ఫోన్ పక్కనే వున్న సోఫాలో కూలబడిపోయి ఫోన్ కేసి కొద్ది క్షణాలు చూసి నెమ్మదిగా లేచి బాత్ రూమ్ కెళ్ళి వచ్చాడు.

 

    అప్పుడు టైమ్ సరిగ్గా 7:35:25 చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని రావటంతో ఒకింత సేదదీరినట్టయింది. కాని గుండెలోతుల్లో ఏదో అసంతృప్తి దానిని పెనవేసుకొనే ఆలోచనలు.

 

    ఎందుకు తనిలా మేడ్ గా బిహేవ్ చేస్తున్నాడు? తను నిజంగా ప్రేమించిన అపర్ణ వుండగా, ఈ ఆరాటం, ఆతృత ఎక్కడనుండి కొత్తగా పుట్టుకొచ్చాయి.

 

    కేవలం కంఠం ద్వారా అపరిచితురాలు తననింతగా ఎలా ఇంప్రెస్ చేస్తోంది?

 

    బహుశా ఆమె కంఠంలో పలికే డిఫరెంట్ ఎమోషన్స్ లో వుండే స్పష్టత తననిలా కట్టిపడేస్తోందా?

 

    అపరిచితురాలు....అపరిచితురాలు....

 

    ఎందుకిలా ఈమె తనని వెంటాడుతోంది? తనమీద ఆమెకి ఆకర్షణా? ప్రేమా?

 

    తనెవరో తెలుసా? తన వెనుక దాగిన అపారసంపదని చూసా? ఇవేమీ తెలీకుండానేనా? మగాడు మొట్టమొదటిసారి ప్రేమించే ఏ అమ్మాయి అయినా రంభలానే వుంటుందని యోగి అనటం గుర్తుకొచ్చింది.

 

    అలా అనుకున్నా... తనీపాటికే అపర్ణని ప్రేమించాడు. అమెరికాలో స్టడీస్ లో వుండగా ఫ్రెంచ్ అమ్మాయిల్ని, టర్కీ అమ్మాయిల్ని చూసి అప్పుడప్పుడు కలలు కన్న రోజులు లేకపోలేదు. అప్పట్లో తన ఎడోల్ సెంట్ ప్రపంచానికి శృంగార కలల సౌధాలకు ఆ దేశాల ఆడపిల్లలు కేంద్రబిందువులు కాకపోలేదు.

 

    ఫ్రెంచ్ అమ్మాయిలు సన్నగా, నాజూగా, స్టయిల్ గా వుంటే, టర్కీ అమ్మాయిలు మధ్యస్థంగా, బలిష్టంగా, ఆరోగ్యంగా మంచి ఎత్తులో దేవకన్యలా వుండేవారు.

 

    వాళ్ళ పాదాలు చూస్తేనే ఏదోలా అయిపోయేది మనసు. కాళ్ల బొటన వేలు చిన్నగా వుంటూ, ఆ వేళ్ళమధ్య పైభాగాలపై చిన్నపాటి నూనూగుకేశాలు ఎంత అందంగా వుండేవి?

 

    ఫ్రెంచ్ అమ్మాయిల చేతివేళ్ళు పొడవుగా, దీర్ఘంగా, లుక్స్ ని ఫ్రీజ్ చేసేలా వుండేవి. ముఖ్యంగా బొటనవేలు కాకుండా, మిగతా నాలుగు వేళ్ళు ఉంగరాలు పెట్టుకొనేచోట కనిపించే నూనూగు కేశాలు చూస్తుంటే ఎలాగో అయిపోయేది. ఆడవాళ్ళకి ప్రధానమైన అందం, ఆరోగ్యకరమైన శరీర సౌష్టవమేనేమో! టర్కీ అమ్మాయిలొస్తుంటే దొంగచూపులు చూడటం, వేగంగా కొట్టుకొనే గుండెల్ని అదుముకుంటూ, నాలిక తడారిపోతుండగా, తెగించి ఎదురెళ్ళి కేజువల్ గా చూసినట్లు చూసి, నటించడం.

 

    అప్పుడప్పుడు స్క్రూయింగ్ అండ్ ఎంజాయ్ మెంట్ ప్రధానంగా పెట్టుకున్న అమ్మాయిలు ఆఫర్ చేస్తే భయపడి పక్కకి తప్పుకొని ఆపైన పిసరంత ఆత్మన్యూనతా భావానికి లోనుకావటంలాంటి సరదా సంఘటనలన్నీ సినిమా రీళ్ళలా కళ్ళ ముందుకు కదులుతుంటే ఓ విచిత్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీధర్.

 

    మరాలంటప్పుడు కనీసం ఒక్కసారి కూడా మనిషిని చూడని, ఫోటో కూడా చూడని అమ్మాయి కంఠం తననెందుకిలా సినిమా థియేటర్ నుంచి అప్రయత్నంగానే తనని లాక్కొచ్చింది?

 

    ఇది 'లస్ట్' కాదేమో? వయసులో కంఠానికుండే ఆకర్షణకంటే శరీరానికుండే ఆకర్షణే బలమైందేమో?

 

    తన స్వభావానికి విరుద్ధంగా శ్రీధర్ ఆలోచిస్తూండగానే ఫోన్ తిరిగి రింగయింది.

 

    అది వింటూనే ఉలిక్కిపడ్డాడు.

 

    ఉద్వేగానికి లోనయ్యాడు.

 

    ఆత్రుతని అణచుకుంటూ ఫోన్ ఎత్తాడు.

 

    "హలో..." అన్నాడు శ్రీధర్ తనని తాను నిగ్రహించుకుంటూ,

 

    "హాయ్" అని వినిపించింది.

 

    ఒక్క క్షణం సందేహం, అది తనకెప్పుడూ ఫోన్ చేసే అపరిచితురాలి కంఠంలా లేదు.

 

    "ఎలా వున్నావ్? ఏమిటి విశేషాలు?" తిరిగి ఫోన్ కి అటువేపునించి విన్పించింది.

 

    అది ఖచ్చితంగా అపరిచితురాలి కంఠంలా లేదు.

 

    కొత్తగా మరలా ఈ అమ్మాయి ఎవరు?

 

    "ఏమిటి ఏం మాట్లాడవ్?" తిరిగి ఆమె మాట్లాడింది.

 

    అది అపర్ణ కంఠం కాదు.

 

    జయారెడ్డి కంఠం అంతకంటే కాదు.

 

    మేరీ కంఠం అసలే కాదు. మరెవరిది?

 

    "ఎవరు మాట్లాడేది? మీకెవరు కావాలి? ఏ నెంబర్ కావాలి?" ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్.

 

    ఫోన్ లో కొద్ది క్షణాలు నిశ్శబ్దం.

 

    శ్రీధర్ ప్రశ్నలకు అటువేపునుంచి సమాధానం లేదు. డైరెక్ట్ కరెంట్ పాసింగ్ సౌండ్ తప్ప మరేమీ విన్పించడంలేదు.

 

    "మీరెవరో నాకు తెలియదు. ఎవరికి ఫోన్ చేయాలనుకుని ఎవరికి చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి" ఈసారి శ్రీధర్ కంఠంలో ఒకింత అసహనం తొంగిచూసింది.

 

    అయినా సమాధానం లేదు.

 

    "ప్లీజ్...నాకు వేరే ఫోన్ వచ్చేది వుంది. మీరు డిస్కనెక్ట్ చేస్తే, దాన్ని నేను రిసీవ్ చేసుకునే అవకాశం వుంటుంది" ఈసారి చిరాకుని ప్రదర్శిస్తూనే అన్నాడు శ్రీధర్.

 

    ఆ మరుక్షణం ఫోన్ డిస్కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది.

 

    రిలాక్స్ డ్ గా ఫీలయ్యాడు శ్రీధర్.

 

    అంతలోనే తిరిగి ఫోన్ రింగయింది.

 

    వెంటనే లిఫ్ట్ చేశాడు శ్రీధర్.

 

    అయినా వెంటనే హలో అనలేదు ఎప్పటిలా....


    
    "టైమ్ సెన్స్ పాటించకుండా తప్పు చేసింది నువ్వు -ఇప్పుడీ మూగ నోమేమిటి?"

 

    గుర్తుపట్టేసాడు శ్రీధర్.

 

    అది అపరిచితురాలి కంఠం.