గుమ్మంవరకూ వచ్చాక రవి బెంగగా నవ్వి అన్నాడు "నాకు తెలుసు నువ్వెందుకు బాధపడుతోంది. కొంతసేపు గడిస్తే బావ లేచి నువ్వు లేకపోవటం గమనించి విచారంతో కృంగిపోతాడనేగా" అని నేరం చేసినవాడిలా "కానీ ఏం చెయ్యను చిన్నక్కా? ఇది చాలా అవసరమని నాకు తోస్తోంది" అన్నాడు విషణ్ణ వదనంతో.

    చిన్నక్క ఒక్కసారి ఆగి "నాయనా! నువ్వు ఎందుకు బాధపడతావు? నేను వస్తున్నాను కదా!" అని గబగబా నడవసాగింది.

    అసలు జరిగిన విషయం ఇది. ఆరోజు ఉదయం రవి అక్కడికి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఓ స్త్రీ వున్నదనీ, ఆమె చిన్నక్కను చూడగోరుతుందనీ ధైర్యంగా చెప్పి, ఆమె తనతో వచ్చేందుకు ఒప్పుకోవాలని బావను అడిగాడు. ఈ కోరికను ఖరాఖండిగా నిరాకరించే స్వార్ధం ఆయనలో లేకపోలేదు. కానీ కఠినత్వానికి ఈ సమయంలో తావులేదు. బదులు పలకకుండా, ఉలకకుండా అలానే చాలాసేపు పడుకుని వున్నాడు. రవి మరోసారి కదిపేసరికిఅయితే, ఆమె లేకపోతే నాకెట్లా?" అన్నాడు పుట్టెడు దుఃఖంతో. దానికి రవి నచ్చజెప్పాడు. ఇహ ఆయనకు సమ్మతించక తప్పలేదు. చివరకు తల ఊపి "...కానీ...." అని బరువుగా "నన్ను నిద్రపుచ్చి వెళ్ళమను. లేకపోతే నేను మెలకువతో వుంటే ఎట్లా?" అన్నాడు దిండులో తల దాచుకుంటూ.

    ఆ విషయంలో తుదీ మొదలూ తెలియలేదు. తన ప్రమేయంలేకుండానే ఆయన్ని వచ్చి తమ్ముడు అడిగేశాడు. బహుశా తనకు ముందుగా చెబితే తిరస్కరిస్తుందేమోనన్న అనుమానంతో అలా చేశాడని మళ్లీ ఊహించింది. ఆ స్త్రీ ఎవరని అసలు ఆయనేమీ అడగలేదు. కానీ చిన్నక్కమాత్రం తమ్ముడ్ని చాటుకు పిలిచి "ఆమె ఎవర్రా?" అని అడిగింది.

    వెనువెంటనే రవి తెగించి ఆమెవంక చూడలేకపోయాడు. కానీ తప్పని సరయి "ఆమె ఎవరో నేను చెప్పలేను. నువ్వే చూద్దువుగానిగా" అన్నాడు.

    కారులో ఇద్దరూ ఎక్కికూర్చున్నాక రవి ఆలోచింపసాగాడు. "ఈనాడు తను ధైర్యాన్ని ఎలా అవలంభించాడు? అదిసరే. ఆమె తననిగురించి ఏమనుకుంటుంది? తన అలనపాలనలో పెరిగిన రవి ఇప్పుడు అమాంతంగా పెద్దవాడై పోయాడే అని చింతిస్తుందేమో? ఆమాటే ఆమె బయటకు అంటే తల భూమిలోకి కృంగిపోవాల్సిందే.

    కొంతదూరం పోయాక శారద తమ్ముడికేసి చూసింది. ఏ కారుమబ్బులు కూడా అతడి ఉత్సాహాన్ని కప్పిపుచ్చలేవు. ఏదో అవ్యక్త ఆవేదనతో అలమటించిపోతున్నట్లు వుండే ఒకే ఒక తమ్ముడు ఇప్పుడు హాయిగానూ, అతి సుందరంగానూ అంతేకాక సహజంగానూ ఆకర్షిస్తున్నాడు. ఆమె మళ్ళీ చూపులు త్రిప్పుకుని నడుస్తున్న జనాన్ని చూడసాగింది.

    చాలా వీధులూ, సందులూ దాటిపోయాక ఓ ఇంటిముందు ఆగింది. కారు. రవి తలుపు తీసుకుని దిగి "చిన్నక్కా రా!" అన్నాడు. చిన్నక్క దిగి ఓసారి చుట్టూ పరికించి అతన్ని అనుసరించింది. మూసివున్న తలుపులను తట్టి "రాగిణీ!" అని పిలిచాడు రవి. ఎదురింటి కిటికీలోంచి ఓ నడివయసు స్త్రీ విడ్డూరంగా చూస్తోంది ఈ నూతనాగంతకురాలివంక. ఆకస్మికంగా పశ్చిమదిశనుంచి వీచిన ఈదురుగాలి చిన్నక్క కట్టుకున్న చీరెను రెపరెపలాడించటమే కాక, జుత్తు చిందరవందర చేస్తోంది. ఆమె కొంచెం ప్రక్కకు జరిగి గోడకు ఆనుకుని నిలబడింది.

    లోపలినుంచి సన్నగా రాగిణికంఠం బదులు పలికింది. కొంచెంసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. "మీరా?" అంటూ రవిని చూసి ఇంకా ఇంకా ఏదో అనబోయి, ప్రక్కనే చిరునవ్వు నవ్వుతూ నిలబడివున్న స్త్రీని చూసి నిర్ఘాంతపోయింది. కానీ ఉత్తర క్షణంలోనే సంభాళించుకుంటూ "చిన్నక్కగారా! రండి" అని ఆప్యాయంగా లోనికి ఆహ్వానించింది.

    రాగిణి చాప పరిచింది. కూర్చున్నారు. అప్పుడు అంది ఆమె విచార వదనంతో "చూడండి! ఈయనంత పెంకి మనిషిని నేనెక్కడా చూడలేదు. హఠాత్తుగా ఇలా ఏదో అవాంతరం తెచ్చిపెడుతూ వుంటారు. నిర్మొహమాటంగా చెబుతున్నాను, మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చేటంత ఆగత్యం ఏమివుంది? ఈ విషయం ముందుగా చెబితే ఈ దరిదాపుల్లో వుండకుండా పారిపోయేదాన్ని" అని కాస్త దూరంలో నగుమోముతో కూర్చున్న రవివంక కోపంగా చూసింది.

    శారద లాలనగా ఆమెచేతిని తన హస్తద్వయంలోకి లాక్కుని "ఏమమ్మా అంతకోపం? ఇందులో జరుగకూడనిది ఏముంది?" అంది మధురకంఠంతో.

    రాగిణి లోనుండి పెల్లుబికివస్తూన్న ఉద్వేగ ఉద్రిక్తాలను అతికష్టంమీద అణగద్రొక్కుకుంటూ "చిన్నక్కా! మీరూ అలానే అంటారా? నేను ఎవర్నని మీరిక్కడికి రావాలి చెప్పండి? ఈ సందర్భంలో తోటి స్త్రీకి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చెప్పగలరు. మీ ముందు సిగ్గులేక ఎలా కూర్చున్నానో తలచుకుంటే చెడ్డ అవమానంగా వుంది. పాడుజన్మ!" అంటూ కుమిలిపోతోంది మధ్యమధ్యలో రవివంక ఎర్రగా చూస్తూ.

    "అసలు నీముందు నన్నిలా దూషించే అధికారం ఎవరిచ్చారో కనుక్కో చిన్నక్కా?" అన్నాడు రవి కమ్మని కంఠంతో.

    "మిమ్మల్ని ఎవరు దూషించారు? నన్ను నేను దూషించుకుంటున్నాను. ఏమీ చేతకాక."

    శారద అర్ధం చేసుకుంది. ప్రేమమీరా ఆమె తలనిమిరి బుజ్జగిస్తూ "తమ్ముడు నీగురించి ఏమీ చెప్పలేదు. నేను ఎవరింటికి వస్తున్నానో అర్ధంకాలేదు. మీ ఇంటికి వచ్చేవరకూ వాడు నీగురించి ఎందుకు చెప్పలేకపోయాడో ఇప్పుడు నాకు బోధపడింది" అని పలికింది.

    "కాదండీ, నాగురించి మీకు తెలియదు."

    "పోనీ, ప్రమాదం లేదు" అని శారద నవ్వి ఊరుకుంది.

    సుదూరంలో కూర్చున్న రవి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నేలచూపులు చూస్తూ "చిన్నక్కా! ముందు నిన్ను క్షమాపణ అడగవల్సింది. రాగిణి కోపానికి కారణం కూడా నాకీపాటికి గ్రాహ్యమయే వుంటుంది.

    ఆమె ఓ అనాథ. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. నీముందూ, రాగిణి ముందూ నాకు సిగ్గు ఎందుకు చిన్నక్కా? దాపరికం అవసరంలేదు. కేవలం ఆ కారణంచేతనే ఈ వ్యక్తిని నీకు చూపించాలని ఇంత ఉత్సుకత చూపించాను." అన్నాడు

    "ఏ కారణంచేత?" అని రాగిణి రూక్షస్వరంతో అంది. మళ్ళీ డగ్గుత్తికతో "మీరు ఈయన మాటలేమీ నమ్మకండి. వాటిలో అర్ధంపర్ధం వుండదు. ఇటువంటి విపత్ పరిస్థితుల్లో నన్ను ఇరికించి, ఊరికే మాటలు విసురుతా రెందుకు? నేను అవమానంతో ఎంత కుమిలిపోతున్నానో మీకేం తెలుసు?

    శారద అనురాగం ఉప్పొంగగా ఆమెను దగ్గరకు తీసుకుని "నువ్వంత బాధపడతావెందుకమ్మా? కానిపని ఇప్పుడేం జరిగిందనీ ?"

    "అది కాదండీ చిన్నక్కా!" అంది రాగిణి పెదాలు వణుకుతుండగా. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి?"