పిల్లల్ని కొట్టకండి.. ప్లీజ్...

 



మీ పిల్లలు మంచి తెలివితేటలతో వుండాలంటే వారిని అస్సలు కొట్టద్దు అంటున్నారు పరిశోధకులు. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే ఓ దెబ్బ వేస్తుంటారు పెద్దవాళ్ళు . అయితే అలా తరుచుగా దెబ్బలు తినే పిల్లల్లో తెలివితేటలు మందగించటం గమనించారు ఓ అద్యయనంలో. న్యూ హ్యంప్‌ష్యర్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు రెండు నుంచి నాలుగేళ్ళ వయసున్న కొంతమంది పిల్లలను ఎంచుకుని 5 ఏళ్ల పాటు వారి జీవన శైలి, తల్లిదండ్రులు వారితో వ్యవహరించే తీరు, వారంలో ఎన్నిసార్లు పిల్లలు పెద్దలతో దెబ్బలు తిన్నారు...వంటి అంశాలని పరిశీలించారు. అలాగే వాళ్ళ ఐ క్యూ స్థాయిలను పరీక్షించారు.

పిల్లలు తప్పు చేసినప్పుడు మంచి మాటలతో నచ్చ చెప్పిన పిల్లలతో పోలిస్తే దెబ్బలు తిన్న పిల్లల్లో తెలివితేటలు తక్కువగా ఉన్నాయని తేలింది. పిల్లలని ఎంత తరుచుగా కొడితే అంత వేగంగా వారి ఐ క్యూ స్థాయులు తగ్గుతాయని కూడా తేలింది ఈ అధ్యయనంలో. 

ఈ పరిశోధనలో బయటపడిన అంశం మనల్ని ఆలోచనలో పడేస్తోంది. పిల్లలని గట్టిగా అదిలించినా, అరిచినా, కొట్టినా వారి చిన్న మనసులు నొచ్చుకుంటా యని, వారి మానసిక ఆరోగ్యం మీద దాని ప్రభావం పడుతుందని మనకి తెలుసు. అయితే వారి తెలివితేటలు మీద మన ప్రవర్తన ప్రభావం పడుతుంది అని తెలిశాక... మన కోపాన్ని తగ్గించుకు తీరాల్సిందే. 

పిల్లల మనసు, మెదడు రెండింటి మీద మన కోపం ప్రభావం ఎంత వుంటుందో చూసారుగా. పిల్లలు మొండిగా వుంటే దానికి కారణం తెలుసుకోవాలి. వారి పేచీల వెనకున్న అర్థం తెలిస్తే వారిని బుజ్జగించటం సులువు అవుతుంది. అలాగే పెద్దవాళ్ళం మనమే మన కోపాన్ని అదుపు చేసుకోలేక పోతే పిల్లలకి ఎలా వస్తుంది. కాబట్టి పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పినప్పుడు కొంచెం ఓపిక పట్టి నచ్చచెబితే వారికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించండి.


-రమ