అప్పలరాజు సప్లయింగ్ వరల్డ్....

 

    గేటు దగ్గరున్న పెద్ద బోర్డ్ ను చూసి, లోనకు నడిచాడు ఆంజనేయులు.

 

    మెట్లెక్కగానే విశాలమైన హాలు... ఆ హాల్లో అప్పటికే గుట్టలు, గుట్టలుగా జనం ఉన్నారు.

 

    "ఇంటర్వ్యూ ప్రారంభమైందాండీ..." పక్కన నిలబడిన ఓ అమ్మాయిని అడిగాడు.

 

    "పది గంటలకు ప్రారంభిస్తామన్నారు... పదకొండున్నరైంది... ఇంతవరకూ స్టార్ట్ చెయ్యలేదు... గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎలాగూ పంక్చువాలిటీ లేదు. ప్రైవేటు ఆఫీసుల్లో కూడా ఇలాగైతే ఎలా..." విసుక్కుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆంజనేయులికి.

 

    పన్నెండున్నరయింది....

 

    ఒంటి గంటయింది....

 

    ఇంటర్వ్యూ కోసం వచ్చిన అభ్యర్థుల్లో సగానికి సగం నీరసపడి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గబగబా లోన్నించి ఓ వ్యక్తి వచ్చి-

 

    "ఉన్నవాళ్ళు మీరేనా భేష్... మీరంతా నా వెనకే రండి..." అని పాతిక మంది అభ్యర్ధుల్నీ తీసికెళ్ళి ఓ గదిలో పెట్టేసి-

 

    "ఇప్పుడు లోన్నించి మీకు మాత్రమే పిలుపొస్తుంది... ఒక్కొక్కరూ వెళ్ళండి..." అని చెప్పాడు.

 

    "మరి మిగతావాళ్ళకో..." అనుమానంగా అడిగాడు ఆంజనేయులు.

 

    "ఇది కూడా ఇంటర్వ్యూలో ఓ పార్టే... మీ 'ఓర్పు'ని ఇంతవరకూ మేనేజ్ మెంట్ టెస్ట్ చేసిందన్న మాట... అర్థమైందా... ఈ టెస్ట్ లో మీరు మాత్రమే సక్సెస్ అయ్యారు... మిగతా వాళ్ళు ఫెయిల్..." కిళ్ళీ నవుల్తూ వెళ్ళిపోయాడా వ్యక్తి.

 

    అయిదు నిమిషాల తర్వాత ఇంటర్వ్యూ ప్రారంభమయింది. ఒక్కొక్కరూ లోనకెళ్ళి వస్తున్నారు.

 

    అప్పటికి పదిమంది వెళ్ళొచ్చేశారు.

 

    "ఇదెక్కడి ఇంటర్వ్యూ అంది బాబూ..." ఓ కుర్రాడు నిరాశగా కూలబడుతూ అన్నాడు.

 

    "ఏం... ఏమైందండీ..." అడిగాడు ఆంజనేయులు.

 

    "బిర్లా మందిర్ కి మెట్లెన్ని? ఆర్ట్స్ కాలేజీలో ఎన్ని గదులున్నాయి. ఎన్ని స్థంబాలున్నాయ్... ఆర్ట్స్ కాలేజీని ఎవడు కట్టించాడు. ఏ సంవత్సరంలో... కులీఖుతుబ్ షా సమాధుల ఏరియాలో మొత్తం ఎన్ని సమాధులున్నాయి... ఎవరెవరివి... ఇవ్వా... ప్రశ్నలు?" పిచ్చిగా అయిపోతూ అన్నాడా కుర్రాడు.

 

    ఆ మాట వినగానే ఆంజనేయులికి వళ్ళంతా పులకించిపోయింది... ముఖం విప్పారిపోయింది.

 

    "ఆంజనేయులూ.... ఆంజనేయులూ..." అని తన పేరు వినబడడంతో, అక్కడున్న అందరివేపూ ఠీవిగా చూసి-

 

    గాడ్ దుర్యోధనుడ్ని ఒకసారి మనసారా తలచుకుని లోనికి అడుగుపెట్టాడు.

 

    లోన గదిలోకెళ్ళిన ఆంజనేయులికి బాస్ ఎవరూ కన్పించలేదు. కంగారుపడ్డాడు.

 

    కిళ్ళీ నవుల్తూ ఒక్కొక్కర్నీ లోనికి పంపిస్తున్న వ్యక్తి-

 

    "కూర్చోండి... సార్... టాయిలెట్ కెళ్ళారు..." అని చెప్పి వెళ్ళిపోయాడు.

 

    ఏదో దగ్గు వినబడితే తలెత్తి చూశాడు ఆంజనేయులు.

 

    ఎదురుగా సీట్లో వున్న ఆ వ్యక్తిని చూడగానే షాక్ తిన్నాడు. ఆ బాస్ పరిస్థితి కూడా అలాగే అయింది.

 

    ఇద్దరూ గోడకు కొట్టిన పిడకల్లా మొహాలు పెట్టుకుని కూర్చున్నారు.

 

    ఆ బాసు....

 

    అన్నీ ప్రాక్టికల్ గా తను చూసి, ఇంటర్వ్యూ కండక్ట్ చెయ్యాలని నిశ్చయించుకొని గత వారం రోజులూ....

 

    ఆంజనేయులు వెళ్ళిన ప్రతిచోటా ఎదురుపడ్డ 'బిర్లామందిర్ సూటు వ్యక్తే!'

 

    ఆ బాస్ పేరు అప్పలరాజు.

 

    "ఎస్.... మిస్టర్ ఆంజనేయులూ... ఏ వూరు మనది?" తెప్పరిల్లి అడిగాడు అప్పలరాజు 'సప్లయింగ్ వరల్డ్ మానేజింగ్ డైరెక్టర్ అప్పలరాజు.

 

    అప్పటికే అప్పలరాజు మనసు కంగాళీగా, సుల్తాన్ బజార్ మార్కెట్ లా అయిపోయింది. తనెళ్ళిన ప్రతి చోటుకీ ఈ ఆంజనేయులుగాడు తయారయ్యాడు. అంటే... తను వెయ్యబోయే ప్రశ్నలన్నీ వీడికి తెల్సన్న మాట... ప్రశ్నలు మార్చెయ్యాలి. వీడ్ని బోల్తా కొట్టించాలి... టోకరా ఇవ్వాలి అని నిర్ణయించుకొన్నవాడై బజర్ నొక్కాడు.

 

    బుగ్గన కిళ్ళీ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.

 

    "ఎక్స్యూజ్ మీ..." ఠీవిగా అని, లేచి బుగ్గన కిళ్ళీ వ్యక్తిని రెండో గదిలోకి తీసికెళ్ళి....

 

    "చూడు చిదంబరం... నువ్వు అర్జంటుగా వెళ్తావో, ఆ తాతాజీ గాడ్ని పంపుతావో... నాకు అర్జంటుగా సితార, శివరంజని, స్టార్ డస్ట్, జైచిత్ర, స్క్రీన్, మూవీ, తదితర సిన్మా మాగజైన్లన్నీ యమ అర్జెంటుగా కావాలి... వెళ్ళు" అని చిదంబరంతో చెప్పాడు అప్పలరాజు.

 

    చిదంబరం ఆఘమేఘాల మీద బయటికి దూసుకుపోయాడు.

 

    "ఎస్... మిస్టర్... ఆంజనేయులూ... ఏ వూరు మనది..." మరో ప్రశ్న ఏం వెయ్యాలో తెలీక మళ్ళీ అదే ప్రశ్న వేశాడు.

 

    "ఇందాక చెప్పాను కదండీ..." అని అనబోయి "ఎందుకు గోల" అని మనసులో అనుకుని....

 

    "సఖినేటిపల్లి అండి" అని అన్నాడు.

 

    "సఖినేటిపల్లి... అంటే... కోనసీమన్న మాట. నిన్ను చూడగానే అనుకున్నాన్లే... కోనసీమో, రాయలసీమో అయ్యుంటుందని. కోనసీమ కొబ్బరికి చాలా ఫేమస్ ట కదా?"

 

    "అవునండి" మరీ వినయంగా అన్నాడు ఆంజనేయులు.

 

    "బైదిబై... నువ్వు ఆస్తికుడివా... నాస్తికుడివా?"

 

    "ఒకప్పుడు మాకు బాగానే ఆస్తి వుండేదండీ... మా నాన్న ప్రతి ఏటా దుశ్శాసనుడి జాతరలు జరిపించేవాడండి... మా అత్త గాంధారి సంతర్పణలు చేసేదండి... ఆ దెబ్బకు హారతి కర్పూరంలా అయిపోయిందండి"

 

    ఆంజనేయులు చెప్పిన మాట ఒక్కక్షరం అర్థం కాలేదు అప్పలరాజుకి. దుశ్శాసనుడి జాతరలు, గాంధారి సంతర్పణలా? ఆస్తికుడివా, నాస్తికుడివా అంటే ఇవ్వన్నీ చెప్తాడేంటి వీడు... తెలుగులో పూరేమో అని మనసులో అనుకుని....

 

    "లోకజ్ఞానం అవసరం కానీ... తెలుగులో లోకజ్ఞానం అవసరం లేదు. నీచేత నేనేం ఆఫీసు బోర్డులు తెలుగులో రాయమని అడగను గదా" అని మరేం ప్రశ్న వెయ్యాలో తెలీక గిలగిల్లాడుతున్న సమయంలో...