"మనకన్నా అదృష్టహీనుల్నీ చూసి మనం బాధపడటం మరచిపోవాలి గోపయ్యా! నే వెడుతున్నాను.."

    "అమ్మగారూ!"

    మాలతి వినిపించుకోలేదు. గుమ్మందాకా వెళ్ళిపోయింది.

    "మాలతీ!"

    ఈ పిలుపుకి కాళ్ళు ఆగిపోయాయి.

    వెనుదిరిగి చూసేసరికి శేఖర్ సోఫాలో కూర్చునివున్నాడు. ఆ సమయంలో అతని ముఖంచూస్తే ఎంత శత్రువైనా కరిగిపోక తప్పదు.

    "నేను రాలేని స్థితిలో వున్నాను. ఇలా నా దగ్గరకు రావూ మాలతీ!"

    ఆమె నిగ్రహించుకుందామనుకుంది కానీ నిగ్రహించుకోలేకపోయింది. మరుక్షణంలో అతని ప్రక్కన వుంది.

    "నేనంతా విన్నాను మాలతీ! ఏం జరిగిందో గ్రహించాను మాలతీ! మనిషి కొన్ని బలహీనతలకు బానిస. స్వార్థం అనేది ఈ బలహీనతల్లో ఒకటి. దానికి నేను బానిసనైపోయాను. ఇన్నాళ్ళూ."

    ఆమె కళ్ళనుండి ఎడతెగకుండా అశ్రుధారలు. చేతిని అతని తలపైవుంచి ప్రేమగా నిమిరింది.

    "వద్దండీ! అలా మిమ్మల్ని మీరు కించపరచుకోకండి."

    పరిస్థితి గ్రహించి గోపయ్య నెమ్మదిగా బయటకు జారుకున్నాడు.

    "అందుకే అసూయతో, ద్వేషంతో ఇన్నాళ్ళూ దహించుకుపోయాను. శరవేగంగా, దూకుడుగా ప్రవహించే ఈ ప్రపంచ వాహినిలో ఏ సంఘటనా అసహజం కాదనీ, మన ప్రమేయం లేకుండానే కొన్ని సన్నివేశాలు మీదకు విరుచుకుపడుతుంటాయనీ, ఈ జగత్తులో మనంకాకుండా మిగిలివున్న మిగతాపరిధి అనంతమనీ, మనంకాని, మనంలేని అనుభవాలకు ఎంతో చోటు వున్నదనీ, ఎంత తప్పుకుందామన్నా అవి తప్పవనీ గ్రహించాను. "తప్పు"కు అంత భయంకరమైన అంటరానితనం అంటగట్టడం మహాపరాధమని, అవివేకమనీ గ్రహించాను. జీవిత పరిణామాలలో ఒకభాగమైన తప్పుకు శాశ్వతమైన ప్రమాణాలు పరమ మూర్ఖత్వమనీ గ్రహించాను మాలతీ!"

    మనకి కావలసింది మనిషి. ప్రేమించి, ఆత్మీయంగా దగ్గరకు చేరదీసుకునే మనిషి. ఆ మనిషి లభిస్తున్ననాడు, ఆ అదృష్టం వరిస్తున్నప్పుడు కాదని ధిక్కరించి, మధ్య మధ్య తొంగిచూసే చీకట్లను ప్రాధాన్యతనిచ్చి ఇద్దరి మధ్య నుంచీ వెలుగుని శాశ్వతంగా దూరంచేసుకునేవాడు మూఢుడు.

    మాలతి ఆశ్చర్యంగా వింటోంది. ఇతనేనా ఇలా మాట్లాడుతోంది? తన శేఖరమేనా ఇలా వ్యాఖ్యానిస్తోంది?

    "నువ్వు నన్ను అసహ్యించుకోకుండా ఇంకా గుర్తిస్తున్నవో లేదో, నీ ప్రేమను తిరిగి కోరే అర్హత నాకు వున్నదో లేదో తెలియదు కానీ నీ విలువ, నీలాంటి స్త్రీల విలువ అనంతమని గ్రహించాను. నీలాంటి వ్యక్తిలేని జీవితం నిస్సారమనీ, చీకటిమయమనీ అర్ధంచేసుకున్నాను మాలతీ! భవతీ భిక్షాందేహీ. నువ్వు నాకు కావాలి."

    "ఇంకా పూర్తికాలేదు. చివరి అధ్యాయం మిగిలివున్నట్లనిపిస్తోంది."

    భానుమతితో తను అన్నమాటలు ఆమె వీనుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

    ఆ గుండెలయలో, స్పందనలో, ఆ వేడిలో, ఆ చల్లదనంలో, ఇద్దరి మధ్యా అంత దగ్గరలో ఇద్దరిమధ్యా నడిచిన సుదీర్ఘమైన ఎడబాటునలిగి, అదృశ్యమైపోయినట్లయింది.

                                                            సమాప్తం

                        (45వ ఎపిసోడ్ నుంచి జ్ఞానసుందరి అనే కథ వస్తుంది.)