సెక్రటరీ చేసేది లేక నిరుత్సాహంగా వచ్చి కారెక్కాడు. అది మరుక్షణం కళ్యాణమండపం కేసి సాగిపోయింది.

 

    సరిగ్గా అప్పుడు మధుమతి లోపలనుంచి మధ్య హాల్లోకి వచ్చి "వెళ్ళిపోయాడా?" అని అడిగింది.

 

    పూజారి భార్య వెళ్ళిపోయాడన్నట్లు తలూపింది.

 

    "ఇప్పుడు వారిని వచ్చేయమనండి" అంది మధుమతి సిద్ధాంతి భార్యనుద్దేశించి.

 

    ఆమె వెళ్ళి బెడ్ రూమ్ తలుపుమీద చప్పుడు చేసింది.

 

    కొద్దిక్షణాలకి ఆగది తలుపులు తెరుచుకున్నాయి.

 

    పూజారి లోపల నుంచి మధ్య హాల్లోకి వస్తూ వెళ్ళిపోయారా అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు.

 

    "వెళ్ళిపోయారు మరికొన్నాళ్ళపాటు మీరు హాయిగా మీ గదిలోనే కూచుని ఈ రాత్రికి మేము మీకు బహుమతులుగా పంపే టి.వి., వి.సి.ఆర్.లో సినిమాలు చూసుకోండి. జాగ్రత్త- అసలు బయటకు రాకూడదు" అంది మధుమతి బ్రీఫ్ కేస్ ని సిద్ధాంతి భార్యకు అందిస్తూ.

 

    దాన్నిండా డబ్బుందని ఆ దంపతులకు తెలుసు. అందుకే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.

 

    "మరి నేనెప్పుడు నాగమ్మగార్ని కలవాల్సి ఉంటుంది...?" పూజారి అడిగాడు చిన్నగా.

 

    "సరిగ్గా ఈ రాత్రి పదకొండున్నర గంటలకు మీ ఇంటి దగ్గరకో ఆటో వస్తుంది. దాని నెంబర్ ఎ.ఇ.వై. 1217. దానిలో ఎక్కండి. అది మిమ్మల్ని సరాసరి నాగమ్మగారి దగ్గరకు తీసుకువెళుతుంది. ఇదంతా ఎందుకంటే... పీటర్, అర్జున్ రావు, కనకారావు, సెక్రటరీలు గుంటనక్కలు. అనుమానం వచ్చి మీ ఇంటి ప్రక్కవాళ్ళను ఆరా తీయవచ్చు. నాగమ్మగారి వద్దకు వెళ్ళాక ఏం చేయాలో, ఏం చెప్పాలో తెలుసుకదా?"

 

    తెలుసన్నట్లు తలూపాడు సిద్ధాంతి.

 

    ఆ మరుక్షణం మధుమతి వేగంగా బయటకు వెళ్ళిపోయింది.


                                *    *    *    *


    సెక్రటరీకి భయంతో నవనాడులు స్థంభించిపోయాయి. భయపడుతూనే చిన్నగా అర్జున్ రావు దగ్గరకు వెళ్ళాడు.

 

    "హమ్మయ్య... పూజారిని తీసుకొచ్చావన్న మాట" అన్నాడు భారాన్ని దింపుకుంటున్న వాడిలా రిలాక్స్ అవుతూ.

 

    "లేదు సార్... వాళ్ళ నాన్నకు గుండెపోటని టెలిగ్రామ్ వస్తే, హడావిడిగా ఊరెళ్ళాడు..." నసుగుతూ చెప్పాడు.

 

    అర్జున్ రావు వినకూడని వార్త విన్నట్లు మొఖాన్ని చిట్లించాడు.

 

    "ఇంత హఠాత్తుగానా...? అందునా ఇప్పుడా...?" అనడిగే ప్రశ్నలు అర్థవంతమేనా అని యోచించే స్థితిలో లేడు అర్జున్ రావు.

 

    "గుండెనొప్పి తాపీగా రావడానికి అదేమన్నా రుతుపవనమా? అయినా మేం తప్ప వేరే సిద్ధాంతి మీకు దొరకడా? అని అతని భార్య దులిపి పడేసింది సార్" సెక్రటరీ నెమ్మదిగా అన్నాడు.

 

    అర్జున్ రావుకి తన పథకం పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందనిపించి చిరాకు పడిపోయాడు.

 

    పీటర్ అర్జున్ రావు దగ్గరకు వచ్చి విషయం తెల్సుకున్నాడు.

 

    "మరికొన్నాళ్ళు వాడు చెప్పినట్టు వినాలి తప్పదు" అన్నాడు పీటర్ అసహనంగా.

 

    "ఇప్పుడిక చేయగలిగిందేం లేదు" అంటూ అర్జున్ రావు నాగమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు.

 

    ఆమె కళ్ళలో ఓ క్షణం నిరాశాభావం కదలాడి అదృశ్యమైంది.

 

    "సిద్ధాంతి వచ్చాకే చూద్దాం" అంటూ హడావిడిగా మరోవేపుకి వెళ్ళిపోయింది నాగమ్మ.

 

    సరీగ్గా అదే సమయంలో సామంత్ పెద్దగా నవ్వాడు.

 

    ముగ్గురూ ఉలిక్కిపడి సామంత్ కేసి చూసి పళ్ళు పటపటా కొరుక్కున్నారు.

 

    నాయకి చాలా హుషారుగా, ఆనందంగా వుంది. అటూ ఇటూ తిరుగుతూ, ఎగ్జయిట్ అవుతూ సామంత్ ని తనకు తెలిసిన వారికి పరిచయం చేస్తోంది.

 

    పెళ్ళికొచ్చిన అతిధులు వయస్సుతో సంబంధం లేకుండా ఆ జంటకేసే చూస్తూ మెచ్చుకుంటున్నారు.

 

    సామంత్ చూపులు, కదలికలు, విష్ చేసే విధానం, పలకరింపు కోసం మౌనంగా చిరునవ్వును చిందించటం, చేయిచాపి షేక్ హేండ్ ఇచ్చే స్టయిల్... అన్నీ సోబర్ గా, సంస్కారయుతంగా వున్నాయి.

 

    అర్జున్ రావు త్రయం విస్మయంగా సామంత్ కేసే చూస్తూండగా నాయకి సామంత్ కి దగ్గరగా వస్తూ "షి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్..." అంటూ తన వైటల్ స్టాటిస్టిక్స్ తో చూపరుల కళ్ళను చెదరగొడుతున్న ఓ యువతిని సామంత్ కి పరిచయం చేసింది.

 

    "సారామె వినూత్నా మల్హోత్రా... టాప్ హీరోయిన్" ఉద్వేగంగా అన్నాడు సెక్రటరీ మిగతా ఇద్దరికీ వినిపించేలా.

 

    "మోస్ట్ పొటెన్షియల్ సినీ స్టార్... నాతోపాటు ఇంటర్ వరకు చదివి సినీరంగానికి వెళ్ళిపోయింది.

 

    నౌ షీ ఈజె హైలీ పెయిడ్ హీరోయిన్" అంది నాయకి ఆమె గురించిన వివరాలను అందిస్తూ.

 

    సామంత్ ఆమెకేసి చూసి మందహాసం చేస్తూ.

 

    "విచ్ హీరోయిన్ యూ లైక్ ఇన్ హాలివుడ్?" అన్నాడు.

 

    అర్జునరావు ఉలిక్కిపడ్డాడు. అవసరమయిన ప్రశ్నలు రైజ్ చేస్తున్నాడు... దొరికిపోతానని భయం కూడా లేదేం? అనుకున్నాడు కోపంగా.

 

    "బ్రిజిత్ బార్డో... యూ టూ లైక్?" మల్ హోత్రా సామంత్ కేసి ఆర్తిగా చూస్తూ అంది.

 

    "నో...నో... ఐ లైక్ జేన్ ఫోండా... షీ ఈజ్ మై అబ్సెషన్... నాట్ ఇన్ అదర్ మేటర్స్..." చాలా స్టయిల్ గా భుజాల్ని ష్రగ్ చేస్తూ అన్నాడు.

 

    కనకారావుకి మతిబోతోంది సామంత్ ని చూస్తూంటే.

 

    ఇవన్నీ తను నేర్పించినవి కావు- మరి? మరెలా అంత ధైర్యంగా హైక్లాస్ సొసైటీ లేడీస్ తో మూవ్ అవుతున్నాడో?

 

    మల్ హోత్రా గలగల నవ్వింది.

 

    నాయకి కేసి చూస్తూ చిలిపిగా కన్నుగీటింది. అందులో జాగ్రత్త అన్న భావాన్ని వ్యక్తం చేసింది.

 

    నాయకి ముసిముసిగా నవ్వుకుంది. ఏమీతోచనట్టు చూపులు వేలితో నాసికాగ్రాన్ని రుద్దుకుంది.