ఈ కంఠంలో ధ్వనించిన అమాయకమైన ఆశ అతన్ని నిర్లిప్తుడ్ని కావించింది. వెంటనే నోటినుంచి మాటరాలేదు. తరువాత నీరసంగా అన్నాడు "నాకేం అభ్యంతరంలేదు. కానీ ఆనాడు చీకటిలోగానీ, ఈనాడు మీ ఇంట్లో గానీ నిన్ను చూసిన నమ్రభావంతో బయట నిన్ను చూడనేమోనని సంశయం వేధిస్తోంది."

    "ఏమలా?" అంది రాగిణి తెల్లబోయి. అతని మాటల్లో ధ్వనించిన అర్ధం అవగాహనం చేసుకునేందుకు ప్రయత్నం జరిగి విఫలురాలై అతనివంక తీక్షణంగా అవలోకించింది. ఒకవేళ తను తొందరపడి నోరు జారలేదుకదా అని చింతించింది లోలోన.

    "నువ్వనుకున్నంత విశాల హృదయుణ్ణి నేను కాకపోవటం."

    ఈ మాటలంటూ ఏదో అవమానపు గాలులు సోకి అతనిచేత కళ్ళు మూయించినట్లు ఆమెవంక చూడలేకపోయాడు. ఆమె అర్ధం చేసుకుంది. వెలవెలపోయిన వదన మండలాన్ని అచ్ఛాదనం చేసుకునేందుకు ఉబలాటపడి, తగిన జాగా దొరకక, చేసేదేమీలేక అసమర్ధతతో అలానే మరుగుపడని మాలిన్యాన్ని కళ్ళనిండా ద్యోతకం చేసుకుని, చింతపడుతూ కూర్చుంది.

    రవి ఏమీచేయలేక తనలోతను వేదన చెందుతూ కళ్ళు తెరువలేకపోయాడు. ఇదే ఫలితాన్ని ఆశించా ఇన్నాళ్ళూ ఈమెగారిని సందర్శించడానికి తను ఉబలాటంచెందింది? ఆమె ఆ ఒక్క ప్రశ్నా, తన జవాబూ రెండూ ఆశనిపాతాలవలె తోచాయి.

    "నేను ఈ కబురు చేయకుండా వుంటే మీరుగా మీరు ఇక్కడికి వచ్చేవారేనా చెప్పండి?" అన్నది రాగిణి చాలాసేపటికి. అప్పుడు రవి ఆమె నేత్రద్వయంలోకి ఆరాటంగా తిలకించినప్పుడు మాలిన్యమేమీ కనబడలేదు.

    "నువ్వు నాకు కబురుచేయకుండా ఇంకో అయిదారురోజులు మిన్నకుండినట్లయితే సమాధానం ఇవ్వగలిగిన అర్హత నేను సంపాదించేవాడ్ని. ఇప్పుడేమి చెప్పగలను?"

    "అమ్మో! ఎంత బాగా మాట్లాడారో!" అంది రాగిణి.

    మళ్ళీ ఆమె "చతురులు" అంది.

    అతను ఈ ధోరణి సహించలేక "అబ్బ! నీకు కానిదాని మాటలు మాట్లాడకు. ఈ మాటలు విని రాగిణిని కాక మరెటువంటి మనిషినో చూడగలుగుతున్నాను" అని, కొంచెం ఆగి, ఆమె చిన్నబోవటం కనిపెట్టి దీనంగా "ఏం చెయ్యను? నేనింత చనువు తీసుకోవడానికి నీవే కారకురాలవయ్యావు."

    ఇప్పుడో విచిత్రం జరిగింది. ఇన్ని రోజులుగా ఈ నూతనవ్యక్తి మనసులో తొలిచివేస్తున్న భావధార ఆమె గ్రహించయినా వుండాలి, లేకపోతే ఊహించయినా వుండాలి. అదీ గాకపోతే తనూ ఏదో వెర్రిమొర్రి ఆలోచనలతో కృశిస్తూ వుండాలి. అట్లా కానిపక్షంలో అతను అనుకోకుండానే, రాలుస్తున్న తెలిసీ తెలియని మాటలు ఆమెలో అంత సంచలనాన్ని కలిగించి వుండకూడదు. ఇంతకూ ఆమె బొత్తిగా అమాయిక కాదు.

    అతను చప్పున లేచి నిలబడి ఉత్సాహంగా "రా రాగిణీ! నిన్ను బయటకు తీసుకువెడతాను. చాలా వింతలు చూపెడతాను" అన్నాడు.

    ఆమె తల విదిలించి "ఉహుఁ, నామీద దయ వుంచితే... నేను రాలేను" అంది.

    "నీవు ఆగ్రహించతగ్గ అపరాధం చేశానని ఒప్పుకుంటాను."

    "అలా అనకండి. అంత సానుభూతి చూపిస్తే భరించలేను. నాకీపూట మనసేం బాగుండలేదు. కొంచెం ఒంటరిగా ఉండనిస్తారా?"

    "వెళ్ళగొట్టటం గావును..." అన్నాడు కోపంతో రవి మండిపడిపోతూ.

    "అలా అనుకుంటే మీరే కూర్చోండి. నేను బయటకు వెడతాను."

    రవి ఏమీ మాట్లాడలేదు. బయటకు వచ్చేశాడు. అతని మనసంతా కకావికలమైపోయింది. లేనిపోని జాలి ప్రదర్శిస్తే ఇంతేననుకున్నాడు. "ఈ వ్యక్తి నా సహాయం అపేక్షించి ఇక్కడకు పిలవనంపింది. తిరిగి తన మనస్సు మారిపోగానే వెళ్ళగొట్టేస్తుంది. నేను జన్మలో ఈమె ముఖం చూడను" అనుకున్నాడు.

    కానీ ఈ నిశ్చయం అతన్ని కాలుస్తూ వెంటాడుతోంది. శశి నొచ్చుకుంటుందేమోనన్న భయం, ఆమెపట్ల ఆప్యాయత లేకపోతే ఈ విశాల ప్రపంచంలోనుంచి కనీసం కొన్నిరోజులయినా దూరంగా వుండేవాడు. అసలు ఏమీ జరగలేదని అతనికి తెలుసు. ఏమీ జరగకపోయినా, జరిగినట్లు భ్రమను కలిగించేవి ఎంతటి దారుణమైన ప్రమాదాన్ని కలిగిస్తాయో అతను గ్రహించాడు. కాలేజీనుంచి తిరిగివచ్చాక అహర్నిశలూ గదిలోనే గడపటం సాగించాడు. తరచి చూడగా అసలు జీవితంలో అందమైనదేదీ లేదనిపిస్తోంది. ఆనందమనేది కేవలం ఓ భ్రమలోని ఓ తొడుగు. ఎప్పుడో ఓసారి ఆనందమనేదాన్ని అదృష్టవంతుడెవడైనా అందుకోగలిగినా ఆ తర్వాత పరిణామాలు దీపావళి వెళ్ళిన మరునాడూ, పెళ్ళికి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయిన రోజూ, జన్మదినోత్సవం జరిగిన కొన్ని గంటల పిదపా జనించే అనివార్యమైన వైరాగ్యం, దుఃఖంలా సాటిలేనిది. అయినా ఈ మనుషులు తమకు అర్ధంకాని మనస్తత్వాలలోకూడా జొరబడుతూ వివిధ అనుభవాల కోసం ఎందుకు తాపత్రయపడతారో అర్ధంకాదు. వాళ్ళనిచూసి లోకం అసూయ చెందినా మిగిలేది ఏమీలేదు. పుణ్యాత్ముడెవడైనా జాలి చెంది ఓ కన్నీటిబొట్టు విడుస్తాడా? ధన్యుడు.

    ఆరోజు వచ్చిన కుర్రాడే తిరిగి రెండుమూడుసార్లు వచ్చి ఆమె పిలిచిందని కబురు అందించాడు. అతి నిగ్రహంతో రవి ఆ ప్రదేశానికి వెళ్లకుండా నిలద్రొక్కుకున్నాడు.

    ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. చాలామందికి మనస్సు క్షోభిల్లినప్పుడు నిద్రరాదు. మనసు క్షోభిల్లటం అలవాటు అయినవారుకూడా ఈ అభ్యాసాన్ని అతిక్రమించలేరు. ఇంచుమించు నెలరోజులు దాటింది రాగిణిని చూసి. ఎందుచేతనో యిహ చూడకుండా వుండటం దుస్సహం అనిపించింది. చాలాసార్లు ఈ తీవ్రవాంఛ అతన్ని కుదించివేసినప్పుడు త్వరత్వరగా ఏ సినిమాకో వెళ్ళిపోవటం, లేకపోతే హఠాత్తుగా శశిముందు సాక్షాత్కరించి ఆమెతో షికారు వెళ్ళిపోవటం అలవాటు చేసుకున్నాడు. కానీ ఈవేళ ఈ రెండూ అసంభవం. లేచి బయటకు వచ్చి నడక సాగించాడు.   

    ఆమె ఇల్లు సమీపిస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇప్పుడు తనని చూసి ఏమనుకుంటుంది? తాను ఏదో నేరం చేసినట్లు, అందుకు ఆమె క్రూరంగా బయటకు వెళ్ళగొట్టి శిక్షిస్తూ చాలా మనశ్శాంతి కలిగేటట్లు అనుభూతి పొందాడు. తలుపుతట్టాడు.రాగిణి నిద్రపోవటంలేదు. తలుపులు తీసి "మీరా?!" అంది ఆశ్చర్యంతో.