"రోష్ణీ! నువ్వు కోటీశ్వరురాలివి- నీలాంటి దానికి- నాలాంటి వాడిమీద అభిమానం కలగడం - అరుదైన విషయం- కానీ నా అదృష్టం- నువ్వు కూడా నన్ను ప్రేమించావు- ప్రేమ ఒక్క మనసుకే పరిమితమా- చెప్పు-" ఆమె కళ్ళవేపు సూటిగా చూస్తూ అడిగాడు అవినాష్.

 

    "నువ్వేం అంటున్నావో నాకేం అర్థం కావడం లేదు-" రోష్ణి చిన్నపిల్లలా అంది.

 

    "నేనేం అంటున్నానో తర్వాతెప్పుడైనా చెప్తాను- కానీ- ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద- చేపల కంపు-" అన్నాడు అవినాష్.

 

    ఇద్దరూ లేచారు. తడి ఇసుక మీద నడుచుకుంటూ, వలల్ని నేస్తున్న జాలర్లని, జాలరి పడుచుల్ని దాటుకుంటూ, ఆ మధ్యలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీని దాటుకుంటూ,

 

    ఇద్దరూ-

 

    చాలా దూరం నడిచొచ్చారు.

 

    సముద్రం, సముద్రం లోంచి పిల్లల్లా వస్తున్న అలలు. ఆ అలల దూకుడుకు పరవశిస్తున్న నేల. ఆ నేలకు కొంచెం దూరంలో రోడ్డు. ఆ రోడ్డు పక్కన సరుగుడు తోట. ఆ తోటకు వెనక-

 

    ఎర్రమట్టి దిబ్బలు.

 

    ఆ ఎర్రమట్టి దిబ్బలు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు.

 

    కానీ ఆ దిబ్బలు బాగుంటాయి. అమ్మాయిల గుండెల్లా నున్నగా ఉంటాయి. అమ్మాయిల కళ్ళల్లా సన్నగా ఉంటాయి. అమ్మాయిలా ఆలోచనల్లా లోతుగా ఉంటాయి. అమ్మాయిలా కోరికల్లా అసంతృప్తిగా ఉంటాయి.

 

    రోష్ణి, అవినాష్ ఎర్రమట్టి దిబ్బల దగ్గరికి వచ్చారు.

 

    ఆ ఎర్రమట్టి దిబ్బలు లేత గోధుమరంగులో ఉన్నాయి. వాటి సౌందర్యం, ముడుచుకు పోతున్న లేత గులాబీల్లా ఉంది.

 

    ఇద్దరూ ఆ దిబ్బలకు ఆనుకుని పక్కపక్కనే కూర్చున్నారు.

 

    "ఇవేళ నువ్వెంత అందంగా ఉన్నావో తెల్సా-" అన్నాడు అవినాష్.

 

    "నాకు తెలీదు-" అవినాష్ ని వెక్కిరించాలన్న ఉద్దేశంతో చెప్పింది రోష్ణి.

 

    "అసలు౦ నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెల్సా-"

 

    కళ్ళు, ముక్కు, చెవులు, కనురెప్పలు, పెదిమలు, కాళ్ళూ, చేతులూ, చేతివేళ్ళూ, భుజాలూ, నడుం, వీపు, నడక కాదు-" అని చాలా తెలివితేటలుగా అన్నాడు అవినాష్.

 

    రోష్ణికి ఆ మాటలేం అసలు అర్థం కాలేదు. కానీ, చాలా ఆకర్షణగా చాలా విచిత్రంగా ఉంది అవినాష్ పొగడ్త.

 

    అందుకే ఆమె ఆశ్చర్యపోతోంది.

 

    తనలో అందం- తన శరీరం ఎక్కువ భాగాల్లో లేదని అంటున్నాడు అవినాష్.

 

    తన అందం ఎక్కడ ఉంది?

 

    ప్రశ్నించుకుంది తనలో తానే?

 

    జవాబు దొరకలేదు రోష్ణికి.

 

    "నా అందం ఎక్కడ ఉందిట-" ఆసక్తిగా అంది రోష్ణి.

 

    "నీ అందం ఎక్కడ ఉందో- నాకేం తెల్సు- నువ్వెప్పుడైనా చూపించావా-" అవినాష్ అడిగాడు.

 

    ఆ ప్రశ్నకు రోష్ణీకి ఏమనాలో తెలీలేదు.

 

    రెండు, మూడు నిమిషాలసేపు ఆ అమ్మాయి ఆలోచనలో పడింది.

 

    ఆ తర్వాత అంది.

 

    "ఏం చూపించాలట-"

 

    "ఏం అడిగితే- అది చూపిస్తావా-" ధైర్యంగా అడిగాడు అవినాష్.

 

    "నువ్వడిగితే-" ఆ తర్వాత మాట్లాడలేక పోయింది రోష్ణీ.

 

    అవినాష్ కి ఆ సమయంలో చాలా ఆనందం వేసింది.

 

    తన 'రోష్ణి వ్యూహం' సరైన దారిలో వెళ్తోంది.

 

    రోష్ణి గర్భవతి కావడం ఖాయం. కొన్ని లక్షలకు తను యజమాని కావడం ఖాయం- ధన్ రాజ్ తెలివితేటలు కాలి వేలి గోళ్ళకు సరిపోవు... ధన్ రాజ్ కూతురెంత? తను పెద్దవాడు కావాలి? ఏ రూపాయి ఎలా వచ్చింది? ఏ వేలు ఎలా వచ్చాయి- అన్నది ప్రశ్న కాదు. ఏ అమ్మాయి ఎలా వచ్చింది- అన్నది ప్రశ్న.     

 

    ఆ ప్రశ్నకు జవాబు లెప్పుడూ ఉంటాయి.

 

    అమ్మాయిలుంటారు. అందాలుంటాయి. అమ్మాయిలు నిన్నూ, నన్నూ ప్రేమిస్తానంటారు. ప్రేమించమంటారు.

 

    అబ్బాయిలు కూడా అదే అంటారు. గోడమీంచి, లైబ్రరీలో పుస్తకాల షెల్ప్ ల చాటుల లోంచి, కొబ్బరిచెట్ల సందులోంచి, మట్టిగోడల మాటులోంచి అమ్మాయిలు సైగ చేస్తారు. కానీ-

 

    అమ్మాయిలు- వాళ్ళూ మనుషులే- నేలమీద విత్తనాల లాటి అమ్మాయిలు. విత్తనాలకు తల్లుల్లాంటి అమ్మాయిలు- తల్లుల నుదుట బొట్టులాంటి అమ్మాయిలు.

 

    ఈ దేశంలో పేదరికం అంటే పాపం- అమ్మాయిలంటే ఆ పేదరికం కంటే పాపం-

 

    ఈ దేశంలో అమ్మాయి అంటే సుఖం.

 

    ఈ దేశంలో అమ్మాయి అంటే కోరిక.

 

    "నేనడగనా" అన్నాడు అవినాష్.

 

    "అడుగు" సాదాగా అంది రోష్ణి.

 

    రోడ్డుకి ఇరవై గజాల దూరంలో, అడ్డుగా ఉన్న కొండకు వెనకనున్న ఎర్రమట్టి దిబ్బల మధ్య వాళ్ళిద్దరూ ఉన్నారు. కొండకు ఆనుకుని వరసగా, దట్టంగా సరుగుడు చెట్లు.

 

    ఆ ప్రాంతానికి సాధారణంగా ఎవరూ రారు.

 

    ఎప్పుడో ఏ సమయంలోనో ఏకాంతం కోరే జంటలు, కొండెక్కి మంచి ఫోటోలు తీసుకోవాలన్న కోరికతో కొంతమంది ఫోటోగ్రాఫర్లు అక్కడకి వస్తూంటారు.

 

    "నాకు నువ్వు కావాలి-" అడిగాడు అవినాష్.

 

    ఆ అమ్మాయి ఒక్కక్షణం తల దించుకుని ఆలోచించింది. ఆ తర్వాత అంది-

 

    "నన్నిబ్బంది పెట్టకు అవినాష్- పెళ్ళయ్యాక- పెద్దల సాక్షిగా జరిగితే- నీకూ, నాకూ గౌరవం-" నెమ్మదిగా అంది.

 

    "పెద్దల సాక్షిగా జరుగుతుందిలే- కానీ, ఇప్పుడున్నది నువ్వూ, నేనే కదా- ఎవరికి తెలుస్తుంది- చెప్పు-" ఆమె భుజాలమీద చేతులు వేస్తూ అన్నాడు.