితం. మామూలు వ్యక్తిలా రోడ్డుమీద నడిచిన తన నడక... జీవితంలో మరో మలుపుకి ఇది నాంది కాదుగదా అన్పించింది మధుకర్ కి.

 

    "అదేరా, మన ఫ్రెండ్స్ సెంటర్, ఓపెన్ స్ట్రీట్. అక్కడ నువ్వు వస్తున్న సందర్భంగా బారంతా రిజర్వ్ చేసాడు నిధి" గర్వంగా చెప్పాడు మూర్తి.

 

    "సురేష్, విజయ్ ఎలా వున్నార్రా? వస్తున్నారా?"

 

    "వాళ్ళిద్దరూ ఎక్కడకు పోతారు గానీ, సుధారాణీ కూడా వస్తోంది. పాపం నువ్వంటే తెగ పిచ్చిరా" నిధి అన్నాడు.

 

    "సుధ వస్తోందా?" సుధారాణి అక్కడకు రావడం మధుకర్ కి ఇష్టం లేదు. కానీ తప్పదు.

 

    మరో పావుగంటకు మిత్రబృందం ఓపెన్ స్ట్రీట్ బార్లోకొచ్చింది.

 

    అప్పటికే అక్కడికి చేరుకున్న సురేష్, విజయ్, దేవకాంతలా తయారయిన సుధారాణీ... స్వాగత గీతాల్తో మధుకర్ ని ఆహ్వానించారు.

 

    కాస్ట్ లీ డ్రింక్స్ తో కాస్ట్ లీ పార్టీ ప్రారంభమైంది.

 

    తనకు నిధి దయాళ్ అందించిన హాట్ డ్రింక్ గ్లాస్ ని పక్కకు పెట్టి, కూల్ డ్రింక్ బాటిల్ ని అందుకోబోయిన మధుకర్ ని వారించి-