కొంచెం ప్రశాంతంగా వుంది అప్పారావుకిప్పుడు.

 

    ఈ వార్త రేపు ఉదయానికి ప్రచురింపబడితే ఆ తర్వాత నలభైఎనిమిది గంటల్లో ఎన్ని అనర్థాలు సీరియస్ గా జరగాల్సిందీ ఆలోచిస్తున్నాడు.

 

    పత్రికా విలేఖర్లు వెళ్ళిపోయిన పదినిముషాలపాటు పచార్లు చేస్తూనే వున్న అప్పారావు డి.యస్పీ.ని చూస్తూ అన్నాడు.

 

    "అవునూ... ప్రెస్ కాన్ఫరెన్స్ కి రామసూరి రాలేదు కదూ?"

 

    "వాడు దొరకలేదండీ."

 

    "తెలివైన వాడుగా... దొరకడు..."

 

    "అవును... దొరికితే నేను దుంప తెంచేవాడ్ని" సుందర్ ఆవేశంగా అన్నాడు.

 

    "లేదు సుందర్... వాడు రాకపోవడమే మనకి చేసిన పెద్దమేలు. లేకపోతే నిన్నూ నన్నూ నిజంగా కంగారుపెట్టే అంత మేధావి. నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకో అభ్యంతరంలేదు. కాని వాడ్నిమాత్రం తక్కువగా ఆలోచించకు."

 

    "ఓ పనిచేస్తే సరిపోతుంది" చాల ముందుచూపుని ప్రకటిస్తూ అన్నాడు సుందర్.

 

    "ఇదంతా మనకి అనుకూలంగా నిరూపించబడ్డాక ఓ తప్పుడువార్త ప్రకటించాడన్న నేరంపై వాడ్ని లోపలవేసి తోమి వదిలిపెడతాను.

 

    "అదీ అలా అన్నావు బాగుంది" పేట్ చేశాడు అప్పారావు.

 

    అదిగో అప్పుడు ఫోన్ రింగయ్యింది.

 

    ఉలిక్కిపడ్డాడు అప్పారావు "మళ్ళీ అది ఏ రాజధాని ఫోనో అయ్యుంటుంది. నువ్వందుకో. నేను లేనని చెప్పేయ్" హడావుడిగా అన్నాడు సుందర్ తో.

 

    వణుకుతున్న చేతుల్తో రిసీవర్ని అందుకున్న సుందర్ "హల్లో!" అన్నాడు గాద్గదికంగా.

 

    "గుడ్ మాణింగ్ మిష్టర్ సుందర్!" వినిపించింది ఆవలివేపునుంచి. అంతే కాదు... ఆ ఫోన్ ఎక్కడ్నుంచీ అర్థంకాగానే ఆవేశపడ్డాడు కూడా... "నాకు తెలుసు మీరక్కడే వుంటారని" రామసూరి గొంతు వ్యంగ్యంగా పలికింది.

 

    "నాతో ఏం పని నీకు?"  

 

    "కొంచెం వినండి అర్థమవుతుంది."

 

    ఏదో 'ఆన్' చేసిన చప్పుడు. వినకూడనిది వింటున్నట్లు ఎలర్ట్ అయిపోయాడు.

 

    ఒకటి... రెండు... మూడు

 

    అయిదు నిముషాలు గడిచాయి.

 

    అప్పటికే సుందర్ నుదురు చెమటతో తడిసిపోయింది "ఏంటిదంతా?"

 

    "మీ స్టేషన్ లో యశస్వితో మాట్లాడుతుండగా రికార్డు చేసిన చర్చ. ఇది చాలనుకుంటాను నువ్వు పరోక్షంగా నేరస్థుడివని నిరూపించడానికి! అవునూ... పేపరులో చంద్రం ఇంటర్వ్యూ కూడా చూసే వుంటావు. దట్ ఆల్సో రికార్డెడ్..."

 

    "అందులో ఆ చంద్రంగాడు నేను నానీవెంట పడుతున్నానని నీకు చెప్పాడా."

 

    "మనిషిగా నిలబడడంతప్ప మేనీప్యులేషన్స్ తో ఎదగడం మిన్న అని ఆలోచిస్తూ అంచెలంచెలుగా ఈ స్థాయికొచ్చిన ఓ మితృడా! ఏమన్నా కాని అలా బలమైన ఆధారం సంపాదించాకనే నేను పత్రికల్లో పబ్లిష్ చేసింది. సో... నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అందాకా ఓ పనిచెయ్... యశస్విని విడిచిపెట్టు.

 

    "అసంభవం."

 

    "అయితే రేపు పత్రికలో మళ్ళీ ఫోటోలు వస్తాయి. అదే, అక్కడ నువ్వు స్మశానవాటికలో కాటికాపర్ని కొట్టావే... తీశానులే... నిజం చెప్పొద్దూ నువ్వలాంటి మగాడివని తెలీకే నేనూ యశస్వి చాటుగా నిన్ను వెంటాడింది. చేయమంటావా... అక్కడ సమాధులమధ్య ఓ నిజాన్ని ఎలా సమాధిచేసే ప్రయత్నం కొనసాగించావూ అన్నది ప్రజలకి తెలిసిపోతుంది. అవునూ... యశస్వి పోలీసాఫీసరు కాబట్టి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టొచ్చుగా. ఓహో... నానీని లేపేయాలనే మీ ప్రయత్నానికి అడ్డం అనుకున్నావేమో కదూ. రిడిక్యులస్ మిష్టర్ సుందర్. ఆ హరికి ఎన్నాళ్ళు షల్టరిస్తావో నేనూ చూస్తాను. మర్యాదగా యశస్విని విడిచిపెట్టేయ్. ఓకే."  

 

    "బాస్టర్డ్" ఫోన్ క్రెడిల్ చేసిన సుందర్ జరిగినదంతా చెప్పాడు అప్పారావుతో. "వీడ్ని... వీడ్నేదో చేయాలి..." ఉక్రోషంగా మండిపడుతున్నాడు.

 

    అప్పారావు వెంటనే జవాబు చెప్పలేదు. చెప్పలేని సందిగ్ధతలోనే అప్పారావు తల పట్టుకుంటాడని సుందర్ కి తెలుసు.

 

    కొన్ని క్షణాలు అలాగే నిలబడిన అప్పారావు ఫోన్ చేశాడెక్కడికో. ఆ సమయంలో హరి ఎక్కడ వుండేదీ అప్పారావుకి తెలుసు.

 

    "నేనే హరీ... అప్పారావుని. అదే మీ అందరి అసమర్థతతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న హోంమినిష్టర్ ని. నాకు ఛీఫ్ మినిష్టర్ డెబ్భయి రెండుగంటలు అవకాశమిచ్చాడు. నేను నీకు నలభైఎనిమిది గంటలే గడువిస్తాను. ఈలోగా నానీ శవం కావాలి. లేదా..." ఓ క్షణం ఆగాడు "నువ్వు అనసూయని హత్యచేసిన కారణంగా పోలీసులకి సరెండర్ కావాలి.. చెప్పేది విను. లేకపోతే డొంకంతా కదిలిపోతుంది. సమస్య ఒకదానికొకటి లింకుగా పెద్దగొలుసై ఆనక అది నాకు ఉరిత్రాడుగా మారుతుంది. ఇక నువ్వు చెప్పేది నేను వినను. నువ్వు సరెండర్ కాకపోయినా నేనే పట్టిస్తాను. అంతే" రోషంగా ఫోన్ పెట్టేశాడు. "అంతే సుందర్! నలభై ఎనిమిదిగంటల వరకూ చూడు. ఈలోగా హరి నానీని పట్టుకోగలగాలి. లేదా వాడ్ని అరెస్ట్ చేయ్. యస్! తప్పదు" ఆదేశించాడు. కాదు... తనచుట్టూ బిగుసుకుంటున్న ముడుల్ని తనవాళ్ళూ అనుకుంటున్న అందరికీ పంచేశాడు.

 

    ఇది జరిగిన మరో అరగంటలో పోలీస్ స్టేషన్ కి చేరిన సుందర్ యశస్విని విడిచిపెట్టడంతోపాటు తనకి అత్యంత ప్రీతిపాత్రులైన కానిస్టేబుల్స్ ని పిలిచి 'నానీ' ఫోటో చూపించి పట్టుకురావాలన్నాడు. పట్నమంతా నిద్రాహారాలు మాని గాలించమన్నాడు. నానీ అనే ఓ పసికందుని నేలమట్టం చేయడానికి ఒక బలమైన పథకాన్ని రూపొందించి మరీ పంపాడు.

 

    ఇదే సమయానికి హరికూడా దెబ్బతిన్న పులిలా రంగంలోకి దిగి తన అనుచరుల చేతికి నానీ ఫోటోవున్న దినపత్రికలందించాడు.

 

    "వీడు కనబడగానే పొడిచి చంపేయండి. ఆనక ఆ శవంగురించి నాకు తెలియచేయండి. ఇన్ని హత్యలతో అరాచకాలతో యింత అనుభవంగల మనందరికీ ఇదో సవాల్..." ఒకక్షణం ఆగి సాలోచనగా అన్నాడు.

 

    "అనసూయని నేను చంపగా చూసింది నానీగాడొక్కడే. ఆ విషయం ఆ తవిటయ్యగాడికీ తెలిసింది అంటే బహుశా నానీ వాడి దగ్గరున్నా వుండితీరాలి. కనీసం వాడి ఆచూకీ అయినా తవిటయ్యకి తెలిసి వుండాలి."