దుమ్ముతో జర భద్రం

 

 



మన ఇంట్లో మనకి తెలియకుండా హాని చేసే ఎన్నో కాలుష్య కారకాలు ఉంటాయిట. యూస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సుమారు 12 రకాల హానికారక కెమికల్స్‌తో  నిత్యం మనం సహజీవనం సాగిస్తుంటామట. బయటకంటే ఐదురెట్లు ఎక్కువ హానికర కెమికల్స్ మన ఇంట్లో వుంటాయంటే నమ్మగలరా? నిజమండి, సాధారణంగా మన ఇళ్ళకు తలుపులు వేస్తుంటాం. రకరకాల పొగలు, దుమ్ము, ధూళి వంటివి ఇంటి నాలుగు గోడల మధ్య తిరుగుతుంటాయి. నిజానికి అస్తమా వంటి ఎన్నో ఉపిరితిత్తుల సమస్యలకి ఈ ఇంటి లోపలి కాలుష్యమే కారణమట. ఇందుకు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

సాధారణంగా హాలులో చెప్పుల రాక్ పెడుతుంటాం. మనం బయట నుంచి వచ్చి ఆ డస్ట్‌తో ఉన్న చెప్పులని ఆ రాక్‌లో పెడుతుంటాం. అందులో నుంచి హానికారక బ్యాక్టీరియా గాలిలో కలుస్తుంది. మన ఇంటి ఫ్లోర్, కర్పెట్లలో చేరి దాని ద్వారా మన శ్వాస నళాలలోకి చేరుతుందా బ్యాక్టీరియా. అందుకే చెప్పులని ఎప్పుడూ మన ఇంటి బయట వదలటం మంచిదిట. అలాగే ఎక్కువ చెప్పుల జతలు వాడే అలవాటు ఉన్నవాళ్ళ వాటిని బాక్సులలో భద్రపరచటం కూడా అవసరం. ఇక ఈ రోజుల్లో డ్రై క్లీనింగ్‌కి బట్టలు ఇవ్వటం సర్వసాధారణమైపోయింది. అయితే డ్రై క్లీనింగ్ నుంచి రాగానే బట్టలని వెంటనే వాడకుండా కొన్ని రోజులు ఆగటం మంచిది అంటున్నారు నిపుణులు.


డ్రై క్లీనింగ్ నుంచి వచ్చిన బట్టల్లో కొన్ని హానికర కెమికల్స్ వుంటాయిట. అవి క్యాన్సర్, న్యూరలాజికల్ సమస్యలకి కారణమవుతాయిట. అందుకే అది పూర్తిగా డ్రై అయ్యాక వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక ఇంట్లో సువాసన కోసం అంటూ కొన్ని ఎయిర్ ఫ్రెష్‌నర్స్ వాడుతుంటాం. కానీ కొందరిలో అవి ఎలర్జీకి కారణం అవుతాయి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి సహజంగా సువాసన వెదజల్లే పువ్వుల వంటివి వాడటం మంచిదని కూడా సూచిస్తున్నారు వీరు. ఇంట్లో దుమ్ము, ధూళి పేరుకుపోవటం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసు. కానీ వాటిని క్లీన్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మరింత హాని కలిగించే అవకాశం వుంది. దుమ్ము బాగా పేరుకుపోయిన చోట పొడి బట్టలతో తుడవటం వల్ల ఆ దుమ్ము మనం పీల్చే గాలిలో చేరుతుంది. అలా కాక తడిబట్టతో తుడిచి నీళ్ళల్లో ఆ బట్టని ముంచటం ద్వారా దుమ్ము పైకి లేవకుండా చూడవచ్చు. అలాగే ఇంట్లో బూజులు, దుమ్ము, ధూళి దులిపే సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు వంటివి తీసిపెట్టాలి. లేకుంటే మనం దులిపే దుమ్ముని  పీల్చి ఇబ్బందిపడతాం. వ్యాక్యూమ్ క్లీనర్స్ వంటివి వాడినా వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవటం ఎంతో అవసరం. లేకపోతే అవి చేసే సాయం కన్నా హానే ఎక్కువగా ఉంటుంది. ఇల్లు తుడవటానికి ఉపయోగించే చీపురు, బట్ట వంటి వాటిని కాస్త ఎండ తగిలే చోట పెట్టడం ద్వారా బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందవచ్చు. 

మన ఇల్లు భధ్రంగా ఉందనే నమ్మకంతో ఉంటాం మనం. కానీ పైన తిరిగే ఫ్యాన్ రెక్కలకి ఉండే దుమ్ము, కిటికీ ఊచలకి పట్టివుండే దుమ్ము, మన కాళ్ళ క్రింది మ్యాట్ ఇలా ఎన్నో మనం చూసీ చూడనట్టు వదిలేసే ప్రాంతాలలో చేరే హానికారక బ్యాక్టీరియా మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా దెబ్బతీస్తుందిట. నా ఇల్లు రక్షణ కవచంలా ఉంది అని గర్వంగా చెప్పుకునేలా ఇంలాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుతీరాలి. ఇంట్లో అందరి ఆరోగ్యం ఈ చిన్న విషయం పై ఆధారపడి వుంటుందని మర్చిపోవద్దు.



-రమ ఇరగవరపు