"అనకూడదుగానీ అసలే నా బ్రతుకు నికృష్టభూయిష్టము. ఆమె లేకపోతే నేను ఎలా రోజులు వెళ్ళబుచ్చేవాడినో అని వేదన కలుగుతోంది. దీనికి సంబంధించినవే నాకొచ్చిన పీడకలలు కూడాను."

    "తప్పు, ఊరుకోండి. అలా మాట్లాడకూడదు."

    "ఊ!" అని సంతోషించి "ఎంత చక్కగా మాట్లాడావు రాగిణీ! నీ మాటలు, చేతలూ అందంగావుండి గుండెను తొలుచుకుపోయి అక్కడ జాగాచేసుకుని స్థిరనివాసం చేస్తాయి" అన్నాడు.

    ఆమె ఏమీ మాట్లాడక ఊరుకుండేసరికి "నిన్ను గంభీరంగా కొన్నాళ్ళూ, విచిత్రవ్యక్తిగా కొన్నాళ్ళూ ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిశాక, ఈ నిజాన్ని భరించడం నాచేతకావటంలేదు" అని మసక వెలుతురులో ఆమెవంక తేరిపార చూశాడు.     

    "మాట్లాడకుండా పడుకోండి. నాకు నిద్రవస్తోంది."

    "నిద్రపోతావేం? నిన్ను ఆ పనిచెయ్యకుండా చేయాలనే మెలకువలోకి తీసుకువచ్చాను. కానీ రాగిణీ! నాకు తెలివచ్చిందిగా, ఇలా ఎన్నాళ్ళో జరుగదు."

    "ఎలా?"

    "ఇలా!"

    "ఎలా?" ఆమె ఆశ్చర్యంతో మళ్ళీ ప్రశ్నించింది.

    "ఇ....లా....."

    రాగిణి ఎంతవరకూ అర్ధంచేసుకోగలిగిందో గానీ ఒకటి రెండు నిముషాలు మిన్నకుండి "మీరు పెళ్ళి చేసుకోకూడదూ?" అనడిగింది హఠాత్తుగా.

    అతను విద్యుద్ఘాతం తగిలినట్లు వణికి "నువ్వూ అదే ప్రశ్న వేశావా?" అన్నాడు చకితుడై.

    "అంటే, నేను వేయకూడని ప్రశ్నా అది?"

    "అలా ఎందుకనుకున్నావు? కొద్దిరోజుల వ్యవధిలో నాముందు ఇదే ప్రసక్తి ఇద్దరు ఎత్తారు. నువ్వూ అనేసరికి అలావచ్చింది నా నోటినుంచి.."

    "ఆ ప్రశ్న వేస్తున్నాను. జవాబు చెప్పండి?"

    "ఎవర్ని చేసుకోమంటావు?" అని అతను మంచంమీద కొంచెం జరిగి ఉల్లాసంగా అన్నాడు.

    "నాకేం తెలుసు? మీ చిన్నక్కగార్ని అడగండి."

    అతను దిగ్భ్రాంతితో "అరె, నువ్వూ అదే అన్నావ్?" అన్నాడు.

    "ఏమిటిది? చీటికీమాటికీ..." అందామె ఎంతో బెదిరిపోయి.

    "అంటే?" అని రవి సమర్ధించుకోవటానికి యాతన పడుతున్నాడు. కానీ నిజం చెప్పేశాడు. "నేనూ సరిగ్గా అదే అనుకున్నాను."

    తరువాత జరిగిన సంభాషణలో ఆ విషయమై చర్చ మళ్ళీ రాలేదు.

                                             7

    రవి మద్రాసునుంచి వచ్చేశాక పదిహేనురోజులకు శారద దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. అర్జంటుగా బయలుదేరి రమ్మనమని.

    రవి బయలుదేరాడు. రైల్లో కూర్చునివున్నంతసేపూ అతనితల ఆలోచనలతో దిమ్ముగా వుంది. ఈ పిలుపులో ఏదైనా అంతరార్థం వున్నదా అని అతనిచిత్తం భ్రమపడసాగింది. వాస్తవానికి ఈ పదిహేనురోజులూ పదిహేనుయుగాల్లా గడిచాయి. ఇక్కడికి వచ్చేముందు చంద్రాన్ని కలుసుకున్నాడు. ఆనాడు చంద్రం చెప్పిన విషయాలు అంతరంగంలో మెదుల్తూ తనని కదిలిస్తూనే వున్నాయి. అక్కడ చదివిన ఈ రెండు సంవత్సరాలూ ఆప్తమిత్రుడు అతడే. చాలామందిలో లేని గుణాలు అతన్లో వున్నాయి. అవి తనకు నచ్చాయి. అతడే తన స్నేహితుడు కాకపోయివుంటే కొంతకాకపోతే కొంతయినా జరిగిన సుఖకరమైన కాలక్షేపం గగనకుసుమమై వుండేది రవికి. తనకూ చంద్రానికీ ఎంతో వ్యత్యాసం కనిపించింది. తను అతడిముందు రహస్యాలు దాచడు కానీ తనముందు అతను ముఖ్యమైన రహస్యాలేవీ దాచలేదు. శశి తనను తిరస్కరించిందని బాహాటంగా వెల్లడించుకున్నాడు. ఒకసారి శశిమీద కోపం కలిగింది. తనకు చంద్రంమీద కలిగిన జాలి శశికి చంద్రంమీద కలగలేదా? ఒక్కోసారి స్త్రీ హృదయం నవనీతమూ , మరోసారి అదే పాషానమూ. చంద్రాన్ని గట్టిగా కావలించుకోవాలనుకున్నాడు. కానీ తను అసమర్ధుడు. ఏమీ చేయలేడు.

    ఈ పదిహేనురోజులూ పాతస్నేహితులు తిరిగివచ్చి తనను కులాసాలోకి దించటానికి ప్రయత్నించారు. కానీ ఈసారి మనసు మళ్లలేదు. వాళ్ళు గర్వం అనుకున్నారు. చాటుగా చాడీలు చెప్పుకోసాగారు.

    ఇదంతా గుర్తుకువచ్చి రవి విచారంతో నవ్వుకున్నాడు. చిన్నక్కగారింటికి వెళ్ళేసరికి సంధ్య గాలులు హాయిగా వీస్తున్నాయి.

    చిన్నక్క బావనోట్లో మందు పోస్తోంది. సరిగ్గా రవి లోపలిగదిలోకి అడుగు పెట్టేసరికి ఇదీ దృశ్యం. ఎంత చిక్కిపోయాడు బావ! మందుతాగి ఆయాసంగా పడుకుని దీనంగా చూస్తున్నాడు. రవినిచూసి చిన్నక్క ముఖం వెలిగింది. కూర్చోమని సంజ్ఞచేసింది.

    "చిన్నక్కా!" అన్నాడు రవి. ఇవతలకు వచ్చాక స్వరం చిన్నదిచేసి "ఏం జరిగింది?" అని ఆమె వదనంలోకి తదేకంగా చూశాడు.

    చిన్నక్క చిక్కిపోయింది. కళ్ళూ, చెంపలూ నెత్తురులేక తెల్లగా వున్నాయి. పెదాలు బాగా నల్లబడిపోయాయి. ఆఖరికి తైలసంస్కారంలేని కురుల్ని చూసేసరికి రవి ఉద్వేగంతో మూలిగాడు. అంతేకాక చెక్కిళ్ళ లోతుల్లో చిక్క కట్టుకుపోయిన కన్నీటి చారలు.

    అతనిలో ఎక్కడో పొటమరించిన సందేహం బిగువుతో పెరిగి మింటికి ఎగసింది.

    "చిన్నక్కా!" అన్నాడు మళ్ళీ. "ఏం జరిగిందో చెప్పవూ?"

    తన నల్లబడిన పెదాలపై తెల్లని హాసం ఉదయింపచేసుకోవటానికి వ్యర్ధ ప్రయత్నం చేసి విరమించింది. "పద చెబుతాను."

    వేగంగా కొట్టుకుంటున్న గుండెతో సాంతంవిని రవి భుజాలెగురవేశాడు.

    "బావకి చాలా ప్రమాదం వచ్చింది. పదిరోజుల్లో ఆపరేషన్ జరిపించకపోతే ప్రాణాపాయం. ఆ సంగతిఅయినా రెండురోజుల క్రితమే తెలిసింది."

    గోవిందరావుకు క్షణం నిద్రపట్టదు. ఎప్పుడూ అటూఇటూ దొర్లుతూనే వుంటాడు. ఆ రాత్రి నిద్రపట్టని రవి, చిన్నక్క నిద్రపోకుండా బావమంచం ప్రక్కనే శోత్యోపచారాలు చేయటం కనిపెట్టాడు.

    "చిన్నక్కా! నీకు పరీక్షాసమయం వచ్చిందా ఏం?" అనుకున్నాడు.

    రెండురోజులయాక అంతా మద్రాసు వచ్చారు. ఆ రోజే రవి బావను తీసుకువెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. చిన్నక్క అహర్నిశలూ అక్కడే గడుపుతోంది. తాను హోటల్లో గది తీసుకున్నాడు. వీలయినంతవరకూ చిన్నక్కతోపాటే గడిపాడు.

    ఆపరేషన్ జరిగేరోజున చిన్నక్క అంది "నాకేదో భయంగా వుందిరా!"

    "భయం ఎందుకు చిన్నక్కా? బావకేం ఫర్వాలేదు."

    "కానీ డాక్టర్లు..." చిన్నక్క కంఠం గడగడ వణికింది "ఏమేమో చెప్పార్రా"