ఆమె ఆయన చెప్పినట్లు వింది. ప్రక్కనే డాక్టర్ గారింట్లో ఆ రాత్రికుండి, మర్నాడు ఆయనతో కలిసి వాళ్ళ ఊరు చేరింది.    
                                    *    *    *    *    
    1946వ సంవత్సరం.....    
    అత్తగారినీ, భార్యనీ, పిల్లన్నీ తీసుకుని శ్రీహరిరావు తిరుపతి వెళ్ళాడు. శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని, తిరిగి వస్తూ వస్తూ రేణిగుంటలో మజిలీ చేశారు.    
    ఆ రాత్రి.    
    "శ్రీహరిరావుగారు మీరేనా?" అంటూ ఓ మనిషి హడావుడిగా వచ్చి అడిగాడు.    
    "నేనే!"    
    "మీరు వెంటనే నాతో బయల్దేరి తిరిగి తిరుపతి రావాలి. ఇక్కడో అన్యాయం జరిగిపోయింది" అన్నాడతను బాధగా.    
    "ఏమయింది? మిమ్మల్నెవరు పంపించారు?"    
    "నన్ను ఒక స్వాతంత్రయోధుడు పంపించాడు. అక్కడ జరిగిన ఘోరం వెలుగులోకితెచ్చి, తగిన న్యాయం చేకూర్చగలిగేది మీరొక్కరే" అని చెప్పాడు.    
    "ఏమిటంత ఘోరం?"    
    "కోయంబత్తూరు నుండో కోయవాడు, లక్కపిడతల వ్యాపారం పెట్టుకుందామని తిరుపతి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైట తిరుగుతున్నవాడ్ని అనుమానించి, పోలీసులు అరెస్టు చేశారు. మూటలో ఏమున్నాయో చెప్పమని ఒత్తిడి చేస్తే, వాడు లక్కపిడతలు తీసి చూపించాడు. అయినా, వాడిమీద లేనిపోని కేసులు బనాయించి, తెల్లవార్లూ రిమాండ్ లో పెట్టి చితక బాదారు. రాత్రంతా వాడి హృదయవిదారకమైన కేకలూ, ఏడ్పులూ స్థానికులు విన్నారు. ఇదేమిటని అడగబోతే పోలీసులు బెదిరించి, అదిలించి పంపేశారు. తెల్లవారగట్ల నించీ వాడి కేకలూ, శబ్దాలూ వినిపించడం మానేశాయి. మాటు మణిగిపోయింది. దాంతో అనుమానమొచ్చిన కొందరు వెళ్ళి అడుగగా, విడిచిపెట్టేశాం వాడి ఊరు వాడు వెళ్ళిపోయాడు అంటున్నారు. అన్ని దెబ్బలు తిన్నవాడు చచ్చేస్థితిలో ఎక్కడికీ కదలలేడు. కాబట్టి తప్పకుండా వాడ్ని చిత్రహింసలు పెట్టి చంపేసి వుంటారని స్థానికుల అభిప్రాయం. కానీ, ఇది బయట పెట్టడానికి అక్కడెవరికీ శక్తిలేదు. మీరొక్కరే అందుకు సమర్దులని భావించి నన్ను పంపించారు."    
    అంతా విని, శ్రీహరిరావుగారు వెంటనే బయల్దేరి, కలెక్టరాఫీసు కెళ్ళి తన అనుమానాల గురించి చెప్పి, కలెక్టర్ గారిని వెంటపెట్టుకుని, ఆయన జీపులో తిరుపతి ప్రయాణమయ్యాడు.    
    పోలీస్ స్టేషన్ ముందు జీపు దిగి, లోపలికొస్తున్న కలెక్టర్నీ, శ్రీహరిరావునీ చూసి పోలీసులు కళవరపడ్డారు. పేదవాడి శవం గురించడుగగా, తమకు నోటికొచ్చిన సమాధానాలు చెప్పారు శ్రీహరిరావు గారు జైలు చుట్టూ తిరిగి పరీక్షించగా, ఆయన దృష్టి-ఒకచోట నిలిచింది. తడి మన్నుతో పూడ్చిన గుర్తుగా వెనుకవైపు నాలుగడుగుల వెడల్పు స్థలం కనిపించింది. ఆయన ఆలస్యం చెయ్యలేదు. నలుగురు మనుషులని పిలిచి, అక్కడ తవ్వించాడు. ఎక్కువ లోతు తవ్వక్కరలేకుండానే పేద వాడి శవం బయటపడింది. దాంతో వాళ్ళ ఆట కట్టింది. కలెక్టరుగారు అతని సునిశిత దృష్టిని అభినందించారు. మొత్తం పోలీసుల్ని సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసారు.    
    తిరుపతిలో ఆ పట్టు పట్టూ మూడ్నెల్లు ఉండిపోయారు. అక్కడి యూనివర్సిటీ విద్యార్ధులు ఈయన ఉపన్యాసాలంటే ప్రాణంపెట్టేవారు.    
    ఒకనాడు ప్రొద్దుటే, "రమణా! కాఫీ తెస్తాను!" అంటూ మరచెంబూ, రెండు రూపాయలనోటూ పట్టుకుని, హోటలుకెళ్ళిన మనిషి ఇంక తిరిగి రాలేదు.    
    ఎంతకీ రాని భర్తకోసం రమణమ్మ గుమ్మంలో ఎదురుచూస్తూ కూర్చుంది. చాలాసేపటికి రంగా అనే విద్యార్ధి మరచెంబుతో కాఫీ తీసుకుని వచ్చి.    
    "గురువుగారికి కాకినాడ నుంచి అరెస్టు వారెంటొచ్చింది. అరెస్టు చసి అటునుండటే పట్టుకెళ్ళిపోయారు. మిమ్మల్ని మాకప్పజెప్పి వెళ్ళారు. ఏం ఖంగారు పడకండి మేము చూసుకుంటాము" అని ధైర్యం చెప్పాడు.    
    "అరెస్టు చేశారా? ఏ జైల్లో పెట్టారూ? ఎప్పుడొస్తారూ?" అని ఆమె ఏడుస్తూ ప్రశ్నలు వేసింది. ఊరుకాని ఊళ్ళో, ముసలి తల్లీ, చంటి పిల్లలతో, ఆమెకి చాలా భయం వేసింద  
    "నేను ఆయన జీపు వెనకాలే ఇద్దరు కుర్రవాళ్ళని, ఫాలో అయి 'అజ' తెలుసుకుని రమ్మని పంపించాను. వాళ్ళు వస్తూనే వుంటారు ఈ పాటికి" అన్నాడు.    
    సాయంత్రానికి మళ్ళీ రంగా వచ్చాడు.    
    "గురువుగారిని తిరుత్తణి జైలులో పెట్టారుట. ఆర్నెల్లు శిక్ష పడిందిట. మీకొచ్చిన భయమేమీలేదు. మీరీ సత్రంలో వున్నన్నాళ్ళు వుంచేటట్లు అనుమతి తెచ్చాను" అన్నాడు.    
    వార్త వినగానే ఆమె కుప్ప కూలిపోయింది. ఆమె తల్లీ, పిల్లలూ కూడా దుఃఖించారు.    
    ఆ క్షణం నుండీ వారు చాలా కష్టపడ్డారు. ఇద్దరు పోలీసులు సత్రం గుమ్మం వద్ద కాపుకాసి, వీళ్ళకి ఎటువంటి సహాయం అందకుండా చెయ్యసాగారు. వీళ్ళ వద్ద డబ్బేమీ లేదు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడవసాగారు.    
    ఆ రాత్రి "అమ్మా" అన్న పిలుపువినిపించి, రమణమ్మ తలుపుతీసి చూసింది. చిరుగుల బట్టలతో, చేతిలో కర్రతో ఒక పెద్ద పాత్రతో బిచ్చగాడొకడు వాకిట్లో నిలిచి కనిపించాడు.   
    "మేమే దౌర్భాగ్యపు స్థితిలో వున్నాము. నీకేమీ ఇవ్వగలం!" అంటూ ఆమె తలుపు వేసేస్తుండగా, అతను తన కర్ర అడ్డుపెట్టి, పాత్ర వంచి చూపించాడు. ఆ పాత్రలో బియ్యం, పప్పూ, కూరగాయలూ, డబ్బులు మూటా కనిపించాయి. అతను గుసగుసగా "రంగా మనిషిని" అని చెప్పాడు.    
    ఆమె నెమ్మదిగా కొంగుపట్టి, అందులో వేయించుకుంది. ఆరోజు మొదలుగా, ఆ సత్రం గుమ్మంలో తలకింద మూట పెట్టుకుని పడుకున్న బాటసారో, బిచ్చగాడో, లేక ఏ బూరలమ్మేవాడో వచ్చి, రహస్యంగా వస్తువులు అందించేవారు. ఆ విధంగా స్టూడెంట్స్ వాళ్ళని నెలరోజులు పోలీసులకి అనుమానం రాకుండా పోషించారు.