"నా అన్నవస్తువు మీద నాకు అమిత పూజనీయభావం వుంది. గాఢానురాగం వుంది. దానికి కారణం ఆ విలువ నేనెప్పుడూ పొందలేకపోవటమే."

    "నా" అనుకునే తల్లిని ఎరుగను. తండ్రిగురించీ అంతే. స్వార్ధపరుల మధ్య పెరిగాను. అడుగడుక్కీ ఓ తుఫాను. బళ్ళో చేరగానికి యజ్ఞం చేయాల్సి వచ్చింది. నేను అనుకున్నది పొందటానికి, నా సొమ్ము నేను తినడానికీ, నా విద్య నేను ఎన్నుకోవడానికీ, నా జీవనపథాన్ని నేను నిర్దేశించుకోవటానికీ మహా సంగ్రామాలు జరుపవలసి వచ్చింది. నిరంతరం యాతనలు అనుభవించవలసివచ్చింది. ఎంత హింస అనుభవించానో లెక్కలేదు. నా లక్ష్యాన్ని సాధించడంలో అనేక తరహాల మనుష్యులతో సంచరించాను. మనుషుల్లోని దుర్మార్గాన్ని, క్రౌర్యాన్ని, స్వార్ధాన్ని, అవినీతిని ఎంతో దగ్గరగా చూశాను. స్వయంగా అనుభవించాను. అనేక వంచనలకు గురి అయాను. నిజాయితీ కోసం, నిజమైన స్నేహంకోసం అలమటించి, ప్రయత్నించి వాటి నిజస్వరూపానికి తట్టుకోలేక నిప్పులో వేసిన తాటాకులా దాహించాను. నిప్పులా మండాను."

    "ఇప్పుడు ఆ దశంతా ముగిసిపోయింది. విద్య సంపాదించాను. డబ్బు సంపాదించాను. పేరు వుంది. ఆరోగ్యముంది. యవ్వనం వుంది."

    "కానీ "నా" అన్నవాళ్ళను మాత్రం సంపాదించుకోలేకపోయాను."

    "ఆ "నా" ఎవరు అవుతారు? తల్లీ, తండ్రీ, సోదరుడూ, సోదరీ ఎవరూ లేరు. వారిని మధ్యలో సంపాదించుకోలేం - మధ్యలో సంపాదించుకునేది ఒకర్నే ఒకర్ని - సహచరిని."

    "కానీ ఎలా జ్ఞానా? నన్ను అణువు అణువునా అర్ధం చేసుకుని, ఆరని జ్యోతిలాంటి ప్రేమని ప్రసాదించి, వెన్నెల కిరణంలాంటి చక్కదనాన్ని, ప్రశాంతత సాగరకెరటం లాంటి శాంతినీ ప్రసరించగల దేవత ఎలా లభిస్తుంది?"

    "ఎందుకంటావా? నా అనుమానానికి కారణమేమిటంటావా? నాకెంతో మంది స్నేహితులున్నారు. ఎంతోమంది స్నేహితురాళ్ళున్నారు. వారిలో ఎవరూ స్వచ్ఛమైన ఆనందాన్నీ, దాంపత్య జీవితంలోని అమరత్వాన్నీ పొందుతున్నట్లు అనిపించదు నాకు. చాలామంది ఒకరినొకరు అర్ధం చేసుకోరు. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించలేరు. ఎవరి ఆవేశాన్ని వాళ్ళు అణచుకోలేరు - ఎవరి లోపాన్ని వారు సరిదిద్దుకోరు. ఒకరి నీడలో ఒకరు శాంతిని పొందటానికి ప్రయత్నించరు. ఎవరి స్వార్ధాలను, ఆపేక్షలను భావాలను, భావుకత్వాలను, ఆశయాలను, నడవడికను, దుర్గుణాలను, ఆరాచకాన్ని, గడుసుతనాన్ని, దర్పాన్ని, ప్రలోభాలను, అలవాట్లను, చాదస్తాలను, అహంకార ప్రదర్శనను ఒకంత త్యాగం చేసుకోవటానికి ఆరాటపడరు. ఏ ఒకరో త్యాగం చేశానన్న డంబాలతో ప్రక్కవారి ప్రాణాలను తోడేస్తూ వుంటారు. కొందరు పెళ్ళయ్యాక యుద్ధాలను నిత్యమూ చెలరేగే గడబిడలకు అలవాటు పడిపోతారు. కొందరు ఒకరినొకరు అసహ్యించుకుంటూ, ద్వేషించుకుంటూ గడుపుతారు. కొందరు ఒకరినొకరు అంటీముట్టనట్లు కాలం వెళ్ళదీస్తారు. కొందరు ఒకరినొకరు అసమర్ధతతో లొంగిపోయి ఘోర అశాంతితో జీవితాలను వెళ్ళబుచ్చుతారు. చాలామంది యాంత్రికంగా రోజులు జరుపుకుంటారు. కొందరు బయటకు సుఖంగా జీవిస్తున్నట్లు నటిస్తూ లోలోపల కుళ్ళుతూ, కుములుతూ వుంటారు. కొందరు నా జీవితం పెళ్ళిచేసుకుని నాశనం చేసుకున్నాను. పెళ్ళనేది పగవారికైనా వద్దురా బాబూ! అంటూ పదేపదే బయటకు చాటుతూవుంటారు. ఇహ ఒకరినుంచి ఒకరు విదిపోయినవారూ, వీధికేక్కినవారూ , నలుగురిలో నవ్వులపాలైనవారూ అనేకం. ఇంత భయంకరమైనదా పెళ్ళి? ఇంత అశాంతితో కూడినదా తోడు వెదుక్కోవటం? అందుకే ఇన్నాళ్ళూ ఎవరిని చేపట్టాలో, ఎవరితో చెలిమి చేయాలో తెలీక నా మనస్సుని ముక్కలు చేసుకుంటున్నాను. రంపపుకోత అనుభవిస్తున్నాను. పోనీ తోడులేకుండా ఒక్కడినే బ్రతుకుదామంటే వంటరితనం మరింత బాధిస్తోంది. ఈ జీవితం ఎందుకు వృధా కావాలి అనిపించేది. ఒక చల్లని దేవత కరుణా కిరణాలు నాయందు ఎందుకు ప్రసరించకూడదు? అని ఉక్రోషంవచ్చేది. అందరిలా యాంత్రికంగా జీవించకూడదు. నేను అదృష్టవంతుడ్ని కావాలి. ధన్యుడ్ని కావాలి అని ఒకటే ఆరాటం. కానీ ఎవరిని చూసినా అసంతృప్తి. ఇక్కడ తప్పటడుగు వేస్తానో అన్న భయసందేహాలు....నాపై అమృతధారలు కురియాలి. నాకు కావాలి. ఆ ఎవరో ఎవరు? ఆమె ఆకాశంనుండి క్రిందకి రాలి పడుతుందా? భూమ్మీద సౌజన్యాన్నంతటినీ పుణికి పుచ్చుకుంటుందా? నేను తరిస్తానా? భార్యాభర్తలనే పదానికి యదార్ధమైన నిర్వచనం సృష్టిస్తానా? సత్యమంటే ఇదే. ప్రపంచంలో పదిమందీ ఆచరించేదే సత్యమనుకోవటం అపోహ అని రుజువు పరుస్తానా? సుఖం, ప్రేమ, ఆనందం అనేవి భ్రమలు కావు. వాటి ఉనికి వుంది ఎక్కడో అక్కడ అని తేటతెల్లం చేస్తానా? ఇదే తపన.....ఇదే సంఘర్షణ.....కానీ......నిన్ను చూశాను ఆనాడు రైల్లో. మొదటిక్షణంలో  దిగ్ర్భాంతుడనైనాను. రెండో క్షణంలో నేను వెతుక్కునే పాదాలు ఈ తరుణివే అని స్ఫురించింది. మూడోక్షణం నాలో ఇన్నాళ్ళూ పేర్కొనివున్న మైకాన్ని పోగొట్టింది. స్త్రీ ఎంత మధురశక్తి! స్త్రీ ఎంత మోహన చలగాటమో, స్త్రీ ఎంత ప్రేమకారుణ్యమూర్తో, స్త్రీ ఎంత దయనీయ కమనీయ సముదాయమో, స్త్రీ ఎంత ఉజ్వల భవిష్యత్తో, స్త్రీ ఎంతటి వెన్నెలనీడో బోధపడింది. నీకోసమేనా నేను వెదుకుతున్నాను? అవునేమో! నువ్వే నా చెలిమి, సహచరివి, తోడువి, నీడవి, నువ్వే నా అన్నీ! ఏదో విద్యుత్ నాలో ప్రవహించింది. క్క్యారు చీకటిలో కాంతి కిరణం వెలిసింది. హృదయ క్షేత్రంలో ఎల్లడలా వెలుగు రేఖలు వ్యాపించాయి.

    అతని కంఠం శృతి తప్పుతోంది - కళ్ళునుంచి అశ్రుబిందువులు స్రవిస్తున్నాయి.

    "చెప్పు జ్ఞానా? నా సంపూర్ణ వ్యక్తివి నువ్వేనా?" అంటున్నాడతను గాద్గదికంగా.

    జ్ఞానసుందరి ఇక కాన్నీరాపుకోలేకపోయింది. శక్తి చాలలేదు. లేచి మెరుపులా అతని చెంతకు చేరింది. అతని కంఠంచుట్టూ తన మృదు హాస్తాన్ని పోనిచ్చి తన దగ్గరకు లాక్కుంది.

    "ఏడవకు నువ్వి చిన్ని నాన్నా! నేనున్నాగా నీకు. అవునూ అన్నీ నేనే. నీ సమస్తం. నీ గుండె, నీ ఉనికి అన్నీ నేనే!"

    "ఎలా సాధ్యం నీకవి జ్ఞానా? నేనెవర్నీ నమ్మలేను. నన్ను నేనే నమ్మలేను. సుఖమంటే భ్రాంతి అనుకునేవాడ్ని. సంసారంలో సామరస్యం పట్ల లక్ష అనుమానాలున్నవాడిని. నువ్వు గారడీ చేయగలవా?" ఆమె స్ఫటికంలాంటి కంఠంమీద తన పెదమల్ని రాస్తూ అతనస్పష్టంగా ఉచ్ఛరించాడు.