అతని కనుల వెంట నీటిబిందువులు చెంపలమీదుగా జారుతున్నాయి. "అవును, ఇది యిలా జరగవల్సి వుందని విధి లిఖితమై వుంది. ఇందులో ఎవరి తప్పూలేదు"

 

    లేచి నిల్చున్నాడు, "ఆమె నెందుకు ఆపుతాను? నాకన్నా మేధావి ఆమె. ధన్యురాలు ఆమె. ఆమె అజ్ఞాబద్ధుడిని. ఆమె మరొకరికి సేవిక అయితే నేనామె సేవకుడ్ని. ఆమెకంటే ఎక్కువ తెలుసునా నాకు? ఆమె యిచ్ఛానుసారమే సాగానియ్యి మా జీవితాలు."

 

    అతను కళ్ళు తుడుచుకుని, దృఢనిశ్చయంతో బయటకు నడిచాడు.

 

    ఎక్కడ చూసినా ఎండిపోయిన బీళ్ళు, బీడులు వారిన భూమి, నీళ్లు లేని బావులు, ఆకులు లేక మొండిగా నిలబడిన వృక్షాలు, బోసిగా కనబడుతూన్న యిళ్లు, ఇంకిపోయిన ఏరు... ఒకనాటి సంధ్యాసమయాన ఆనందపురం పొలిమేరల్లో అడుగుపెట్టి, ఏకాంత ప్రదేశాన నిలబడి చూస్తున్న వేదితకు కనబడిన దృశ్యాలవి.

 

    సజల నేత్రాలతో చకితురాలై అలాగే నిలబడిపోయింది. ఒకప్పుడు సస్యశ్యామలమైన  భూములతో, భోగభాగ్యాలతో కనులపండువుగా విలసిల్లిన తమ గ్రామమేనా ఇది?

 

    ఆమె పాదాల క్రింద మట్టి మట్టిలా లేదు. ఇనుములా గరుకుతేరి వుంది. నేలమీది పగుళ్లు ఇనుపముళ్ళలా గుచ్చుకుంటున్నా యామె పాదాలకు.

 

    ఎక్కడా మచ్చుకైనా గాలి వీచటంలేదు. ఏమిటిది? ప్రకృతి స్తంభించిందా? శపించిందా? ఇవి గ్రామపు పొలిమేరలా? స్మశాన వాటికా?

 

    ఆలోచనల విషాద స్రవంతిలో మునిగిపోయి అచేతనురాలిగా నిలబడి పోయిన ఆమెకు కాలం పరిగెత్తుతూన్న సంగతి స్ఫురించలేదు. క్రమంగా సంధ్య అస్తమించి నలువైపులా చీకటిఛాయలు వ్యాపించాయి. తదియనాటి చంద్రరేఖా, మెరిసే చుక్కలా నీలాభ్రసరసిలో ప్రకాశించి, భూమిపైకి వెన్నెలను కురిపించసాగాయి.    

 

    అప్రతిభురాలై నిలబడిన ఆమె వీనుల్లో ఏదో సన్నని మ్రోత వినిపించినట్లయింది. వెంటనే తెలివి తెచ్చుకుని "వస్తున్నాను" అంటూ ముందుకు కదిలింది.  

 

    ఒకప్పుడు ఏరు ప్రవహించిన ప్రదేశాన్ని దాటి, ముందుకు సాగి, నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దేవాలయముఖంగా పోతోంది. అట్లాపోతూ, హఠాత్తుగా ఆ వెన్నెల్లో ఓ మనుష్యరూపం పొడగట్టి కాళ్ళకు సంకెళ్లు వేసినట్లు ఆగిపోయింది.

 

    వేణుగోపాలస్వామి దేవాలయానికి వంద గజాలవతలగా పాడుబడిన బావి దగ్గర నేలమీద కూర్చుని వుందా రూపం. ప్రక్కన చిన్న పాక అల్లి వుంది.

 

    "ఎవరూ?" అన్నదా అడుగుల చప్పుడు విని.

 

    వేదిత ఆ వ్యక్తిని సమీపించింది. ఎవరో ఎనభయి ఏళ్ళు దాటిన వృద్ధురాలు. ఓ పాత దుప్పటి కప్పుకుని నేలమీద ముడుచుకుని కూర్చుని వుంది. ప్రక్కన పడివున్న చేతికర్ర. శరీరమంతా ముడతలుపడి వుంది. ముగ్గుబుట్టలాంటి తల. కళ్లు కూడా కనిపిస్తున్నట్లు లేదు.

 

    "నేను పరదేశిని మామ్మ! ఈ ఊరు చూట్టానికి వచ్చాను" అంది వేదిత.

 

    "పరదేశినివా? ఈ ఊళ్ళో ఏముందని చుట్టానికి వచ్చావు తల్లీ! అంతా అయిపోయింది. ఈ ఊరి శోభ, చరిత్ర అంతరించిపోయింది" అన్నదా ముసల్ది వేదితవైపు ముఖం త్రిప్పి వొణికే కంఠంతో.

 

    "అదేమిటి మామ్మా అలా అంటావు? నా చిన్నతనాన ఒకసారి యీ ఊరు వచ్చాను. అప్పుడెంత సజీవంగా, కనులపండువుగా వుంది యీ ఊరు."

 

    "ఆ రోజులు వేరు. ఈ కాలమే వేరు. ఇప్పుడీ వూరికి అరిష్టం దాపురించింది. ఇంతకీ మీ చుట్టాలన్నావు. ఎవరింటికి నువ్వు వచ్చింది?"

 

    వేదిత ఒక్క క్షణం తడుముకుని "అదే... ఈ ఊరి దేవాలయంలో ఒక అర్చకుడూ, ఆయన కుమార్తె వుండేవారు..."

 

    "అయ్యో!" అన్నది ముసల్ది గబుక్కుని. "వారింటికా నువ్వు వచ్చింది ? వారు... వారు..."

 

    "ఏం జరిగింది మామ్మా? అలా కంగారుపడుతున్నావెందుకు?"

 

    కొన్ని క్షణాలపాటు మౌనంగా, దిగులుగా కూర్చుంది ముసల్ది, తర్వాత బరువుగా ఊపిరి తీసుకుని చెప్పసాగింది. అయితే నీకేమీ తెలియదా అమ్మా? ఇన్నాళ్ళూ యీ ఛాయలకైనా రాలేదన్నమాట. నాలుగేళ్ళ క్రితం ఆచారిగారి కుమార్తె వేదిత యీ గ్రామంలో దేవతలా పూజింపబడింది. అంతా ఆమెను అమ్మా అని పిలిచేవాళ్ళం. అప్పుడు గ్రామం పరిస్థితి మూడుపువ్వులు ఆరు కాయలుగా వుండేది. కాని ఉన్నట్లుండి మా మీద భగవంతుడెందుకో చిన్నచూపు చూశాడు. ఒకసారి భయంకరమైన గాలివాన దాపురించి ఏరు ఉపద్రవంగా పొంగి ఊరు వాడా ఏకం చేసింది. ఎంతోమంది ఆ వరదల్లో కొట్టుకుపోయారు. అమ్మ ప్రాణాన్ని కూడా పాడు ఏరు పొట్టన పెట్టుకుంది.  

 

    వృద్ధురాలి చెంపలమీదుగా కన్నీరు ప్రవహించసాగింది. కళ్ళు తడుచుకుని మళ్ళీ చెప్పసాగింది. "అంతే! అప్పట్నుంచీ యీ ప్రాంతమంతా దుర్భిక్షం దాపరించింది. ఘోరమైన అనావృష్టి. మళ్ళీ చినుకు పడలేదు. అసలు ఆకాశాన మబ్బుతునకే కనిపించలేదు. ఘోరకాలీ  సంప్రాప్తమైంది. ప్రజలు తిండిలేక మలమలమాడి వ్రతాలు చేశారు. జాతర్లు చేశారు. కొలుపులు చేశారు. ఉహుఁ మా మొర దేముడాలకించలేదు. పొలాలకు నీరు లేదు . భూమి ఎండిపోయి బీటలు బారింది. చెట్లు మాడిపోయాయి. ఇహ ఏంచేస్తారు ప్రజలు? చాలామంది పొట్ట చేతిలో పట్టుకుని పొరుగూళ్ళకు వెళ్ళిపోయారు. ఈ గడ్డమీద మమత చావని నావంటివారు దీన్నే అంటిపెట్టుకుని ఉండిపోయారు. నా కొడుకు ప్రక్క వూరికి వెళ్ళి పనిపాటలు చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించి, దాంతో దినుసులు కొని ఏ రాత్రప్పుడో ఇంటికి వస్తున్నాడు. దాంతో కలో గంజో కాచుకుని త్రాగుతున్నాం. మిగతా ప్రజలుకూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు గ్రామం మూడొంతుల భాగం ఖాళీ అయిపోయింది. మిగతా వాళ్ళం ఇలా జీవచ్ఛవాలలా జీవిస్తున్నాం."

 

    వేదిత కష్టంమీద నిట్టూర్పు అణుచుకుని "గోవిందాచార్యులుగారు... ఆయన ఏమయినారు?అని ప్రశ్నించింది.

 

    "అయ్యో! అమ్మ ఏటివాత పడినప్పుడు ఆయన గ్రామాంతరం వెళ్ళారు. తర్వాత తిరిగి వచ్చి విషయం గ్రహించి పిచ్చివాడైపోయాడు. ఒక ఏడాదిపాటు 'అమ్మా, అమ్మా!' అని అరుస్తూ పిచ్చివాడిలాగా వూరంతా తిరిగి, చివికి చివికి చివరకు ఆయనా చనిపోయాడు."