కడకు కారు విమానాశ్రయం చేరుకోసాగింది. దూరంనుంచే విమానాల మ్రోత. భూమ్మీదనుంచి గాల్లోకి ఎగురుతూన్న చిన్నచిన్న విమానాలు - ఆమె ఉలిక్కిపడి సర్దుకుని కూర్చుంది. కారాగింది.

 

    గేటు దగ్గర కాపలా ఉన్నవాడు చెయ్యి అడ్డంగా పెట్టి లోపలకు పోవటానికి వీలులేదని చెబుతున్నాడు.

 

    "ఏమిటీ? ఇక్కడే ఆగిపోవాలా? లోపలకు పోనివ్వరా?" అని ప్రశ్నించింది. వేదిత వ్యాకులపాటుతో.

 

    "అనుమతి లేకుండా లోపలకు పోనీరమ్మా. మీకెవరు కావాలి? ఏం కావాలి?" అన్నాడు డ్రైవరు వినయంగా ఎంతో సానుభూతి ప్రదర్శిస్తూ.

 

    "అమెరికా వెళ్ళే విమానం. నాకు తెలిసినవారు అందులో ప్రయాణం చేస్తున్నారు."

 

    "అయితే కనుక్కువస్తానుండమ్మా." అని అతను తలుపు తెరుచుకుని దిగి కాపలావాడి దగ్గరకు వెళ్లాడు. హిందీలో ఏదో అడిగి, కాపలావాడు జవాబు చెప్పాక తిరిగి వచ్చాడు.

 

    "రెండు మూడు గంటల క్రితమే ఆ ప్లేను వెళ్ళిపోయిందిటమ్మా."

 

    అతను చెప్పేదింకా పూర్తిగా వినలేదు. విద్యుద్ఘాతం తగిలినట్లయి ఆమె వెనక్కి వాలిపోయింది.

 

    "అమ్మా! అమ్మా!" అని పిలిచాడు డ్రైవరు భయపడుతూ ఆదుర్దాగా. స్వతహాగా అతను మంచిమనస్సుగల వ్యక్తేగాని, చెప్పుకోతగినంత సౌజన్యమూర్తేమీకాదు. కాని ఆమెను చూడగానే, అతనికంత సదభిప్రాయం ఎలా కలిగిందో, 'అమ్మా' అని సంభోదించాలనిపించిందో అతనికే బోధపడలేదు.

 

    "ఊఁ!" అంది వేదిత నీరసంగా. ఆమె చెక్కిళ్ళమీద నుండి కన్నీళ్ళు ధారలు కట్టాయి.

 

    "ఏవమ్మా అలా వున్నారు? వంట్లో బాగాలేదా?"

 

    "బాగానే ఉంది."

 

    ఆమె పరిస్థితి చూసి అతను వ్యాకులపాటు చెంది "మీరీ ఊరువారు కాదనుకుంటాను. ఇప్పుడెక్కడికి పోతారు?" అనడిగాడు.

 

    "ఎక్కడికి పోతాను?" అనుకున్నదామె తనలో తాను. అంతా అంధకారంగా గోచరించింది. అప్రయత్నంగా కారు దిగి రోడ్డుమీద నిలబడి భూమ్మీదనుండి గగనతలంలోకి యెగిరిపోతూన్న విమానాలకేసి అనాసక్తంగా తిలకిస్తూ నిలబడింది. ఇలాంటి విమానంలోనే ఒకదాంట్లో కల్యాణమూర్తి కూర్చుని వెళ్ళిపోయాడు.

 

    "ఆఖరిక్షణం వరకూ నీకోసం ఎదురు చూస్తాను - ఎదురు చూస్తాను" తను వస్తానని, రాగలనని అతనికి తెలియదు. తన సున్నితమైన మనస్తత్వంతో, అందమయిన ఊహలతో అశాలోకాలు నిర్మించుకున్నాడు. ఆ ఆశలను ఛిన్నా భిన్నం చేసింది తను. అతని గుండెల్లో చిచ్చు పెట్టింది.

 

    "తిరిగిరాను. తిరిగిరాను" అతనిహ తిరిగిరాడు. ఈ భూమిపై యిక కాలుపెట్టడు.

 

    చెంపలపై కన్నీరు కాలువలు కట్టింది.

 

    అంతలో లోపలినుండి కారులో గేటుదాటి బయటకు వస్తోన్న ఒక వ్యక్తిని యీ దృశ్యం ఆకర్షించినట్లయింది. కారు ఆమె దగ్గరగా నిలిపి "ఎందుకిక్కడ నిలబడ్డారు? ఏం కావాలి మీకు?" అని సభ్యతగా అడిగాడు హిందీలో.

 

    దానికి టాక్సీ డ్రైవరు సమాధానం చెప్పాడు హిందీలో. "ఆమెకు హిందూస్తానీ రాదు. దూరప్రాంతాలనుంచి ఒక మనిషికోసమై యిక్కడకు వచ్చినట్లుంది. అతనేమో అమెరికా వెళ్ళే ప్లేనులో వెళ్ళిపోయినట్లున్నాడు."

 

    "అలాగా!" అన్నాడా వ్యక్తి తన నల్లద్దాల కళ్ళజోడులోంచి ఆమెవంక విస్మయంగా చూస్తూ.

 

    భాష తెలియకపోయినా వారిద్దరి సంభాషణా ఆమె కొంతవరకూ అర్థం చేసుకుంది. ఇంతలో మెరుపులా ఆమెకో ఆలోచన వచ్చింది. కారులో కూర్చున్నాయన విమానాశ్రయంలో ఉద్యోగిలా ఉన్నాడు. ఆమె డ్రైవరువంక చూస్తూ "చూడు నాయనా! కల్యాణమూర్తి అనే ఆయన ఈరోజు విమానంలో ప్రయాణం చేశాడో లేదో కనుక్కుంటావా?" అనడిగింది.

 

    "ఏమిటంటుంది?" అన్నాడు ఉద్యోగి.

 

    డ్రైవరు చెప్పాడు.

 

    ఆమె కట్టులోగాని, నడవడిలోగాని ఏమాత్రం అసాధారణత, యితరుల దృష్టిని ఆకర్షించే అంశంలేదు. అయినా అపురూపమయిన ఆమె విగ్రహం, వాడిపోయి వున్న అనిర్వచనీయమయిన సౌందర్యరేఖల్ని వెదజల్లుతూన్న ఆమె ముఖంబింబం అతడ్ని ముగ్దుడ్ని చేసి ఆమె కోరికను కాదనకుండా చేశాయి.  

 

    "పేరేమిటి? కల్యాణమూర్తి కదూ? ఇప్పుడే కనుక్కుని వస్తాను" అని మళ్ళీ అతను కారు వెనక్కి త్రిప్పుకుని వెళ్ళిపోయాడు.

 

    టాక్సీ డ్రైవరుకుకూడా - అంత ఉన్నతోద్యోగి ఒక సామాన్య వనిత కోరిక ననుసరించి, స్వల్పమయిన విషయాన్ని గురించి వాకబు చేయటానికి తిరిగి లోపలకు వెళ్ళడం విచిత్రంగా గోచరించింది.

 

    అయిదు నిముషాలు గడిచాయి. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆమె ప్రక్కనే కారాపి సానుభూతిగా చూస్తూ "సారీ! కల్యాణమూర్తి ఈ రోజు అమెరికా ప్లేనులో బయల్దేరి వెళ్ళిపోయాడు." అని చెప్పి రెండు మూడు క్షణాలు ఆమె వంక అలాగే చూసి ఏమనుకున్నాడో ఏమో తలత్రిప్పుకుని నెమ్మదిగా కారుని ముందుకు పోనిచ్చి క్రమంగా కనుమరుగై పోయాడు.

 

    "వెళ్ళిపోయాడటమ్మా!" అన్నాడు టాక్సీ డ్రైవరు.

 

    "అర్థమయింది" అని ఆమె కారులోకి వచ్చి కూర్చుంది. "పోనియ్ బాబు" అంది.

 

    ఎక్కడకు తీసుకువెళ్ళమంటావు?"

 

    "గమ్యంలేదు. నీకిష్టం వచ్చినంతసేపు అటూ ఇటూ త్రిప్పి ఎక్కడో అక్కడ వదిలెయ్యి."

 

    అతను మాట్లాడకుండా లోపలికి ఎక్కి కారుని వెనక్కి త్రిప్పాడు.