"నువ్వెవరివి? ఎందుకొచ్చావు అని" కనకారావు ఓపిగ్గా అన్నాడు.

 

    "నేను రిటైర్డ్ స్కూల్ టీచర్ ని"

 

    "అది సరే! ఎందుకొచ్చావు" అర్జునరావు టెన్షన్ ఫీలవుతూ అడిగాడు.

 

    "ఎందుకొచ్చావేమిటిరా పావు చెయ్యి వెధవా. స్వతంత్ర భారత పౌరుడ్ని ఎక్కడికయినా రావచ్చు. ఎప్పుడయినా వెళ్ళవచ్చు" బిత్తర పోయారందరూ ఆ మాటలకి.

 

    "ఇదేమన్నా పబ్లిక్ గార్డెనా? ఎవరయినా రావడానికి? ఎప్పుడైనా వెళ్ళటానికి?" అర్జునరావు కోపంగా అన్నాడు.

 

    "ఎందుకురా అలా కోప్పడతావు కోపిష్టి కొంకిరి కాణా" నవ్వుతూ అన్నాడతను.

 

    "అందర్ని అలా రా౧ ఒరేయ్, వెధవ అనడం నీకు అలవాటా?" ఉక్రోషంగా అన్నాడు అర్జునరావు.

 

    "భలే కనిపెట్టేసావే, స్కూల్ టీచర్ గా చేసి రిటైరయ్యాను గదా. నాకు ఎవర్ని చూసినా నా దగ్గర అక్షరం ముక్కలు నేర్చుకునే పిల్లకాయల్లాగా కనబడతారు"

 

    ఆ మాటలతో అర్జునరావుకి అరికాలి మంట నెత్తికెక్కి పోయింది.

 

    "ఇది పెద్ద వాళ్ళుండే ఇల్లు. ఈ ఇంటి యజమానులకు గొప్ప గౌరవ ప్రతిష్టలున్నాయి. ఇక్కడ వున్న అందరి కాలమూ ఎంతో విలువైనది."

 

    "ఆహా... అలాగా... మరి ఆలాంటప్పుడు నీలాంటివాళ్ళు ఇక్కడ వుండకూడదే"

 

    అతని మాటలు పూర్తవకుండానే కనకారావు కిసుక్కున నవ్వాడు. అంతలోనే నాలిక్కరుచుకున్నాడు.

 

    అర్జునరావు కోపం నషాళానికి అంటిపోయింది.

 

    "పిచ్చి వాగుడు కట్టిపెట్టు" అన్నాడు కోపంగా. ఈ సంభాషణ ఇలా జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు సామంత్ దీక్షగా ఏదో ఫైల్ తిరగేస్తున్నాడు.

 

    "నేనడుగుతున్నాను చెప్పు బాబు. మీరెవరు? ఎందుకొచ్చారు?" గౌరవాన్ని కనబరుస్తూ అడిగింది నాగమ్మ.

 

    "నేను రిటైర్డ్ స్కూల్ టీచర్ నమ్మా. మా అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చాం"

 

    అర్జునరావులో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ మాటలతో.

 

    "మరి తీసికెళ్ళు..." అన్నాడు అర్జునరావు ఆనందం పట్టలేక.

 

    "ఏడి...? ఎక్కడ...?" అన్నాడా నడి వయస్కుడు. అర్జునరావు, కనకారావులు షాక్ తిన్నారా మాటలకు.

 

    నాయకి, నాగమ్మలు విస్తుపోయారు.

 

    సామంత్ ఓసారి తలెత్తి అర్జునరావు, కనకారావులకేసి చూసి కన్నుగొట్టి తిరిగి ఫైల్లో తలదూర్చాడు.

 

    "ఇక్కడున్నాడని చెప్పావటగదా?" అర్జునరావు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు.

 

    "పనికిమాలిన సంఘటనల్ని పత్రికల కెక్కించే పాత్రికేయుడిలా అలా విరుచుకు పడతావేంటి? బెత్తం తేవడం మర్చాను. లేదంటే నీ వీపు చీరేసేవాడ్ని. ప్రోగ్రెస్ రిపోర్టులో పౌరుషం చూపలేని పావు బ్రెయిన్ కాణా" ఆయన కోపగించుకున్నాడు.

 

    అవమానంతో అర్జునరావు మొఖం మాడిపోయింది. కనకారావుకి మాత్రం అర్జునరావును అలా తిట్టటం చాలా ఆనందంగా వుంది.

 

    అర్జున్ రావు తినేసేవాడిలా కనకారావుకేసి చూశాడు.

 

    "ఉరుము ఉరిమి ఎవరిమీదో పడ్డట్టు నేనంటే ఆ అర్భకుడి కేసి కోపంగా చూస్తావేంటి?"

 

    అతని నోరెలా మూయించాలో అర్థంగాక వెర్రెక్కిపోయాడు అర్జున్ రావు.

 

    నాగమ్మ సెక్రటరీ కేసి చూసింది అసహనంగా.

 

    సెక్రటరీకి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి.

 

    "సామంత్ గారు మీ కొడుకని చెప్పారుగా?" సెక్రటరీ అన్నాడు కోపంగా.

 

    "చెప్పాను. అయితే?"

 

    "అయితే ఏమిటి? ఎదురుగా వున్నారుగా?"

 

    "ఏడీ?"

 

    "అదిగో ఆ ఫైల్ చూస్తున్నవారే?"

 

    "ఛా... ఊరుకో... ఈ వయస్సులో నామీద జోకు వేస్తావేంటి? ఆయనెవరో దొరబాబులా వున్నాడు. గొప్ప విద్యాధికుడిలా కనిపిస్తున్నాడు. నువ్వేం చదువుకున్నావు బాబు?" సామంత్ నుద్దేశించి ప్రశ్నించాడు సెక్రటరీ మీద నుంచి తన చూపుల్ని సామంత్ మీదకు మరలిస్తూ.

 

    బ్రెయిన్ లో ఆటంబాంబు పేలినంత పనయింది అర్జునరావుకి, సెక్రటరీకి.

 

    కనకారావు పిచ్చి నవ్వొకటి నవ్వాడు.

 

    "ఆటోమోబైల్ ఇంజనీరింగ్ లో ఎం.టెక్. మాస్టారు" సామంత్ సౌమ్యంగా చెప్పాడు.

 

    "నీలాంటి తెలివిగల విద్యార్థికి గురువును కాలేకపోయాను. ఇది నా దురదృష్టం. ఇంతకీ నీపేరు కూడా సామంతేనా బాబూ?"

 

    అర్జునరావు మెదడు ఘనీభవించి పోయింది.

 

    సెక్రటరీకి వెర్రిచూపులే దిక్కయ్యాయి.

 

    "అవును మాస్టారు. మీ అబ్బాయి పేరు కూడా సామంతేనా?" వినయంగా అడిగాడు సామంత్.

 

    "అవును బాబు. అందుకే ఈ పొరపాటు జరిగింది. నేనెళ్ళొస్తా బాబు. రండర్రా వెళ్దాం" అని తన భార్యా బిడ్డలకేసి చూసి బయటకు సాగిపోయాడు. ఆయన వెనుకే ఆయన భార్యాపిల్లలు వెళ్ళిపోయారు.

 

    "ఏమిటీ పిచ్చి పనులు సెక్రటరీ?" నాగమ్మ సెక్రటరీని కసురుకుంటూ.

 

    "ఎక్కడో చిన్న పొరపాటు జరిగుంటుంది. దాని మూలంగా మన సెక్రటరీ కూడా పొరపాటుపడ్డాడు" సామంత్ నాగమ్మను శాంతపరిచేందుకు అన్నట్టుగా అన్నాడు.

 

    అప్పటికే తేరుకున్న అర్జున్ రావు "ఇకనుంచైనా విజ్ఞతతో వ్యవహరించు. ఇలా పెద్దవాళ్ళ విలువైన కాలాన్ని వృధా చేయడం మంచిది కాదు" పెద్దరికాన్ని నెత్తిన వేసుకుంటూ సెక్రటరీని మెత్తగా మందలించాడు.

 

    "అర్జున్ రావుగారు చెప్పినట్టు చేయండి మిస్టర్ సెక్రటరీ" సామంత్ కావాలనే అన్నాడు.

 

    "సారీ బాబు" అర్జున్ రావు సామంత్ కేసి చూస్తూ అన్నాడు.

 

    "ఇట్సాల్ రైట్. పొరపాటు ఎవరికైనా సహజమే. పొరపాటు పొరపాటు కాకుండా వుంటే బావుంటుంది. ఐమీన్ పొరపాటు బహువచనం కాకుండా వుండాలని" అన్నాడు ఆ గందరగోళాన్ని సర్దేస్తున్న ధోరణిలో.

 

    "ఎవరో వీధి రౌడీకి సేమ్ పేరున్నంత మాత్రాన ఎవరేమిటో తెలిసి కూడా పిచ్చివాడిలా చేశావ్. నా భర్త విలువైన కాలాన్ని మరోసారిలా వృధా చేసినా, వారికి చిరాకు కలిగించినా మీరు ఇంటికెళ్ళ వలసి వస్తుందని గుర్తుంచుకోండి. ఇక మీరు వెళ్ళిపోవచ్చు" అంది నాయకి సెక్రటరీకేసి కోపంగా చూస్తూ.