"నీవు ఇదివరకలా లేవు. నీకు మళ్ళీ నీవాళ్ళమీదకి మళ్లింది ప్రేమ" అలకగా అంది రంజని.
    "అవును. అందుకే నీకోసం డైవోర్స్ కి అప్లై చేశాను. నా పిల్లల్ని కూడా దూరం చేసుకుని నీవు కావాలనుకోడం నీమీద ప్రేమ లేకే" హేళనగా అంటూ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు రవీంద్ర కోపంగా.
    రంజని కాస్త తగ్గింది. తెగేదాకా తాడు లాగకూడదని ఆమెకి తెలుసు. రవీంద్రని ఈ స్టేజిల దూరం చేసుకోకూడదు. కుర్చీవెనక్కి వెళ్ళి అతని తలని గుండెలకదుముకుని "ఐ లవ్ యూ డార్లింగ్. నా ప్రేమ నీకు నీకు ఎప్పటికి అర్థం అవుతుందో..." గోముగా అంది.
    రవీంద్ర ఆమెని ముందుకు లాగి ఆమె మొహాన్ని రెండుచేతులలోకి తీసుకుని తమకంతో ముద్దాడాడు. "ప్లీజ్ కో ఆపరేట్ విత్ మీ ఫర్ సమ్ టైమ్.... డైవర్సు అయ్యేవరకు ఓపికపట్టు..." అన్నాడు. రంజని అలక తీరింది.
                                               * * *
    "సుప్రియా... ఆ మోహన్ అగర్వాల్ కేసు పోస్ట్ పోన్ అయిందన్న సంగతి వారికి చెప్పలేదా? నిన్ననే ఫోన్ చేసి చెప్పమన్నాను కదా... అనవసరంగా పనులు మానుకుని కోర్టుకెళ్ళాడట..." సీరియస్ గా చూస్తూ అన్నాడు.
    సుప్రియ తెల్లమొహం వేసి "సారీ, మర్చిపోయాను... వెరీ సారీ..." తలదించుకుని భయంగా అంది సుప్రియ.
    "చూడండి, ఇది మొదటి తప్పిదం కావాలి... నో మోర్ ఎక్స్ క్యూజెస్" సీరియస్ అన్నాడు.
    "మీరేదో శారద ఫ్రెండ్ అని చెప్పి ఏంచేసినా లైట్ గా తీసుకుంటాననుకోకండి. పనిలో అలక్ష్యం నేను సహించను... సారీ, నేనిలా అన్నాననుకోవద్దు" అని చేర్చాడు.
    నల్లబడిన మొహం దించుకుని సుప్రియ. "సారీ సర్! ఇకముందు ఇలాంటి పొరపాటు జరగదు."
    'గుడ్, ప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ.. యూ కెన్ గో" అన్నాడు.
    తన టేబిల్ దగ్గిరికి వెడుతున్నప్పుడే సుప్రియ మనసులో ఓ నిర్ణయం తీసుకుంది. 'ఇంత టెంపర్ పనికి రాదు బాస్. వాట్ డు యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఈ సుప్రియ శారద ఒకటి కాదు."

                                               * * *
    "మిష్టర్ ఎస్.కె.రెడ్డి..."
    "నో. దిస్ ఈజ్ హిజ్ పి.ఎ. స్పీకింగ్, హు ఈజ్ దట్?"
    "సార్, ఉషోదయం పేపరు తరుపున మిస్టర్ ఎస్.కె. గారి ఇంటర్వ్యు కావాలి. మాకు అపాయింట్ మెంట్ కావాలి" నీరద మాట్లాడింది.
    "ఏ విషయంలో ఇంటర్వ్యు వుంటుంది? కాస్త విపులీకరిస్తారా..." పి.ఏ. ప్రశ్న.
    "జనరల్... ఆయన పెద్ద హోటలీయర్. ఇండస్త్రియలిస్ట్ గా ఆయన సక్సెస్ స్టోరీ పాఠకుల ముందు వుంచాలని... సండే ఎడిషన్ కోసం ఇంటర్వ్యు చేస్తాం..." నీరద అంది.
    "జస్ట్ ఏ మినిట్..." పి.ఏ. ఫోనులో మ్యూజిక్ వినిపిస్తుంటే... "చెప్పడానికి వెళ్ళినట్టున్నాడు. ఇస్తాడా ఇంటర్వ్యు..?" నీరద శ్రీనివాస్ తో అంది.
    "మనం మ్యాంక్ విషయం చెప్పలేదుగదా ఇవ్వచ్చు..." శ్రీనివాస్ అన్నాడు.
    "మేడమ్... ఈరోజు నాలుగుగంటలకి మీకు అపాయింట్ మెంట్ ఇమ్మన్నారు సార్..." అన్నాడు.
    సాయంత్రం నాలుగుగంటలకి సరిగా ఇంటర్వ్యూ మొదలైంది. మొదట ఆయన బిజినెస్ ఎలా ఆరంభించి... ఎలా క్రమంగా ఎదుగుతూ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిందీ, పరిశ్రమల వివరాలు... ఎన్ని వందలమందికి ఉపాధి కల్పించిందీ గొప్పగా చెప్పుకొచ్చాడు. అట్టడుగునించి స్వయంకృషితో ఆరంభించి ఇంత ఎత్తుకు ఎదిగిన తన సక్సెస్ స్టోరీ చాలా ఆనందంగా, గర్వంగా చెప్తున్నాడు.
    నీరద మధ్యలో "ఎక్స్ క్యూజ్ మీ సార్... మీరు అట్టడుగునించి రూపాయి రూపాయి కూడబెట్టి వేలు, లక్షలు, కోట్లు చేశారు గదా. మరి ఒక మామూలు సంసారీ ఎన్నాళ్లు కష్టపడితే ఒక లక్షో రెండు లక్షలో కూడబెట్టగలడన్నది మీకు బాగా తెలిసివుండాలి కాదా సార్... అలాంటి వందలాదిమంది సామాన్య గృహస్థులు కష్టపడి దాచుకున్న సొమ్ము బ్యాంకుల దివాళా వల్ల పోగొట్టుకుంటే ఎంత వ్యధకి లోనవుతారన్నది మీకు బాగా అర్థం అవుతుంది గదా సార్..." నీరద చాలా మామూలుగా అడిగింది.
    అతని మొహంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కళ్ళల్లో అనుమానం, మొహంలో కాఠిన్యత అలుముకుంది.
    "సార్... దివాళా తీసిన ప్రముఖ బ్యాంక్ ఖాతాలో డిఫాల్టర్ గా మీ పేరూ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు గురించి మీరు ప్రజలకి ఏమన్నా తెలియచెప్పాలనుకుంటున్నారా..." నీరద సూటిగా చూస్తూ అడిగింది.
    శ్రీధర్ కుమార్ మొహంలో రంగులు మారాయి. కానీ అనుభవజ్ఞుడైన ఓ బిజినెస్ మ్యాన్ కనుక ఒక నిముషంలోనే మామూలు అయిపోయాడు.
    "మీరు సక్సెస్ స్టోరీ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇప్పుడీ ఇంటర్వ్యూలో అది అప్రస్తుత ప్రసంగం అవుతుంది. సమ్ అదర్ టైమ్" అంటూ కుర్చీవెనక్కి నెట్టి లేచి నిలుచున్నాడు. "గుడ్ డే మిస్ నీరద" అన్నాడు.
    నీరద ఖంగారుగా "సార్, ప్లీజ్! ఒక నిముషం... ఈ బ్యాంక్ దివాళా తీసి అనేకమంది డిపాజిటర్లు జీవస్మరణ సమస్య ఎదుర్కొంటున్నారు. అటువంటి తరుణంలో ఓ బాధ్యతాయుతమైన పారిశ్రామికవేత్తగా తీసుకున్న రుణాలు తీర్చి ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?"
    ఈసారి అతని మొహం మరింత నల్లబడింది. "సారీ, ఈ విషయాలు ఇప్పుడేం చెప్పలేను. యూ కెన్ గో నౌ" అంటూ వెళుతుంటే వెనకనించి "మీరు ఇంటర్వ్యూ నిరాకరించారని రాసుకోమంటారా సార్. పత్రికాముఖంగా నిజానిజాలు చర్చించే ధైర్యం మీకు లేదా?" నిలేసింది.
    అతను వెనక్కి తిరిగాడు. ముఖం ఎర్రబడింది. కఠినంగా... "యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకోండి. నౌ యు గెటౌట్ ఆఫ్ దిస్ ప్లేస్" అంటూ బెల్ నొక్కాడు. పి.ఏ. రాగానే కరుకుగా "వీరిని పంపించు" అంటూ పక్కనున్న రెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
                                            * * *