అక్కడే నిలబడ్డ కోమలని చూసింది చాయ.
    
    కోమల - కోమల మొహం వెలిగిపోతోంది.
    
    ఆరోజు రాత్రి రాజుతో పారిపోతుండగా పట్టుబడ్డ తర్వాత-కోమల మోహంలో నవ్వు ఎవరూ చూడలేదు.
    
    "ఏమిటబ్బా విశేషం?" అనుకుంటూ వుండగా, చాయకి ఆమె వెనుకగా నిలబడ్డ రాజు కనపడ్డాడు.
    
    "కొమలని రాజు పెళ్లి చేసుకోబోతున్నాడు" అంది దయామణి.
    
    చాయ వాళ్ళిద్దర్నీ ఓసారి పరీక్షగా చూసింది.
    
    కోమల కూడా చాయవంక గర్వంగా చూసింది.
    
    "కోమలకి జీవితాన్ని ఎలా మలచుకోవాలో తెలుసు. బుద్దిగా కాపురం చేసుకుంటూ పిల్లల్నికని, వాళ్ళను మంచిగా పెంచి, ఉత్తమ పౌరులుగా మార్చి తన జన్మకో అర్ధం కల్పించుకుంటుందని నా నమ్మకం.
    
    అలాగే రాజు కూడా కోమలని అర్ధం చేసుకునీ, ఆమె మనసు తెలుసుకునీ, ప్రేమగా చూసుకుంటాడని ఆశిస్తున్నాను" అంది దయామణి.
    
    "మమ్మల్ని ఆశీర్వదించండి" రాజూ, కోమలా దయామణి పాదాలకు నమస్కరిస్తూ అన్నారు.
    
    "ఒకరంటే ఒకరికి ఇప్పుడున్న ప్రేమే జీవితాంతం వుండాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాను" అంది దయామణి.
    
    అదంతా ఆవిడ తన ముందు ఎందుకు చేస్తోందో చాయకి అర్ధం అయింది.
    
    మౌనంగా వెనక్కి తిరిగి తన రూం వైపు వెళుతుంటే, ఆమెకి కిరణ్ రక్తం మడుగులో పడి కొట్టుకోవడం గుర్తొచ్చింది.
    
                                              * * *
    
    పరీక్షగా చూసుకున్నాడు జయచంద్ర.
    
    తెల్లగా....వెండిలా మెరుస్తున్నాయి అతని పాపిడిలో వెంట్రుకలు. ఎన్నో రోజులకి అలా తనని తాను పరీక్షగా చూసుకున్నాడు.....'డై చేసుకోవాలి' అనుకున్నాడు.
    
    "ఎందుకో?" అంతరాత్మ ప్రశ్నించింది.
    
    మనిషి ఎవరికైనా సమాధానం చటుక్కున కల్పించి చెప్పెయ్యగలడు. కానీ తన అంతరాత్మకి చెప్పుకోలేడు.
    
    అద్దం ముందునుండి లేచి వెళ్ళిపోయాడు.
    
    మనసులో తెలియని అలజడిగా అనిపించింది. జయచంద్ర సాధారణంగా ఇంట్లో ఒక్కడే కూర్చుని త్రాగడు. కానీ ఈరోజు మనసును జోకొట్టడానికి మందుసాయం తప్పదనిపించింది. బాటిల్, సోడా తీసుకుని డాబా మీదకి వెళ్ళాడు.
    
    చాలా రాత్రయింది. ఊరంతా నిద్రపోతున్నట్లు నిస్సబ్దంగా వుంది. క్రింద గదుల్లో భార్యా, కూతురూ కూడా నిద్రపోతూ వుండి వుంటారు అనుకున్నాడు.
    
    మందు గొంతులోకి దిగుతూ వుంటే హృదయం కొద్దిగా తేలిక అవుతున్నట్లు అనిపించింది.
    
    'అమృతం కురిసిన రాత్రి
    
    అందరూ నిద్రపోతున్నారు.
    
    అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు,         
    
    అలవాటునీ, అస్వతంత్రతనీ కావలించుకున్నారు.'
    
    అన్న తిలక్ ని గుర్తుచేసుకుని చిన్నగా నవ్వుకున్నాడు నోట్లో సిగరెట్ పెట్టుకుని వెలిగించుకుంటూ.
    
    'కాంక్షా మధుర కాశ్మీరాంబరాన్ని కప్పుకున్నాను.
    
    జీవితాన్ని హసన్మందారమాలగా ధరించాను' అనుకున్నాడు. నోట్లోంచే కాక గుండెల్లోంచి కూడా పొగలు వస్తున్నట్లుగా అనిపించాయి.
    
    వెన్నెలరాత్రి డాబామీద కనిపించిన చాయ రూపం కళ్ళలలో మెదిలింది. తన చేయి పడ్డచోట కందిన ఆమె శరీరం గుర్తుకొచ్చింది. అనాలోచితంగా చేతిని చూసుకున్నాడు. వెచ్చని ఆమె స్పర్శ ఒళ్ళంతా పాకినట్లయింది.
    
    'ఇష్ లీ బదూ!' కొంటెగా అన్న ఆమె పెదవుల కదలికని తలచుకున్నాడు.
    
    "నిజమా?" పైకే అనుకున్నాడు. 'నిజం' అని ఒప్పుకోడానికి విజ్ఞత అడ్డువస్తోంది.
    
    'ఆ అమ్మాయి వయసెక్కడ..... తనెక్కడ.... ఏదో చిన్నతనం.... అల్లరి' అని సర్దిచెప్పుకున్నాడు.
    
    మనిషి మనసు ఓ చిన్న డబ్బాలో ముడిచిపెట్టిన స్ప్రింగ్ లాంటిది డబ్బా మూత తెరవగానే విప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.
    
    ఒకే విషయం ఒక ఆత్మకు విపరీతమైన సంతోషాన్నీ ఇంకొక ఆత్మకు అంతులేని బాధనీ కలిగించడమే జీవితంలోని మెలోడ్రామా! తనకు ఇష్టమైన విధంగా ప్రవర్తించేవాడివల్ల ఇతరులు బాధపడతారు. ఎంతసేపూ ఇతరులనే సంతోషపెట్టాలని తాపత్రయపడేవాడు జీవితంలో చచ్చినా సుఖపడలేడు.
    
                                                                * * *
    
    "ఎందుకు రానన్నానో లోపలికి ఇప్పుడు తెలిసిందా?"
    
    సంధ్య అవాక్కయిపోయి చూస్తూండిపోయింది.
    
    పూజారి బిక్కచచ్చిపోయి "అమ్మా....పూజ కానిమ్మంటారా?" అన్నాడు నెమ్మదిగా.
    
    దూకుడుగా వెళ్ళిపోతున్న చాయని చూస్తున్న సంధ్య తలతిప్పుకుని "మీరు కానివ్వండి" అంది.
    
    గర్భగుడిలోకి జగన్నాటక సూత్రధారి వినోదంగా తిలకిస్తున్నట్లు కనిపించాడు.
    
    సంధ్య పూజ ముగించుకుని కిందకి వెళ్ళేసరికి చాయ కార్లో వెనుక సీట్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    
    సంధ్యని చూడగానే కళ్ళు తుడిచేసుకుంది.
    
    సంధ్య చాయ భుజంమీద చెయ్యివేస్తూ "చాయా....ఈరోజు మీ హాస్టల్ కి వెళదాం....నాకు ఎన్నో రోజులుగా హాస్టల్ చూడాలని సరదాగా వుంది" అంది.
    
    "సరదానా?" చాయ అదోలా అని "అదేం ఫైవ్ స్టార్ హోటల్ కాదు.....సరదాగా వెళ్ళడానికి" అంది.
    
    "ప్లీజ్ చాయా..." బ్రతిమాలుతున్నట్లు అంది సంధ్య.    
    
    కారు స్పీడుగా పోతోంది. పబ్లిక్ లావెట్రీ మీద సగం-సగం వూడిపోయిన 'రాజూ-పెదా' వాల్ పోస్టర్ గాలికి రెపరెపలాడుతోంది.
    
    "ఇక్కడ ఆపు" డ్రైవర్ తో చెప్పింది చాయ.
    
    డ్రైవర్ కారు ఆపుజేసాడు.
    
    "బై....సంధ్యా" అని కారు దిగబోయింది.
    
    "ఇక్కడెందుకూ? హాస్టల్ దగ్గరే ఆపుతాడు" అంది సంధ్య.