"పెళ్ళి చేసేస్తాను ఆ తర్వాత నువ్వు చదువుకుంటావో, కాపురమే చేసుకుంటావో నీ ఇష్టం" అన్నాడు నాన్న ఆయన ఏదయినా పట్టుబడితే నెగ్గేవరకు నిద్రపోడు. ఆయన నైజం తెలిసినదాన్ని కనుక ఇక మాట్లాడలేకపోయాను.    

    నాకూ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఎన్ని రోజులని ఊరకనే వుండడం? ఇరవయ్ రెండేళ్ళ యవ్వనం రాత్రిపూట మారాం చేయడం మొదలుపెట్టింది. ఒక్కో రోజు నిద్ర కూడా వచ్చేది కాదు. ఏదో ఆలోచిస్తూ తోడున్నాడేమోనని పక్కంతా చేయి పెట్టి తడిమేదాన్ని. తలగడ తల కింద కాకుండా ఎదమీద వుండేది. అల్లరిచేసే పరువం నోరు నొక్కెయ్యటానికి బ్లాంకెట్ తో అవస్థ పడేదాన్ని.
    
    ఈ కారణాల వల్ల నాన్న అలా అనడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాను.
    
    మొదటి సంబంధమే సెటిలయింది. మా ఊరు ఎస్.ఐ. ఈ సంబంధం చెప్పాడు. అబ్బాయి రావడం, నన్ను చూడడం జరిగిపోయాయి.
    
    శ్రీనాథ్ ని ఇష్టపడని ఆడపిల్ల ఉండదనుకుంటాను. సన్నగా ఉన్నా చక్కటి ఫీచర్స్ తో వుంటాడు. అందునా ఇంజనీర్. ఉద్యోగం చేస్తున్నవాడు. కాబట్టి 'ఓ.కే' అనేశాను అమ్మానాన్నలతో.
    
    ఏభైవేలు క్యాషూ, పాతిక తులాల బంగారం. పెళ్ళి చేయించేటట్లు నాన్న ఒప్పుకున్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా దీనికే ఒకే అనడంతో పెళ్ళి ఫిక్సయి పోయింది. అయితే నిశ్చయ తాంబూలాలు మాత్రమే జరగలేదు. పెళ్ళిరోజే ఆ తంతూ ముగిద్దామని, రెండు ఖర్చులూ వేస్ట్ అనీ నాన్న అనడంతో వాళ్ళూ సరేనన్నారు.
    
    అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు.
    
    పెళ్ళి మరో రెండు నెలల్లోగా చేస్తానని, ముహూర్తం చూసుకున్నాక లెటర్ రాస్తానని నాన్న చెప్పారు.
    
    రెండు నెలలు చాలా లాంగ్ అనిపించింది నాకు. ముహూర్తం త్వరగా కుదిరుంటే బావుండేదని అనుకున్నాను. పెళ్ళిచూపుల్లో ఆ అయిదు నిముషాల్లో చూసిన రూపం ఏం గుర్తుంటుంది? కానీ శ్రీనాథ్ ని పదే పదే కళ్ళ ముందుకు తెచ్చుకునేదాన్ని.
    
    నెలన్నర తరువాత మంచి ముహూర్తం వుందని, ఆ రోజుకి పెళ్ళి ఫిక్స్ చేస్తానని, సూళ్ళూరు పేటలోనే వున్న సత్రంలో పెళ్ళి జరిపిస్తానని నాన్న శ్రీనాథ్ తండ్రికి ఉత్తరం రాశాడు.
    
    వారం రోజుల తరువాత అక్కడినుంచి ఉత్తరం వచ్చింది డేటు ఒకేనని, అయితే పెళ్ళి సుళ్ళూరుపేటలో కాకుండా తమ ఊర్లో జరిపించాలనీ, తమ బంధువర్గం అంతదూరం రావడం కష్టమని శ్రీనాథ్ తండ్రి అందులో రాశాడు.
    
    ఈ ఉత్తరం చూడగానే నాన్నకు కోపం వచ్చింది. "పెళ్ళి ఇక్కడ కాకుండా అక్కడ చేయాలట. బంధువులు రావడానికి కష్టమట. మనకు లేరా బంధువులు? మగ పెళ్ళివాళ్ళ కోర్కెలకు హద్దూ అదుపూ వుండడం లేదు పెళ్ళి చేస్తానని ఒప్పుకుంటే, ఇక్కడ కాదు అక్కడంటే ఎలా వుంటుందో చెప్పు.
    
    ఇది మన స్వంత ఊరు గనుక నలుగురు పలుకుతారు. పనులు చేయడం సులభం. అక్కడ పెళ్ళి చెయడమంటే మాటలా? ఇక్కడి నుంచి ముఫ్ఫై మూడూ అక్కడికి తీసుకెళ్ళడం ఎంత రిస్కు? అక్కడ పెళ్ళి చేయడం నావల్ల కాదని రాసేస్తాను" అని నాన్న ఖచ్చితంగా చెప్పేశాడు అమ్మతో.
    
    ఆ విధంగానే లెటర్ రాశాడు. మా నాన్న చెప్పింది సబబుగానే వున్నట్లు నాకు అనిపించింది.
    
    మరో వారానికి అక్కడి నుంచి ఉత్తరం వచ్చింది. ఎలానో సర్దుకుని పెళ్ళి అక్కడే చేయమని రాశాడు శ్రీనాథ్ తండ్రి.    

    తనవల్ల కానేకాదని నాన్న తిరిగి ఉత్తరం రాశాడు. ఆ తరువాత అక్కడి నుంచి జవాబు రాలేదు.
    
    పెళ్ళి జరిగే స్థలం మీద ఇరుపక్షాలకూ ఇంత పట్టుదల ఏమిటో నాకు అర్ధం కాలేదు.    

    తమ బంధువులు రావడానికి ఇబ్బందని వాళ్ళూ అక్కడ చేయడం తనకు కష్టమని నాన్నా బిగదీసుక్కూర్చున్నారు. మధ్యలో మేమిద్దరం ఏమైపోతామన్న ధ్యాస ఎవరికీ పట్టడంలేదు. ఈ విషయాలన్నీ శ్రీనాథ్ కి తెలుసో? లేదో?
    
    అన్నీ కుదిరి, పెళ్ళికొడుకు మీద కలలు కనడం ప్రారంభించాక ఇలా బెడిసికొట్టడం బాధాకరమైన పరిణామం. ఇక అక్కడి నుంచి ఉత్తరం రాకపోతే పెళ్ళి కాన్సిల్ చేస్తానని నాన్న అమ్మతో అనడం నేను విన్నాను. నాకు కంబారు మొదలయింది. ఎవరో ఒకరు పట్టు సడలిస్తే ప్రాబ్లమ్ లేకపోవును.
    
    నాన్నది ఏమీ తప్పులేదనిపించింది.
    
    ఈరోజుల్లో పెళ్ళి చేయడమంటే మాటలు కాదు. పరాయి ఊర్లో పెళ్ళి చేసి, మెప్పించడం అంత సులభం కాదు. మరి శ్రీనాథ్ తండ్రికి ఇవన్నీ చెప్పి, ఆయన ఒప్పుకున్నట్లే ఎలా చేయడం?
    
    ఇలా ఆలోచిస్తున్న నాకు ఓ ఐడియా తట్టింది. ప్రాబ్లమ్ అంతా వివరించి, తండ్రిని ఒప్పించమని శ్రీనాథ్ నే అడగాలనిపించింది అందరికీ ఇష్టం కలిగాక చిన్న కారణంచేత పెళ్ళి ఆగిపోవడం ఎంత బాధాకరమో చెప్పాలనిపించింది.
    
    అందుకే శ్రీనాథ్ ని ఓసారి ఇక్కడకు వచ్చి వెళ్ళమని ఉత్తరం రాయాలనుకున్నాను. అతను వస్తే అక్కడి విషయాలు కూడా తెలుస్తాయి.
    
    నేనయితే అక్కడికి వెళ్ళడం కుదరదు కనుక అతన్నే ఇక్కడికి రమ్మనడం సబబుగా తోచింది. ఇక్కడికి వచ్చాక ఎలానో ఓలా మేనేజ్ చేసి మాట్లాడుకోవచ్చు.
    
    కానీ పెళ్ళిచూపుల్లో తప్ప మరే పరిచయంలేని అతనికి ఉత్తరం ఎలా రాయడం? ఇలా మీనమేషాలు లెక్కిస్తే లాభం లేదనిపించి శ్రీనాథ్ కి ఉత్తరం రాయడానికి డిసైడ్ చేసుకున్నాను.
    
    'ఓసారి రండి మీతో మాట్లాడాలి' అని రెండు వాక్యాలు రాసి ఉత్తరాన్ని ఆఫీస్ అడ్రస్ కి పోస్ట్ చేశాను.
    
    ఉత్తరం రాసింది మొదలు, అతను వచ్చాక ఏ విషయాలు మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుంటూ వుండిపోయాను. అతను రాడేమో నన్న అనుమానం కూడా నాలో లేకపోలేదు.
    
    రెండు మూడు రోజులు ఎదురుచూశాను కానీ ఆ తరువాత అంత గాఢంగా పట్టించుకోలేదు.
    
    ఉత్తరం రాసి వారం రోజులయినా అతను రాలేదు.
    
    ఆరోజు ఆకాశమంతా మబ్బు పట్టి వుంది. బంగాళాఖాతంలో తుఫాను లేచిందని టీవీలో చెప్పారు. వర్షం రాలేదుగానీ వహ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
    
    తడ పక్కనున్న ఓ పల్లెటూర్లో మా మేనమామ వుంటున్నారు. ఆయనతో ఏదో విషయాలు మాట్లాడి వస్తామని అమ్మా నాన్నా ఉదయం వెళ్ళారు. సాయంకాలానికల్లా తిరిగి వచ్చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం భోజనం ముగించి, అలా పడుకున్నాను.
    
    చిన్నగా వర్షం మొదలయింది. కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ నిద్రలోకి జారిపోయాను.
    
    ఎవరో తలుపు తడుతున్నట్లనిపించి మెలకువ వచ్చింది. అమ్మా నాన్నా వచ్చారని గబుక్కున మంచం దిగి వచ్చి తలుపు తీశాను.
    
    బాగా తడిసి ముద్దయిపోయి ఎదురుగా నిలుచున్న అతన్ని తేలికగానే పోల్చుకోగలిగాను. అతను శ్రీనాథ్.
    
    తుఫాను బయటకాదు - నాగుండెల్లో అనిపించింది. అంత సంచలనం నాలో.
    
    ఏమీ మాట్లాడకుండా పక్కకి తొలిగాను లోపలికి రమ్మన్నట్లు.
    
    అతను లోపలికి నడిచి, ఆ తరువాత ఏం చేయాలో తెలియక హాల్లో నిలబడిపోయాడు.