కళ్ళు పెద్దగా కనపడాలంటే....

 

అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్ లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించచ్చు. మరి అవేంటో చూసేద్దామా.


మనం రోజూ పెట్టుకునే కాటుకతో పాటు మరికొన్ని మేకప్ ఐటమ్స్  జతచేసుకోవటం ఎంతైనా అవసరం. ఐ లైనర్ కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది  వేసుకోవటం మొదట్లో కాస్త రాకపోయినా అలవాటయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటిగా ఒకేసారి కనురెప్పలపై  పెద్దగా ఐ లైనర్ దిద్దుకుని వెళితే మీ స్నేహితులు మిమ్మల్ని ఏడిపించే వీలుంది. కాబట్టి మొదట్లో  రెప్పలపై సన్నగా వేసుకోవటం మంచిది. అలా అలా ఆ లైన్ ని పెంచుతూ వెళ్ళండి.

 

మస్కారా కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనురెప్పలని పైకి ఒత్తుతూ వేసుకునే మస్కారా వల్ల  కళ్ళు విశాలంగా కనపడతాయి. కొంతమందికి కనుబొమలు, కనురెప్పలు కూడా పల్చగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కళ్ళు మరీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే కొన్ని రోజుల్లోనే అవి వత్తుగా మారతాయి. కొంతమంది ఆముదాన్ని కూడా వాడతారు.

 

కళ్ళకి ఐ లైనర్ పెట్టుకునేటప్పుడు కంటి చివర వరకు  దానిని అప్లై చేస్తూ కాస్త బయటకి కూడా తీసుకెళ్ళి కోన్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే కళ్ళకన్నా కాస్త బయటకి తీసుకెళ్లటం అన్నమాట. రెగ్యులర్ గా ఐబ్రోస్ షేప్ చేయించుకుంటూ ఉండాలి కూడా. ఐబ్రోస్ ఎప్పుడయితే మరీ వత్తుగా ఉంటాయో అప్పుడు అవి కళ్ళని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా చూసుకుంటే చాలు.

 

మనం ఎంత మేకప్ వేసుకున్నా కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కళ్ళ అందాన్నిదెబ్బతీసి అవి హైలైట్ అవ్వకుండా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ పోవటానికి ఒక మంచి చిట్కా ఉంది. రెండు స్టీల్ చెంచాలని రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఉదయం లేవగానే వాటిని కళ్ళపై బోర్లించి మూడు నిముషాలు అలానే ఉంచండి. దీనివల్ల కళ్ళ చుట్టూ ఉండే నలుపు పోవటమే కాదు ఆ రోజంతా కళ్ళు కాస్త పెద్దగా కనిపించటం కూడా మీరే గమనించచ్చు.


అలాగే కనురెప్పలు  వెనక్కి వంపు తిరిగి ఉండాలంటే రెండు చెంచాలని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి వాటిని తీసి కనురెప్పలను వంచుతూ వెనక్కి నొక్కి పెట్టి ఆ చెంచాను అలానే ఉంచాలి. రెండు మూడు నిమిషాల తరువాత తీసి చూస్తే రెప్పలు వంపు తిరిగి కనిపిస్తాయి. అవి ఆ రోజంతా అలానే ఉంటాయి కూడా.


ఇప్పుడు మార్కెట్ లో ఫాల్స్ ఐ లాషేస్ కూడా దొరుకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవటం వస్తే చాలు, వాటివల్ల కూడా కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మొత్తానికి చిన్నగా కనిపించే కళ్ళు మరింత అందంగా, ఆరోగ్యంగా కనపడాలంటే రోజూ తగినన్ని నీళ్ళు తాగటం మర్చిపోకూడదు. అలాగే కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి వాటి కోసం వాడే ఐ లైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్, కాజల్ ఇలాంటివన్నీ మంచి కంపెనీవి ఎంచుకుని కొనుక్కోవాలి. ఎంతైనా కళ్ళే కదా మనకి అందాన్ని రెట్టింపు చేసేవి.

- కళ్యాణి