అదురుతున్న కనురెప్పలతో ఆమెకేసి చూసి "మీరా?" అన్నాను గగుర్పాటుతో.

    "రండి ఇవాళ ఉదయంనుంచీ ఆయన మూసినకన్ను తెరవలేదు. భరించలేని బాధ. అప్పుడప్పుడూ కొట్టుకోవటం కూడా కద్దు. అందుకని మీకు కబురు చేశాను. మరి వేరే డాక్టరు దగ్గరకు పోవటానికి మాకు డబ్బులేదుగా... నా పేరే అనసూయ" అని దారిచూపుతూ లోపలకు పోసాగింది.    
    నేను తెప్పరిల్లి, అయోమయంగా ఆమెను అనుసరించాను. ఎడమవైపున వున్న యిరుకైన గదిలో రోగి వున్నట్లు తెలుస్తోంది. 'ఒంగండి' అని వెనుదిరిగి నవ్వి "నేను ఇంత చనువు తీసుకుంటున్నానని మీకు ఆశ్చర్యంగా వుందా? మీరు నాకు పరాయివారు కాదు డాక్టర్. నేను మీకు పిన్నినవుతాను."    
    నా నివ్వెరపాటుకు హద్దులేదు.    
    ఆమె మళ్లీ కొంచెం నవ్వి "ఇది నిజమే ఇందులో అబ్బురమేమీ లేదు. మీరు తెల్లబోతారెందుకు...? సరే, దాన్నిగురించి తరువాత మాట్లాడుకుందాము. ముందు ఆయన్ని చూడండి. ప్రొద్దుటినుంచీ నా మనసంతా చాలా కలవరంగా వుంది" అని చేయెత్తి మంచంమీద అచేతనంగా పడివున్న వ్యక్తికేసి చూపుతూ "అదిగో వారే మీ బాబాయి.... జబ్బుమనిషి" అంది.    
    ఈ మాటలు విచిత్రంగా ధ్వనించాయిగాని, శ్రద్ద వహించక రోగిదగ్గరకు పోయి, అక్కడవున్న కుర్చీలో కూర్చుని అతని ముఖకవళికలు పరిశీలించాను. ఇతను మీ బాబాయంది అనసూయ. నలభై అయిదేళ్ళు దాటిన వ్యక్తి. ప్రస్తుతం వ్యాధివల్ల సుష్కించిపోయినట్లు వున్నా కఠినమైన శరీరంతో జీవితంలో బాగా రాటుదేలిన మనిషివలె వున్నాడు. నాడి చూశాను.    
    "పది పదిహేను రోజులనించీ విడవకుండా జ్వరం వస్తోంది. 'ఎవరికైనా డాక్టరుకి చూపించుకోండి' అంటే 'అదే తగ్గిపోతుందిలే' అంటూ ఉపేక్ష చేశారు. కడుపులో విపరీతమైన నొప్పి తెల్లవారుఝామున మట్టుకు నన్ను పిలిచి 'బాధగా వుందే అనూ' అన్నారు. అప్పుడు నేను చప్పున గుర్తుచేశాను. "మీ అన్నగారి కొడుకు డాక్టరై యీ వూళ్ళోనే వుంటున్నారని చెబుతూ వుంటావు కదండీ. ఆయనకు కబురు చేద్దునా!" అని "ఆఁ సమయానికి గుర్తుచేశావు. అలాగే చెయ్యి వాడు ఫలానాచోట వుంటాడు" అని చెప్పి మళ్లీ బాధతో కొట్టుకొని చివరకు మగతలో పడిపోయారు" అని చెప్పి విసనకర్రతో ఆయనకు విసురుతూ "వారికెలా వుంది డాక్టర్?" అని ఆందోళనతో ప్రశ్నించింది.    
    నేను పరీక్ష ముగించి ఆయన ముఖంకేసి తీక్షణంగా చూశాను. ఎవరీ బాబాయి?    
    అసలు నా జీవితం ఏకాంతంతో కూడినది. పిరికివాడినీ, చీటికీమాటికీ సిగ్గుపడే స్వభావమూ. బంధువులెవరోకూడా సరిగ్గా తెలియని గతి. ఇహ బాబాయిగారు (మా కుటుంబాల్లో తండ్రులని అట్లాగే ఎంచేవాళ్ళం) అతి గంభీరమైన వ్యక్తి. నాతో కుటుంబానికీ, వ్యవహారానికీ సంబంధించిన ప్రసక్తి ఏమీ తీసుకువచ్చేవారు కాదు. అందుచేత నాకు బాబాయి వరుస ఎక్కడున్నా, ఎవరన్నా వున్నారేమో ఎప్పుడూ చెప్పారుకాదు.    
    స్టెతస్కోప్ ని బ్యాగ్ లో పెట్టేస్తూ అనసూయ ముఖంలోకి చూశాను యేమైనా చెబుతుందేమోనని నాకామె మాటలు యింకా వినాలని కుతూహలంగా వుంది... అన్నట్టు పిన్ని అందిగా.    
    నేను లేచే ప్రయత్నంలో వుండటం కనిపెట్టి నావంక చూసి బయటకు వెళ్ళిపోయింది. నేనూ వెనుకనే నడిచి ఆ పరిస్థితిలో ఇహ ఆశ్చర్యానికి స్వస్తిచెప్పి, అక్కడున్న కుర్చీలో కూర్చుని ఆమెతో రోగానికి సంబందించిన విషయాలు ముచ్చటించసాగాను. ఇదివరకు ఇలాగే రెండు మూడుసార్లు వచ్చిందని ఆమె చెప్పింది. జబ్బు చేసినప్పుడు ముఖ్యంగా కడుపుభాగం పెరుగుతుందిట. టెంపరేచర్ ఛార్ట్ కూడా తయారు చేశానని చూపించింది.    
    ఈ జబ్బుని గురించి నా అనుమానం ప్రస్తుతానికి నా మనసులో వుంచుకున్నాను. అనసూయ నావంక చూసి కొంచెంగా నవ్వి "డాక్టర్! మనం పరయివాళ్ళం కాదు. మీరు యిహ రోజూవచ్చి శ్రద్దగా చూసి పోతూ వుండాలి. ఆయన్ని మీచేతిలో పెట్టాను. మీ దయ" అంది.        
    నేనీ మాటలకు లజ్జితుడనయినాను. "పిన్నీ!" అని పిలవాలనుకున్నాను. కాని బెరుగ్గా, సిగ్గుగా వుంది. "ఒక మాట చెబుతా కోపగించుకోకండి. మీరు యిలాంటిమాట అనవచ్చా?"    
    "నేనన్నదానిలో బేసబబు ఏముంది?"    
    "అది మీకెలా తెలుస్తుంది?" అని కొంచెం తటపటాయించి "మీరు ఈ వూరు వచ్చి యెన్ని దినాలైంది?" అని అడిగాను.    
    "అయిదారు నెలలయిందనుకుంటాను."    
    "మరి చూడండి....మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను....ఆ దేవాలయానికి తరుచు వస్తూంటారు కదా... నన్ను చూశారా?"    
    తరువాత నేను మందబుద్దినని నిందించుకోసాగాను. ఈ ప్రశ్న నాకే మోటుగా వుంది.    
    కాని ఆమె మందహాసంచేసి తలవూపి అలానే గోడనానుకొని నిలబడింది.    
    నేను మరికొంచెం తడుముకుంటూ, తడబడుతూ ఈసారి "మన బంధుత్వం విషయం మీకు ఇదివరకే తెలుసా?" అని అడిగేశాను.    
    "తెలియదు. కాని వారి మాటలు విన్నప్పటినుంచీ ఆ డాక్టర్ గారు మీరేనని అనుమానం కలుగుతూ వచ్చింది. నాకెందుకో ఒక్కోసారి ఇలానే అనుమానాలు కలుగుతాయి. పైగా నిజమై వూరుకుంటాయి."    
    నేను విస్మితుడినైనాను. నన్ను ఆకస్మికంగా యిక్కడ చూచినప్పుడుకూడా తెల్లబోయినట్లు కనబడలేదు. బహుశా ఈవిడ భర్తకు సంబంధించిన విషయాలకు తప్ప లౌకికమైన యితర విషయాలకు ఏమీ విలువ యివ్వదు కాబోలు."    

    నేనామెవంక చూశాను. భర్తను గురించిన విషయం ఎప్పుడు యెత్తినా ఆమె విశాలమైన నేత్రాలతో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈమెకు ఎంత చూసినా యిరవయ్యేళ్ళకన్నా వయసు యెక్కువ వుండదు. మరి వీళ్ళిద్దరికీ యింతవార యెలా సంభవించింది? ఈమె రెండోపెళ్ళి భార్యా! ఇంతకుపూర్వం వీళ్లు యెక్కడ వుండేవాళ్ళు? ఈయన నాకు యే రకంగా చుట్టం?