నానీ పారిపోతున్నాడు. వాడితోపాటు అతి ముఖ్యమైన 'రీలు' తనకు దక్కకుండా పోతూంది.

 

    అప్పారావు దృష్టిలో తను వెధవైపోతున్నాడు.

 

    ఇక ఆలోచనలు హరిని మరింత రాక్షసుణ్ణి చేయగా చేతిలోని రివాల్వర్ మరోమారు నిప్పులు కక్కింది.

 

    అంతే...

 

    అనసూయ రక్తం ఈసారి ఫౌంటెన్ లా అతడి ఒంటిపైకి తుళ్ళింది. ఆమె నేలకొరిగిపోయింది పట్టు సడలిస్తూ.

 

    ఇంకో రెండుక్షణాల్లో హరి రోడ్డుపైకి వచ్చాడు.

 

    సరిగ్గా అప్పుడే చూశాడు నానీ ఓ సందు మలుపు తిరగడాన్ని.

 

    హరి పాశుపతంలా వేగాన్ని పెంచాడు.

 

    మరో నిస్సహాయపు నిశిరాత్రివేళ...

 

    ఎగిరిపోతానంటున్న జీవనవిహంగాన్ని ఏ దేవుడి దయతో రక్షించుకోవాలో, ముసురుకుంటున్న మృత్యుదేవత మనస్సుని ఏ దీనాలాపనతో కరిగించి, తనను తాను కాపాడుకోవాలో తెలీని నానీ కన్నీళ్ళను వర్షిస్తూ పరుగెత్తుతూనే వున్నాడు.

 

    నానీ ఇప్పుడాలోచిస్తున్నది తాతయ్యని బతికించే మందుకోసం కాదు.

 

    తనను బ్రతికించే మార్గంకోసం.

 

    అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు కావస్తూంది.

 

    ఇదే వేళకి...

 

    హోటల్ పంచవటిలోని తన గదిలోనుంచి...

 

    యశస్వి రామసూరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.

 

    "పగలంతా నానీకోసం గాలించాను రామసూరిగారూ... ప్రయోజనం లేకపోయింది.కానీ... రాందేవ్ చనిపోయిన రాత్రి హోంమినిష్టర్ అప్పారావుతో గెస్టుహౌస్ లో గడిపిన ఆడదెవరో తెలుసుకున్నాను. ఈవేళ ఉదయం ఆమె గెస్టుహౌస్ నుంచి బయటకొస్తుండగా అనుసరించాను కూడా" అన్నాడు.

 

    "ఐసీ... తెలివిగా ఆవిణ్ణి ట్రేస్ చేస్తే..."

 

    "లాభంలేదు. అది మామూలు ఆడదికాదు" క్లుప్తంగా చెప్పాడు ఆమె గురించీ, నానీకథలో ఆమెపాత్ర గురించీను.

 

    "పిటీ మిష్టర్ యశస్వీ... ఒక పోలీసాఫీసరయ్యుండి మీరూ, మహా మేధావులమని మురిసిపోయే మా జర్నలిస్టుల జాతీ ఓ పసికందు ప్రాణాలను కాపాడలేని స్టేజ్ లో వున్నామంటే ఇట్స్ రియల్లీ అన్ ఎక్స్ క్యూజబుల్..." బాధగా ధ్వనించింది రామసూరి కంఠం.

 

    "మీకు తెలీదు రామసూరిగారూ! ఒక పోలీసాఫీసరుగా డిపార్టుమెంటులోని కొన్ని తీగల్ని కదిలించాను... కానీ..."

 

    "డొంక కదలనంటూందంటారు. ఐనో యశస్వీ! దటీజ్ అప్పారావు. మీజాతి మనుషుల్లో చాలామంది అప్పారావు అనుచరులే"

 

    ఆ విషయాన్ని గ్రహించాను. అయినా కొద్దిపాటి సమాచారాన్ని సేకరించాను."

 

    "ఏమిటది?"

 

    "అర్థరాత్రివేళ కొనవూపిరితో వున్న రాందేవ్ ని హాస్పిటల్ కి తరలించిన పోలీస్ పెట్రోలింగ్ వేన్ లోని యస్సై ఆ స్పాట్ కి సమీపంలో ఆగివున్న ఓ జీప్ ని చూశాడట. అది హరి అనబడే వ్యక్తిదంటాడు."

 

    "గాడ్..." రామసూరి గొంతులో కొద్దిపాటి కలవరపాటు "మరి హరిని ఇంటరాగేట్ చేశారా?"

 

    "అదే అడిగాను... జీప్ అక్కడ కనిపించినంతమాత్రాన అతడ్నెలా అనుమానిస్తాం అంటూ దాటేశాడు."

 

    "తెలివైన ఫూల్ ఆ యస్సై ఎవడన్నాగానీ..."

 

    "యూ మీన్...!"

 

    "యస్ మిష్టర్ యశస్వీ... రాందేవ్ ని హత్యచేసే అవకాశమున్న ఒకే ఒక వ్యక్తి హరిగురించి నోరుజారి మళ్ళీ అంతలోనే తన చర్యనలా సమర్థించుకున్న ఆ యస్సై తప్పకుండా తెలివైనవాడు."

 

    "అంటే...?"

 

    "హరి మీరు విన్నట్టు ఓ మామూలు వ్యక్తికాదు. పరమకిరాతకుడిగా ఈ పట్టణంలో ప్రతివాడికీ తెలిసిన ఓ రాక్షసశక్తి. అంతకుమించి హోంమినిష్టర్ అప్పారావుకి అతిముఖ్యుడైన అనుచరుడు. నౌ ఇట్స్ క్లియర్ యశస్వీ... రాందేవ్ ని అప్పారావు హత్య చేయించింది హరిచేతనే. అనుమానంలేదు. కాని వాడ్ని అరెస్టు చేయరు. కారణం మీ డిపార్టుమెంటులో చాలామంది వాడిద్వారానే తమ పనులు చేయించుకునే దౌర్భాగ్యస్థితిలో వున్నారు కాబట్టి. నా అంచనా తప్పు కాకపోతే హరి సాధ్యమైనంత త్వరలో నానీ ప్రాణాలు తీస్తాడు. స్పష్టంగా చెప్పాలీ అంటే... ఇప్పటికి అదొక్కటే ముఖ్యమైన కర్తవ్యంగా తీసుకుంటాడు. అవును యశస్వీ! రేపు పేపర్లో మరోమారు నానీఫోటోని మా జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వానికి సమర్పించిన మెమొరండాన్ని చూశాక అప్పారావు యింకా మతిభ్రమించినట్టు చెలరేగిపోతాడు. తప్పనిసరిగా అయినా ప్రభుత్వం 'డి.జి'ని నానీ విషయంలో పురమాయిస్తుంది. అప్పుడు నానీ దక్కితే అప్పారావుకు అండగావున్న మీ డిపార్ట్ మెంట్ లోని కొందరు వ్యక్తులే నానీ ప్రాణాల్ని..."  

 

    "ప్లీజ్ మిష్టర్ రామసూరీ" అసహనంగా ప్రొటెస్ట్ చేస్తున్నట్టు వారించాడు యశస్వి. "నా డిపార్టుమెంటులోనూ కలుపు మొక్కల్లాంటి కొందరు వ్యక్తులుంటారని నేనూ అంగీకరిస్తాను. కాని... మీరు ఎగ్జాగరేట్ చేసినంత దుర్మార్గులుండరు. వుండే అవకాశంలేదు. ఆఫ్టరాల్ ఐదేళ్ళకోసారి పదవిని చేపట్టే ఈ మంత్రులకోసం సెంటిమెంట్స్ ని పూర్తిగా చంపుకోగలిగేంతటి రాక్షసులంటారంటే హౌ కెన్ ఐ బిలీవ్... మాలోనూ తండ్రులుంటారు, అన్నలుంటారు. ఒక నేరస్థుడికి కొమ్ము కాస్తారేమో కానీ కోరి ఓ పసికందు ప్రాణాలను తీయలేరు మిష్టర్ రామసూరీ!"

 

    "రాఖీ కట్టిన ఆడపిల్ల చేతుల్నందుకుని రేప్ చేసే ఖాఖీ మనుషులగురించి నీకు తెలిసింది చాలా తక్కువని చెప్పటానికి చింతిస్తున్నా మిష్టర్ యశస్వీ..."

 

    "నేనూ పోలీసాఫీసర్నే!"

 

    "కానీ నీలాంటివాళ్ళ శాతం తక్కువ , ఇట్స్ నెగ్లిజబుల్."

 

    "కాదని నిరూపిస్తాను."

 

    "ఎలా?"

 

    "నానీని రక్షించి."

 

    "నువ్వొక్కడివీ. అంతేగా?"