"చూడు నాయనా, దానికి ఏ గతి పట్టించారో చూడు" వెక్కి వెక్కి ఏడ్చాడు.

    "ఊరుకోండి మామయ్యా, ప్రాణాలతో వుందని సంతోషిద్దాం. మామూలు మనిషిని చేసుకుందాం. డాక్టరు వచ్చారు... పరీక్షిస్తున్నారు, మంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే కొన్నాళ్ళలో తేరుకుంటుంది" అంటూ ధైర్యం చెప్పాడు.

    "అదిలా, ఈవిడిలా పడుకుంది. ఏమైందో ఏమిటో" కళ్ళు తుడుచుకున్నా రాయన.

    అరగంట తర్వాత బయటికి వచ్చాడు డాక్టరు. ఆయన చెప్పినదాని సారాంశం విని దిగ్బ్రాంతి చెందారందరూ. "ఆమె శారీరంనిండా మత్తు పదార్థాలు అంటే హెరాయిన్ లాంటివి ఇంజక్ట్ చేసినట్టు కనిపిస్తోంది. బ్లడ్ టెస్ట్ కి పంపాం... రిపోర్టు వచ్చాకగాని అసలు సంగతి తెలీదు. ఆమెకి ఆహారం కూడా సరిగా అందలేదు... కావాలనే ఇరవై నాలుగ్గంటలు ఒకదాని తర్వాత ఒకటి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పడుకోబెట్టినట్లున్నారు గోల చెయ్యకుండా. రెండు చేతుల నిండా ఇంజక్షన్ గుర్తులు... రక్తంలో విపరీతంగా మత్తుపదార్థాలు కలియడంతో ఆమె శారీరం ఎంత డామేజ్ అయిందో అన్ని పరీక్షలు జరిగితే కాని తెలియదు.
    మెదడు, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, రక్తం అన్నీ పరీక్షల జరగాలి. ప్రస్తుతానికి ఆ మత్తుకి విరుగుడు ఇచ్చాం... సెలైన్ డ్రిప్ పెట్టాం...ప్రాణానికి ముప్పు లేదుగాని ఆమెకి తెలివి వచ్చాక గాని, జరిగిన డామేజ్ తెలియదు..." అన్నారు.
    "డాక్టర్, మా అమ్మగారి పరిస్థితి..." శారద ఆరాటంగా అడిగింది.
    "ఆవిడకి విపరీతంగా బ్లడ్ ప్రెషర్ పెరిగింది. తగ్గడానికి ఇంజక్షన్, మందులు ఇచ్చాం. నిద్రమాత్ర ఇచ్చి పడుకోబెట్టాం. ఆవిడకీ తెలివి వచ్చాక మిగతా పరీక్షలు జరుపుతాం."
    "డాక్టర్... ఎంత డబ్బయినా ఫరవాలేదు. నా కూతురిని మళ్ళీ మనిషిని చెయ్యండి డాక్టరుగారూ... ఈ స్థితిలో ఆమెని చూసి భరించలేకపోతున్నాం."
    "నారాయణమూర్తిగారూ! మీరు అన్నీ తెలిసినవారు... ఇలా అధైర్యపడి ఏం చెయ్యలేం. పదిగంటలకి న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, అందరు డాక్టర్లు వచ్చి అన్ని పరీక్షలు జరిగేంతవరకు ఏం చెప్పలేను... శారీరకంగా కూడా ఆమెని రేప్ చేశారా అన్నది గైనకాలజిస్ట్ వచ్చాక పరీక్షలు చేయిద్దాం... మీరు శాంతంగా వుండండి.. పదిహేనురోజులలో ఆమెని వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇది ఒకరోజులో బాగుపడిపోయే కేసు కాదు."
    ఇద్దరినీ ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నారు. శారద కోరిక మేరకు ఇద్దరినీ ఒకే గదిలో పడుకోబెట్టారు. "డాడీ, ఇంటికెళ్ళి మొహాలు కడుక్కుని కాఫీ, టిఫిన్ అవీ తీసుకుని వద్దాం. ఈలోగా శ్రీనివాస్ ఇక్కడుంటాడు. మళ్ళీ కావాల్సిన వస్తువులు అవీ తీసుకుని వద్దాం రండి..." అంది శారద.
    "వెళ్లి రండి మామయ్యా... మళ్ళీ పదిగంటలకి డాక్టర్లు వచ్చేలోగా రండి. ఇప్పుడుండి మీరింక చేసేదేం లేదు" అన్నాడు ప్రకాష్. "నేనూ ఇంటికెళ్ళి రాహుల్ ని స్కూల్ కి పంపి, మళ్ళీ డాక్టర్లు వచ్చేవేళకి వస్తాను" అన్నాడు.
    అంతా శ్రీనివాస్ కి చెప్పి బయలుదేరారు. అంతా వెళ్ళాక శ్రీనివాస్ నీరద పక్కన కూర్చుని ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని తదేకంగా ఆమె మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్లనిండా నీళ్ళు... తుడుచుకోవడం కూడా మరిచి కూర్చున్నాడు.
                                           * * *
    నీరద సంగతి తెలిసి పేపరు రిపోర్టర్లు, మీడియావారు కెమెరాలతో నర్సింగ్ హోమ్ కి డాక్టర్లు ఎవరినీ లోపలికి వదలలేదు. ఆస్పత్రి బయట వారి గోల చూసి ప్రకాష్ బయటికి వచ్చి టూకీగా జరిగింది చెప్పి, నీరద మత్తు మైకంలో వుందని డాక్టర్లు ట్రీట్ చేస్తున్న సంగతి చెప్పి గోల చెయ్యకుండా దయచేసి వెళ్లిపొమ్మని కోరాడు.
    పదిగంటలకి డాక్టర్ల బృందం వచ్చి అన్నిరకాల పరీక్షలు జరిపారు గంటపాటు. బ్లడ్ రిపోర్టులో రక్తంలో చాలా హెవీ మత్తుపదార్థాల శాతం వుందని నిర్థారణ చేశారు. స్కానింగ్ మొదలు, సి.టి. స్కాన్ వరకు అన్నిరకాల పరీక్షలు జరిగాయి. గైనకాలజిస్టు నీరద రేప్ కి గురికాబడిందని, అదికూడా ఒకసారి కాదు నాలుగైదుసార్లు జరిగి వుండచ్చని తేల్చి చెప్పింది.
    అది విన్న నారాయణమూర్తిగారు చిన్నపిల్లాడిలా మొహం కప్పుకుని ఏడ్చారు. "నా తల్లిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో... ఎలా భరించిందో" అంటూ ఏడుస్తుంటే శారదే ఓదార్చవలసి వచ్చింది. "మీ అమ్మ అదృష్టవంతురాలు హాయిగా తెలివిలేకుండా పడివుంది."
    శ్రీనివాస్ వివర్ణమైన వదనంతో నిలబడ్డాడు.
    నీరదకి కాసేపు మగత విడిన తర్వాత తెలివి వచ్చినా ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో వుండదని, గాభరాపడద్దని, ఆమె కాస్తయినా కోలుకుని తేరుకోడానికి పది పదిహేనురోజులు పడుతుందని డాక్టర్లు అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా నారాయణమూర్తిగారికి సానుభూతి ప్రకటించి కనీసం ప్రాణాలతో మిగిలినందుకు ఆనందం వ్యక్తపరిచారు.
    లలితమ్మకి తెలివి వచ్చింది కానీ ఆమెకి లైట్ గా పక్షవాతం సోకింది ఎడమచేతికి. మూతి ఎడమపక్కకి వంకర తిరిగింది. అది పెద్ద సీరియస్ కాదని కొద్దిరోజులలో మళ్ళీ మామూలుఅయ్యే అవకాశం వుందని ఆవిడ బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి మందులు ఇచ్చి ఆవిడకీ సెలైన్ డ్రిప్ పెట్టారు. ఇద్దరు పేషెంట్ల బాధ్యత అంతా శారదమీద పడింది. నారాయణమూర్తిగారైతే పెద్ద జబ్బు చేసిన వారిలా నీరసపడిపోయారు. ఓపికలేక అలా కుర్చీలో వాలిపోయిన ఆయనని చూసి ఈ దెబ్బతో ఆయన ఏమవుతారోనన్న భయం కలిగింది శారదకి.
    "శ్రీనూ, నీవు ఆఫీసుకి వెళ్ళు. పేపరు బాధ్యత నీమీదే వుంది. నాన్న ఇప్పట్లో రాగలరని అనుకోను. నీవే చూసుకోవాలి అంతా, వెళ్లు. ఇక్కడ నీరదని చూడడానికి నేను, నర్సులు అందరం వున్నాం. నీ పని అయ్యాక రా..." అంటూ పంపింది శారద.
    పదకొండు గంటలవేళ నీరదలో కాస్త కదలిక కనిపించింది. బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్టు రెప్పలు ఆడించింది. కాళ్ళూ, చేతులలో కదలిక ఎక్కువైంది. నర్సు డాక్టరుని పిలుచుకువచ్చింది. అంతా ఆరాటంగా చూస్తూండగా పదినిమిషాలకి కాస్త కళ్ళుతెరిచింది. కాని ఆమె కళ్ళల్లో జీవం లేదు... శూన్యంలోకి చూస్తున్నట్టుంది. చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరున్నారో ఏమీ చూడలేని, గ్రహించలేనిదానిలా అలా శూన్యంలోకి చూస్తూ కాళ్ళూ చేతులూ కదిలించసాగింది విపరీతంగా. ఇటూ అటూ పొర్లసాగింది. డాక్టరు నాడి పట్టుకుని చూసి... ఇంజక్షన్ రెడీ చేయమని నర్స్ కి చెప్పి, శారదని నీరదని పలకరించమన్నాడు.