"అలా అని ఎవరు చెప్పారు? చేసుకుంటానని?"

    "ఇవి ఒకరు చెప్పే విషయాలు కాదుగా?" అని నవ్వాడు చంద్రం.

    "నువ్వు చేసుకో."

    "నేనా? పరాభవితుడ్నయ్యాను."

    "కానీ ఈసారి ప్రయత్నించు, విజయం వరిస్తుంది."

    "ఛీ!" అన్నాడు చంద్రం "ఎంత మొగవాడ్నయినా అంత తీసిపోలేదు. నాకు ఒకరిదయ, జాలి అక్కర్లేదు. నన్ను పూర్తిగా ఏ స్త్రీ అయినా వలచినప్పుడే చేసుకుంటాను."

    "మంచిదే కానీ, అప్పుడు నన్ను పిలవటం మరచిపోకు."

    అది సందేహాస్పదమైన మౌనం. హఠాత్తుగా చంద్రం అడిగాడు. "రవీ! నువ్వు ఇదివరలో అనేక సిమిలీలు వేసేవాడివి. ఇప్పుడు మానేశావేం?"

    తత్తరపడి రవి నవ్వబోయాడు. కానీ ఏమీ సాధ్యంకాలేదు. బిత్తరచూపులు చూచి ఊరుకున్నాడు. తర్వాత మెల్లగా "నా జీవితమే ఒక ఉపమానమైనప్పుడు...."

    "ఓహో! అదేమిటి?" అని చంద్రం కళ్ళు పెద్దవిచేశాడు.

    "ఏముంది? కొన్ని అనుభవాలను వరించాక అందరి జీవితాలూ అలానే అవుతాయి. నీవు కొంతమందికి ఉదాహరణ, నేను మరికొంతమందికి."

    "మనల్ని చూసి అందరూ బుద్ధి తెచ్చుకోవాలంటావు? కానీ ఇందులో శశి ప్రమేయంకూడా తెచ్చావు. ఏదో వుంది, చెప్పాల్సిందే"

    "ఏముంది చెప్పేందుకు నా మొహం? అవన్నీ ఊహమీద తెలుసుకోవలసిన విషయాలు. ఈత నేర్చినవాడు సముద్రంమీద అవలీలగా పై అంచునే తేలిపోతూ ఈదుకుంటూ పోతాడు. రానివాడు బుడుంగుమని మునిగిపోతాడు. అంతే! అంతకంటే వివరించి చెప్పగల శక్తి నాకులేదు."    

    చంద్రం ఆశ్చర్యంగా చూశాడు "నిజమే!" అన్నాడు.

    చాలాసేపటికి స్నేహితులిద్దరూ లేచారు. చంద్రం ఆ పూట తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. రవి రాలేనని చెప్పి చీలిపోవాల్సిన సమయం వచ్చాక వంటరిగా బయల్దేరాడు.

    ఒక నిముషం ఆగి ఎక్కడికి పోదామా అని ఆలోచించాడు. ఇంతలో అతనికేదో స్ఫురించింది. ఒక్కసారిగా మేనంతా గగుర్పొడిచింది. "సరే" అనుకుని బయల్దేరాడు.

                                              11

    చిమ్మచీకటి. సాటిలేని నిశ్శబ్దం. కటిక ఏకాంతం. అట్టి సమయంలో రవి అరుగుమీద దొంగలా నిలబడి "రాగిణీ! తలుపుతియ్యి" అన్నాడు కంపిత స్వరంతో.

    లోపల దీపం వెలిగింది. తలుపు తెరుచుకుంది. "మీరా?" అంది రాగిణి భయాశ్చర్యసంభ్రమాలతో.

    అతను మౌనంగా లోపలకు నడిచాడు. రాగిణి తలుపులు వేసి వెనుకనే వచ్చింది. అతను చప్పున వెనుదిరిగాడు. ఇద్దరూ చాలా సామీప్యంలో ఒకరికొకరు అభిముఖంగా నిలబడ్డారు. ఇంచుమించు శరీరాలు పరస్పరం స్పర్శించుకుంటున్నాయి. అతనామెవైపు సూటిగా చూశాడు. కృశాంగియైవున్న రాగిణి వదనం ఈరోజు మనోహరంగా వుంది. అంది వెర్రిగా "ఏమిటి ఈ రూపం?"  

    "ఇది మనిషి అంతర్భాగం. నిజరూపం."

    "అంటే?"

    "అంటేనా? నీలోని నేనుగాకుండా నాలోని నేనుగా నీకు గోచరిస్తున్నాను. ఏం? ఇది సబబుగా లేదూ?"

    "వద్దు, నాకీరూపం వద్దు" అంటూ రాగిణి గోడవైపు తిరిగింది. అలా నిల్చునే "ఈసారికూడా మీ నైజం రుజువు పరచుకున్నారే? ఇది నిశిరాత్రి."

    "కానీ ఈ రాత్రి నీవద్దకు రావడానికీ, ఇదివరకు రావడానికీ చాలా వ్యత్యాసం వుంది రాగిణీ!"

    "కనబడుతూనే వుంది. కొత్తరూపంలో వచ్చారుగా. ముందు కూర్చోండి."

    "అటుతిరిగి చిలకపలుకులు పలికితే ఏం కూర్చోను? కానీ రాగిణీ! నన్ను ఎందుకు ఆదరిస్తావు? వెళ్ళగొట్టెయ్యకూడదూ?"

    "ఉహుఁ" అని ఆమె సాంతం ఇటుతిరిగి చూపులు మరల్చుకుంది. "ఇన్ని రోజులూ నేను ఆలోచించి తెలుసుకున్నదేమంటే అది నాకు సాధ్యంకాదని..."

    "అబ్బ! నీది ఎంత ఉదారహృదయం!"

    రవి మంచంమీద కూర్చున్నాడు. తరువాత పడుకున్నాడు. "నాకీవేళ ఆకలిగాలేదు రాగిణీ! నాకు పాలు వద్దు" అన్నాడు.

    ఆమె తల ఊపి సమ్మతి సూచించింది. పలుకలేదు, నిల్చున్నచోటునుంచి కదల్లేదు.

    "రాగిణీ!" అన్నాడు ఆశ్చర్యంగా మళ్ళీ "నువ్వు ఇక్కడే వున్నావూ? ఉండవనీ, నిర్దయగా ఎక్కడికో వెళ్ళిపోయి వుంటావనీ అన్న నిరాశతోనే ఇక్కడకు వచ్చాను. అలా జరిగితే ఏం జరిగేదో తెలుసా? ఆ అరుగులమీద పడి నిద్రపోయేవాణ్ణి. రాగిణీ! నీ కృపాస్వభావాన్ని ఏమని కొనియాడను? నేనెంతటి అదృష్టవంతుణ్ణి!"

    ఆమె కనురెప్పలు బరువుగా నిలిపి మిన్నకుంది.

    "నువ్వు ఈవేళ గుమ్మంమీద కూర్చోలేదే రాగిణీ? ఒకనాటిలా."

    ఆమె కష్టంమీద కన్నీళ్ళనాపుకుంది. మంచులో కప్పబడినట్లు ఆమె గుండె ద్రవించిపోతోంది. ఇన్నాళ్ళూ ఆమె ఏమి తపస్సు చేసిందో, ఈ ఒంటరి కొంపలో ఎందుకు పడిగాపులు కాస్తుందో భగవంతునికెరుక! చలన రహితంగా అలానే నిలబడింది.

    "నీతో ఇవేళ చాలా విషయాలు చెప్పాలని వచ్చాను. అలా దూరంగా నిల్చుంటే నాకు మాటలు పెగలవు. దగ్గరకు రావూ?"

    ఆమె రెండడుగులు వేసి తటాలున ఆగిపోయి "చాలునా?" అంది గద్గద స్వరంతో.

    "ఉహు - చాలదు."

    రాగిణి అతనిదగ్గరే నిలబడింది. అవనతముఖియై "చెప్పండి?" అంది.

    "రాగిణీ! నన్నెందుకిలా అవమానపరుస్తావు? ఈ మంచంమీదనే కూర్చోలేవూ? ఇది కేవలం నా ఒక్కడికే కాదుగా?" అన్నాడు రవి ఆమె ముఖంకేసి నిర్భయంగా చూస్తూ.

    ఒక్కక్షణం ఆమె తటపటాయించింది. వచ్చి అతనికి చేరువలో మంచంమీద కూర్చుంది. పారవశ్యలీనమైన కంఠంతో అతడు ఇలాఅన్నాడు. "రాగిణీ! నీ కరుణ సాటిలేనిది. అదే నన్ను ఎక్కడికీ దారి తియ్యకుండా యిక్కడికి లాక్కువచ్చింది. కానీ దీపాలన్నీ ఆర్పివేసి లోపల పడుకున్నావు కదా! నీకు భయంవేయదూ?"