"విత్ ప్లజర్... సీయూ..." రిసీవర్ పెట్టేసి... రూంలోకెళ్ళి టెలిఫోన్ నెంబర్లను నోట్ చేసుకున్న చిన్న బుక్ ని తెచ్చుకుని మహతి ఫ్రెండ్సందరకు ఫోన్ చేసింది సుధారాణి.

 

    ఇరానీ రెస్టారెంట్లోంచి బయటికొచ్చాడు మధుకర్.

 

    "హలో మధూ...." ఆ పిలుపు వినబడగానే దూరంనుంచి విష్ చేసిన ఆ వ్యక్తి వేపు చూసాడు మధుకర్.

 

    స్కూటర్ ని పక్కకు తిప్పి, మధుకర్ దగ్గరకొచ్చి ఆగాడు ఆశోక్ కుమార్.

 

    అశోక్ కుమార్ ఇంటర్ మీడియట్ వరకూ అతనితో చదివిన క్లాస్ మేట్... వాళ్ళ నాన్నకు ఆఫ్ సెట్ ప్రెస్ వుండేది. ఒకప్పుడది బాగా నడిచేది. రాను, రానూ ట్విన్ సిటీస్ లో ఆఫ్ సెట్ ప్రెస్ లు పెరగడం, దానికి తోడు వాళ్ళ నాన్న, ప్రెస్ బాధ్యతలన్నీ మేనేజర్ కు అప్పజెప్పడం, ఆ మేనేజర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, లాభాల్లో నడుస్తున్న ప్రెస్ ను స్వాధీనం చేసుకోవడంతో, ఆ నమ్మకద్రోహాన్ని భరించలేక, వాళ్ళ నాన్న ఓరోజు రాత్రి పూర్తిగా త్రాగి, త్రాగి ఆ నిద్రలోనే కన్నుమూయడంతో అశోక్ కుమార్ కుటుంబం పూర్తిగా రోడ్డునపడింది.

 

    కుటుంబపోషణ, తమ్ముణ్ని, ఇద్దరు చెల్లెళ్ళను చదివించడంకోసం అశోక్ కుమార్ అకస్మాత్తుగా చదువు మానేసాడు.

 

    ఇది జరిగి అయిదేళ్ళయింది. ప్రస్తుతం అశోక్ కుమార్ ఓ పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా వుంటున్నాడు.

 

    "కార్లలో తప్ప రోడ్డుమీద కనబడని యువరాజువి... ఎవరో అనుకున్నాను... తీరా పలకరిస్తే నువ్వు..." దగ్గరగా వస్తూ అన్నాడు అశోక్ కుమార్- ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.

 

    "నీ కారూ... నీ అంగరక్షకులు ఏర్రా... ఎవరూ కనబడ్డంలేదు" మళ్ళీ అడిగాడు అశోక్ కుమార్.

 

    "ఆ సైన్యమంతా ఇప్పుడు లేదుగానీ... ఇప్పుడెక్కడ... ఆ సిన్మా ధియేటర్ లోనేనా జాబ్..." అడిగాడు మధుకర్.

 

    "సిన్మాధియేటరా... అర్నెల్లయింది మానేసి... ఎన్ని ఉద్యోగాలు మానేస్తే అంత అనుభవం వస్తుందని మా బాబు చెపుతుండేవాడులే... ప్రస్తుతం నారాయణగూడా పెట్రోల్ బంక్ లో ఉద్యోగం" నవ్వుతూ అన్నాడు అశోక్ కుమార్.

 

    "చెప్పు... నిన్నెప్పుడూ ఇలా సాదా మనిషిలా రోడ్డుమీద చూస్తానని అనుకోలేదురా... అసలేం జరిగిందో చెప్పరా..." అనునయంగా అడిగాడు అశోక్ కుమార్.

 

    "నా ఆస్తీ, అంతస్తూ అలాగే వుంది కానీ, కొన్ని కారణాలవల్ల, నేను నడిరోడ్డుమీదకు రావాల్సి వచ్చిందిరా.... వివరాలన్నీ ఎప్పుడయినా తీరిగ్గా చెప్తాను కానీ... నాకు ఉద్యోగం కావాలి- ఏదయినా చూపించగలవా..." అడగలేక అడగలేక అడిగాడు మధుకర్.

 

    "నీకుద్యోగమా? ఎవరయినా పూర్ గర్ల్ ని ప్రేమించి, ఆ అమ్మాయి కోసం, నీ ఆస్తిని త్యాగం చేసావా? మన పాత సిన్మాల్లోలాగా..." అడిగాడు అశోక్ కుమార్ విస్తుపోతూ.

 

    సర్వర్ రెండు టీలను తెచ్చి టేబిల్ మీద పెట్టాడు- చెరొకటీ తీసుకున్నారు.

 

    "నాకు ఉద్యోగం చూస్తావా, లేదా చెప్పు..." అడిగాడు మధుకర్ ఒకింత సీరియస్ గా.

 

    "పెట్రోల్ బంక్ మానేజర్ అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అదో పెద్ద ఉద్యోగం అనుకుంటున్నావా, ఉద్యోగం చూడడానికి... నేన్నీకు ఉద్యోగం చూచినట్టుగా మీ డాడీకి తెల్సిందే అనుకో, మన పని సఫా..."

 

    "అలాంటిదేం జరగదు!"

 

    "నిజంగా సీరియస్ గా అడుగుతున్నావా...?"

 

    "నిజం... పెట్రోల్ బంక్ లో బాయ్ ఉద్యోగమైనా సరే... నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అంతే... జీతమెంతైనా ఫర్వాలేదు."

 

    మధుకర్ నోటివెంట అలాంటి మాట వస్తుందని వూహించలేదు అశోక్ కుమార్- వందల రూపాయల పాకెట్ మనీని ఫ్రెండ్స్ కోసం విచ్చల విడిగా ఖర్చుచేసిన మధుకర్ ఈరోజు ఇలా...

 

    "ప్రస్తుతం మా పెట్రోల్ బంక్ లో ఇద్దరు మానేజర్లు వున్నాం. ఒకరు డే చేస్తారు. రెండో వ్యక్తి నైట్. నైట్ మానేజర్ ఓ రెణ్ణెళ్ళు సెలవు పెట్టాడు. నువ్వు చేస్తానంటే మా ఓనర్ తో చెప్తాను..."

 

    ఇద్దరూ బయటికొచ్చారు. స్కూటర్ క్రాస్ రోడ్స్ వేపు వెళుతున్నప్పుడు అడిగాడు మధుకర్.

 

    "సాలరీ... ఎంతుంటుందిరా..."

 

    సిక్స్ హండ్రెడ్..." అంటూ మధుకర్ ఏమంటాడోనని ఆగాడు అశోక్ కుమార్.

 

    మధుకర్ ఏమీ అనలేదు.

 

    అశోక్ కుమార్ బంక్ ఓనర్ తో మాట్లాడాడు.

 

    "ఆ కుర్రాడ్ని ఎక్కడో చూసినట్టుందే... నైట్ డ్యూటీ చెయ్యగలడా..." సందేహం వ్యక్తం చేశాడు ఓనర్.

 

    "వీడి తరపున నేను హామీ సర్..." అశోక్ కుమార్ భరోసా ఇచ్చాడు. ఎన్నోసార్లు అదే బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు.

 

    ఎన్నోసార్లు ఆ ఓనరు అక్కడ నిలబడగా చూసాడు. పనిలో పనిగా ఓ మూడు వందలు అశోక్ కుమార్ దగ్గర అప్పు కూడా తీసుకున్నాడు మధుకర్.

 

    రోజూ రాత్రి ఏడు గంటలనుంచి , ఒంటిగంట వరకూ డ్యూటీ.

 

    అప్పుడు టైమ్ అయిదయింది.

 

    "ఆలస్యమెందుకు... ఇవాళ నుంచే డ్యూటీకొచ్చేయ్-" అన్నాడు అశోక్ కుమార్.

 

    "సరిగ్గా... ఏడుగంటలకొస్తే సరిపోతుంది కదా."

 

    బయటకొచ్చాడు.

 

    తనకు అర్జంటుగా ఓ రూం కావాలి. ఎంతోసేపు అన్వేషణ సాగించగా చిన్న గది దొరికింది. ఆ గది కూర్చుంటే విశాలంగానూ పడుకుంటే ఇరుగ్గానూ వుంటుంది. అలాంటి గది అది.

 

                              *    *    *    *    *

 

    జీవితంలో మొట్టమొదటిసారి ఓ చిరుద్యోగం చేసి రూమ్ కొస్తున్న మధుకర్ కి ఓకొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా అన్పించింది.

 

    మర్నాడు, మధ్యాహ్నం నాలుగుగంటలవేళ-

 

    శంకర మఠంలోని సత్కార్ హోటల్ కెళ్ళాడు మధుకర్. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తోంది సుధారాణి.

 

    "హాయ్ బాసూ... అటు మహతీ, ఇటు నువ్వు ఇద్దరూ సడన్ గా ఇలా మారిపోతే ఎలా? ఒక్కసారి కాలేజీకొచ్చి చూడండి. విద్యార్ధులెలా అల్లాల్లాడిపోతున్నారో..." కాఫీ తాగుతూ అంది సుధారాణి.

 

    "మహతి ఎడ్రస్ కనుక్కున్నావా... తనకు కావల్సిన ప్రశ్న అడిగాడు మధుకర్.

 

    "తన కోసం ప్రయత్నించొద్దని... ఎపుడో... సడన్ గా తనే కలుస్తానని ఫ్రెండ్స్ కి చెప్పిందట. ఎక్కడుందో తెలీదు..."

 

    "ఎప్పుడయినా మహతి కనిపిస్తే నాకు ఇన్ ఫార్మ్ చెయ్యడం మరిచిపోకు" బిల్లు చెల్లించి బయటకొచ్చాడు.

 

    "మధూ... సాయంత్రం బార్లో కూర్చుందాం... నీతో తాగాలని నాకెన్నాళ్ళనించో కోరిక..." అలా అడుగుతున్న సుధారాణివేపు నిర్లిప్తంగా చూసాడు మధుకర్.

 

    "నేనంటే నీకిష్టమని నాకు తెల్సు సుధా... థాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్" మరో మాట మాట్లాడకుండా ముందుకు కదిలిపోయాడు మధుకర్.

 

    నిశ్చేష్టితురాలై అలా చూస్తూ వుండిపోయింది సుధారాణి.

 

                            *    *    *    *    *