ఖచ్చితంగా అపరిచితురాలు పూజ- మాళవిక ఫ్రెండ్స్ అయుండాలి. లేదంటే ఎంతో ఇంటిమేట్ మూమెంట్ కూడా ఎలా తెలిసిపోతుంది?

 

    శ్రీధర్ లో అది తేల్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది.

 

    అంతే...మరో రెండు నిముషాలకి ఫ్లాట్ కి తాళం వేసి నిర్మల ఫ్లాట్ కేసి దూసుకుపోయాడు.

 

    పైనుంచి బైనాక్యులర్ ద్వారా అంతా చూస్తున్న పూజ వెంటనే నిర్మల ఫ్లాట్ కి బయలుదేరింది. మాళవికగా అక్కడ కనిపించటానికి.

 

    "ఏమిటి సడన్ గా ఇలా వచ్చావ్?" నవ్వుతూ అడిగింది నిర్మల.

 

    "నేనిక్కడికి అంటే నీ ఫ్లాట్ కి వచ్చి అరగంటయింది" అంది పూజ.

 

    "అది ఎలా...? ఇప్పుడే గదా నువ్వొచ్చింది?" నిర్మల ఆశ్చర్యపోతూ అంది.

 

    "పదే పదే ఇలా అడగొద్దు. నిజాల్ని దాచిపెట్టి, నే చెప్పినట్టు చెప్పటానికి ఎంత తీసుకుంటావ్?" అంది పూజ నవ్వుతూ.

 

    "నా కసలేం అర్థమయి చావటంలేదు. ఇలా ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దానికి నువ్వు నాకు డబ్బివ్వటమేంటి? నేను తీసుకోవటమేంటి?" తిరిగి విస్మయంగా అడిగింది నిర్మల.

 

    "ఎందుకు చెప్పాలంటే దానికో పెద్ద గతం వుంది. ఎవరికి చెప్పాలంటే రాబోయే అతనికి. అతనెళ్ళాక చెబుతాను. అతనొస్తున్నాడిప్పుడు. అతనికి చెప్పాలి."

 

    "అతనెవరు?"

 

    "శ్రీధర్."

 

    "అతనికి నీకేమిటి మధ్య? కొంపతీసి అతన్నిగాని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించటమే నిజమైతే ఏ ప్రేమయినా అబద్ధంతో ఆరంభం కాకూడదేమో, అయినా అతను ఈ టైమ్ లో ఇక్కడికెందుకొస్తాడు? అది నీకెలా తెలుసు?" సాలోచనగా అంది నిర్మల.

 

    పూజ ఏదో మాట్లాడబోయేలోపే కాలింగ్ బెల్ మ్రోగింది శ్రావ్యంగా.

 

    పూజ మాట్లాడే ప్రయత్నాన్ని విరమించుకొని, వెళ్ళి తలుపు తీయమని సైగ చేసింది.

 

    నిర్మల అయోమయానికి లోనవుతూ, వెళ్ళి తలుపు తీసింది. పూజ చెప్పినట్టుగా ఎదురుగా శ్రీధర్ వున్నాడు.

 

    నిజమైనా, అది నిజంగా అనిపించటంలేదు నిర్మలకి.

 

    అగాథ క్రిస్టీ నవలని సెల్యులాయిడ్ మీద చూస్తున్నట్టుగా వుంది.

 

    శ్రీధర్ ని లోపలకు రమ్మని సంజ్ఞచేసి, వెనక్కి వచ్చింది నిర్మల.

 

    మాళవికని విష్ చేసి సోఫాలో కూర్చున్నాడు శ్రీధర్.

 

    అతనికి ఎదురుగా మాళవిక కూర్చునుంది. అదంతా షేక్ స్పియర్ నాటకాన్ని స్టేజీ మీద చూస్తున్నట్టుగా వుంది నిర్మలకి.

 

    "మీరు మాట్లాడుకుంటూ వుండండి. నేను కాఫీ తెస్తాను" అంది నిర్మల వంటగదికేసి నడుస్తూ.

 

    "శ్రీధర్ గారికి ఫిల్టర్ కాఫీ ఇష్టం. ఇన్ స్టంట్ కలపకు" అంది మాళవిక.

 

    అతను బిత్తరపోయాడు. తన అభిరుచి ఆమెకెలా తెలుసని.

 

    అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది నిర్మల. అతని టేస్ట్ ఈమెకెలా తెలిసిందని.

 

    అయినా మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది నిర్మల.

 

    అప్పటి వరకు శ్రీధర్ మనసులో ప్రోదిచేసుకున్న అనుమానం మరికొంత బలపడింది.

 

    ఖచ్చితంగా ఈమె అపరిచితురాలికి ఫ్రెండ్ అనే విషయంలో అనుమానమే లేదు.

 

    "చెప్పండి...ఏమిటి విశేషాలు? ముఖ్యంగా మీ అపరిచితురాలి విశేషాలేంటి?" నవ్వును అతికష్టంమ్మీద ఆపుకుంటూ అడిగింది మాళవిక ఉరఫ్ పూజ.

 

    కొద్ది క్షణాలేం మాట్లాడలేదు శ్రీధర్. చిన్నగా సోఫాలోంచి లేచి విండో దగ్గరకెళ్ళి తన ఫ్లాట్ కేసి చూడసాగాడు శ్రీధర్.

 

    శ్రీధర్ ని చూసిన మాళవిక ఇక నవ్వును దాచుకోలేకపోయింది. చిన్నగా నవ్వింది అతికష్టంమీద.

 

    "ఏమిటలా చూస్తున్నారు? అది మీ అపరిచితురాలి పనేమో" ఆమె మాటలు వింటూనే టక్కున వెనుదిరిగాడు శ్రీధర్.

 

    "నిజం చెప్పండి. నా అపరిచితురాలు, పూజ మీకు ఫ్రెండ్ అవునా?" సీరియస్ గా అడిగాడు శ్రీధర్.

 

    "అపరిచితురాలు. పూజ...బహుశా ఆమె పేరు పూజ అయుండవచ్చు. నిజమే చెబుతున్నాను. ఆమె ఎవరో నాకు తెలీదు" అంది మాళవిక పళ్ళబిగువున నవ్వునాపుకుంటూ.

 

    "మరి...మరి...మనిద్దరం మాట్లాడుకుంటున్న మాటలు మన మూమెంట్స్ ఆమెకెలా తెలుస్తున్నాయ్? నేనిక్కడినుంచి నా ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ కేసి చూస్తుంటే అది మీ అపరిచితురాలి పనేమో అని ఎలా అన్నారు?

 

    అపరిచితురాలు ఈ బ్లాక్ లోనే వుంటూ నా ఫ్లాట్ కేసి చూస్తుంటుందని మీకెలా తెలుసు?"

 

    లోపలకు అనుకోబోయి బయటకు అనేశాడు శ్రీధర్.

 

    అనవసరమైన అతి ఉత్సాహంతో, అతనిలో అనుమానం కలిగించానేమో అనే ఆలోచనతో కొద్ది క్షణాలు చింతించింది మాళవిక ఉరఫ్ పూజ.

 

    అయినా క్షణాల్లోనే తిరిగి తనను తాను సమాయత్తపరుచుకుంది.

 

    "మీ ఫ్రెండ్ యోగి అంటుంటే తెలిసింది" ఏదో ఆ సమయానికి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అంది.

 

    "నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు నాతోపాటు యోగి రాలేదు. యోగికి మీరు, నేను గేటు దగ్గర కలుసుకున్నట్టు తెలీదు. మాట్లాడుకున్న మాటలు అస్సలు తెలీవు. ఈ కొద్ది సమయంలో ఇవన్నీ అతనికి తెలిసే అవకాశం లేదు. కనుక నిజం చెప్పండి. మనమధ్య సంభాషణ ఆమెకెలా తెలిసింది?" తిరిగి నిలదీశాడు శ్రీధర్.

 

    ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? మాళవిక ఆలోచిస్తున్నంతలో నిర్మల కాఫీ కప్పుతో వచ్చింది.

 

    తాత్కాలికంగానైనా ప్రమాదం తప్పినందుకు ఊపిరి తీసుకుంది మాళవిక.

 

    శ్రీధర్ కయితే చాలా పట్టుదలగా వుంది. మాళవికను నిలదీసి అసలు నిజం రాబట్టాలని.

 

    ఆ నిజాల మూలంగా పూజ ఆచూకీ తెలుసుకోవడం తేలికని అతని ఆలోచన.