"ఓ..." టక్కున జవాబు చెప్పిన నానీ రీల్ మొత్తం తెరిచాడు "కానీ నిజమెక్కడా కనిపించలేదు. అంతా ఖాళీ" అక్కడున్న అందరికీ ముచ్చెమటలు పోశాయి.

 

    ఇన్ని రోజులుగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫిల్మ్ రీల్ అమాయకంగా తెరిచిచూసి నిజంకోసం వెదికాడు. దురదృష్టకరంగా ఎక్స్ పోజ్ చేసేశాడు.

 

    ఒక నేరస్థుడిగా అప్పారావుని రెడ్ హెండెడ్ గా పట్టుకున్న డి.జి.పి.కి. నిజానికి రాందేవ్ హత్య విషయంలో చాలా అవసరమే... కాని ఆధారం చేజారిపోయింది.

 

    "తెరవాల్సింది కాదు నానీ" డి.జి.పి. అన్నాడు నెమ్మదిగా.

 

    "కానీ 'నిజం' వుంటుందంటేనూ తెరిచానన్నమాట" తనకి అమ్మ, తాతయ్యలు నేర్పిన 'నిజం' పైగల ఆసక్తిని అక్కడా వ్యక్తం చేశాడు.

 

    "ఇప్పుడేమౌతుంది" డి.జి.పి.నే అడిగాడో విలేఖరి ఉద్వేగంతో.

 

    డి.జి.పి.నిశ్చలంగా అన్నాడు "నేరాన్ని నిరూపించడానికి ఆధారాలు అవసరమేమో కాని ఆధారమొక్కటే హంతకుడ్ని పట్టివ్వదు. ఈ విషయం తెలీని అప్పారావు, హరి రాందేవ్ హత్య మొదలుకుని మోటివ్స్ తోసహా అంతా అంగీకరించారప్పుడే."

 

    నానీ ఆసక్తిగా వింటున్నాడు.

 

    'నిజం' కూడా మూసుకుని వున్న ఫిల్మ్ రీల్లో సరైన రసాయనిక చర్యతోనే 'నిజం'గా ప్రపంచానికి దర్శనమిస్తుంది తప్ప తెరిచి చూస్తే శూన్యంగా మారుతుందని సరిగ్గా అప్పుడే తెలుసుకున్నాడు. ఆ సాయంకాలం హరిత నానీలతో యశస్వి బయలుదేరుతుంటే రామసూరి వచ్చాడు చివరగా. "సాధించావు యశస్వీ! అంతకుమించి స్తబ్ధంగా పడివున్న నన్నూ కదిలించి ఎందుకీ ప్రయాస అనుకుంటున్న నా బ్రతుక్కి ఓ పరమార్ధముందని పరోక్షంగా తట్టిలేపావు. అదేం చిత్రమో... మీరెళ్ళిపోతూంటే ఏళ్ళతరబడి నాతో కలిసి మెలిసిన నా కుటుంబమే దూరమైపోతున్నంత బాధగా వుందయ్యా. చూశావా... వద్దంటున్నా నా కళ్ళలో నీళ్ళెలా తిరుగుతున్నాయో" నానీని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. "ఒరేయ్ సత్యాన్వేషీ... నువ్వు వెయ్యేళ్ళు బ్రతకాలిరా... నీ బ్రతుకు ఎందరికో మార్గదర్శం కావాలి. అన్నట్టు వీళ్ళు నన్ను మర్చిపోతా రేమో... గుర్తుచేస్తుండేం! ముఖ్యంగా వీళ్ళిద్దరి పెళ్ళికార్డూ నువ్వు దగ్గరుండి పంపించు. మరేం లేదు... మనిద్దరం వీళ్ళకి పెళ్ళిపెద్దలమై పోదామన్నమాట"తలూపాడు నానీ అర్థమైందన్న మాట అన్న ధోరణిలో.  

 

                                      *    *    *

 

    ఉదయం పదకొండు గంటలకి.

 

    అనకాపల్లి కోర్టుహాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.

 

    నానీ తల్లి మరణం తెలిసిన తుంపాల ప్రజలేకాక కొన్ని రోజులుగా నానీ కథని పత్రికల్లో చదివిన చాలామంది నానీని చూడాలని వచ్చారక్కడికి.

 

    పావని హత్యలో ఎక్యూజ్ డ్ గా రప్పించబడిన చంద్రం, కాంతం, సరళ, రాజారావులతోబాటు తాతయ్య విశ్వేశ్వరశాస్త్రికూడా అక్కడున్నారు.

 

 

    బోనులోకి అడుగుపెట్టిన మనవడ్ని చూడగానే విశ్వేశ్వరశాస్త్రి కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.

 

    ఇంకా డ్యూటీలో చేరకపోయినా హరితతోబాటు యశస్వికూడా గాలరీలో కూర్చుని చూస్తున్నాడు ఉత్కంఠగా.

 

    అమ్మకోసం నాన్నతోబాటు తన వాళ్ళనందర్నీ శిక్షించడానికి సిద్ధపడే శిక్షాస్మృతిలా వున్న నానీని చూస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైకి లేచాడు.

 

    కోర్టు హాలంతా టెన్షన్ గా చూస్తూంది ఇప్పుడు పెదవి విప్పబోయే నానీని.

 

    కోర్టుకి అభివాదాన్ని తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూషన్ వాదాన్ని ప్రారంభించాడు మరో రెండుక్షణాల వ్యవధిలో.

 

    "యువరానర్... పందొమ్మిదివందల ఎనభై ఆరు ఆగస్టు ఎనిమిదో తేదీన తుంపాల గ్రామ వాస్తవ్యురాలైన శ్రీమతి వేదుల పావని అనబడే యువతి కాలిన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ చేయబడినప్పుడు మెడికోలీగల్ కేస్ గా ధృవపరచబడింది. గౌరవనీయులైన న్యాయమూర్తి సమక్షంలో మరణ వాంగ్మూలం సైతం రికార్డ్ చేయబడింది. అయితే తర్వాత పోలీసు పరిశోధనలో మరణించేముందు శ్రీమతి పావని చెప్పినట్టు ఆమె గాయపడింది ప్రమాదం మూలంగా కాదని, ఒక పథకం ప్రకారం ఆమె పై హత్యాప్రయత్నం జరిగిందని ఋజువు కావడంతో సుమారు పదకొండురోజులు క్రితం హత్యచేయాలన్న తలంపు ప్రేరణ హత్యకోసం పథకం అనే అభియోగాలతో ప్రతివాదులపై ఐ.పి.సి. 302, 304 అండ్ ఐ.పి.సి. 307సెక్షన్ల ప్రకారం ఇదే కోర్టులో చార్జిషీటు దాఖలు చేయబడింది. అయితే ఈ సంఘటనలో అతి కీలకమైన సాక్షి మాస్టర్ నానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అదృశ్యం కావడంతో కేసు ఎడ్జార్న్ మొదలై కోర్టువారిని అర్థించడం జరిగింది. యువరానర్! ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్ ప్రకారం గౌరవనీయులైన ఒక న్యాయమూర్తి సమక్షంలో మరణ వాంగ్మూలం రికార్డు చేయబడినా అది అనుమానించదగ్గది అయినప్పుడు అందులో నూరుశాతం వాస్తవం లేదని కోర్టు అభిప్రాయపడినప్పుడు ఆ సంఘటనకి ప్రేరణని అందులో దోషుల్ని విచారించడం తప్పనిసరని చట్టం నిర్దేశించిన సూత్రమే కాబట్టి గౌరవనీయులైన న్యాయమూర్తి కేసు పూర్వాపరాలని పరిశీలించాల్సిందిగా కోరుతూ కొన్ని విషయాలని ఇక్కడ స్పష్టం చేయదలచుకున్నాను.   

 

    యువరానర్... ఇట్సే నాటేన్ ఏక్సిడెంట్ బట్ కేసాఫ్ బ్రొటల్ బార్బేరియన్ మర్డర్..." ఓ క్షణం ఆగాడు బోనులో నిలబడిన నానీని చూస్తూ "పూర్తిగా కళ్ళు తెరవని పసికందు నానీ ఆ ఇంట అమ్మ ఒడి తర్వాత తనకు అత్యంత ప్రీతిపాత్రమైంది తాతయ్య సన్నిధి, అందుకే ఇద్దరు అపురూపమైన ఆ వ్యక్తులు నడుమ నిజాన్ని మాత్రమే నేర్చుకున్నాడు. వయసెదుగుతున్న నానీ నవ్వు నిజం. నడక నిజం. నడవడిక నిజం... తనచుట్టూ వున్నవాళ్ళతో అలాంటి అసాధారణమైన బాలుడిగా గుర్తింపబడ్డాడు. అలాంటి నానీ తపస్సుని భగ్నం చేసింది అమ్మ మరణం. శాశ్వతమైన నిజంలాంటి అమ్మ దానికి అబద్ధమైనందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడుగాని అమ్మ చివరగా చెప్పిన అబద్ధానికి దారుణంగా కలవరపడ్డాడు. తాననెప్పుడూ నిజమే మాట్లాడమనే అమ్మ ఆ చివరిక్షణాల్లో అబద్ధమెందుకు మాట్లాడిందో అర్థంకాక తాతయ్యనే నిలదీశాడు. ఒక పక్క కొడుకు అవినీతి, మరోపక్క సహకరించని భార్య, ఇంకోపక్క కాలానికి తిలోదకాలిచ్చుకునేస్థితిలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు సరళ... వ్యధని గుండెల్లో దాచుకోవడం తప్ప తన నేరాన్ని ఆ పసికందుకెలా విప్పి చెప్పగలడు... అంతే... ఇన్ స్పెక్టర్ యశస్వి నానీచేత నిజం చెప్పించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడని తెలిసి అంతా నానీని కడతేర్చాలనుకున్నారు. నిజం మాత్రమే తెలిసి అంతా నానీని అంతంచేసి మరో అతిముఖ్యమైన సాక్ష్యాన్ని సమాధి చేయాలనుకున్నారు. తను మంచంపైనుంచి లేవలేని స్థితిలో మిగిలి ఆ పసికందు నూరేళ్ళు బ్రతకాలని బ్రతికించేమందు తెమ్మని ప్రపంచంలోకి సాగనంపాడు. ఎన్నెన్ని పోరాటాలు, మరెన్ని సంఘటనలో నానీని అడుగడునా అంతం చేయబోతుంటే నిజం చావదన్న సత్యానికి తనే ఓ తిరుగులేని సాక్ష్యమై ఒక సంఘటనలో ఇన్ స్పెక్టర్ యశస్విచేత రక్షింపబడి ఇదిగో ఇలా రప్పించబడ్డాడు.