"ఇంతటితో ఆగనే...." నిస్సహాయురాలైన ఆడపిల్లపైన ఎలాంటి జులుం ప్రదర్శించవచ్చో గుర్తుచేసేట్టుగా పిడికిలి మరింత బిగించాడు. "ఒక వేళ మీ అన్న నా చెల్లి కోరినట్టు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే, నీ బట్టలు విప్పించి రోడ్డుమీద నడిపిస్తాను. అప్పటికీ బుద్ది రాకపోతే నిన్ను కిడ్నాప్ చేసి రోజుల తరబడి అనుభవించి..."
    
    అనిత వినలేకపోతూంది. ఆమెకు తెలిసిన సభ్యసమాజంలో ఇలా మాట్లాడే వ్యక్తులు ఇంతవరాకూ తారసపడకపోవడంతో, పైగా అన్నయ్య మీద కోపాన్ని తనమీదెందుకిలా ప్రదర్శిస్తున్నాడో అర్ధంకాక చేతులు జోడించింది. "ప్లీజ్.... నేను మా అన్నయ్యకి నచ్చచెబుతాను విడిచిపెట్టు"
    
    అది కాంక్షో, అహమో నిప్పులు కక్కుతున్న నేత్రాలతో ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ దూరంగా తోశాడు తోడేలులా నవ్వుతూ.
    
    అనుకున్నదానికన్నా ఎక్కువే చేయగలిగిన సంతృప్తితో శౌరి వెళ్ళి పోయాడు. కాని, అనిత ఇక వార్డులో అడుగుపెట్టలేకపోయింది.
    
    గదిలో చదువుకుంటున్న ఆదిత్య హఠాత్తుగా ఇంటికి తిరిగొచ్చిన అనితని చూస్తూ నిర్విన్నుడైపోయాడు "ఏమైంది?"
    
    జవాబు చెప్పలేదామె. ఆవేశంగా వచ్చిందే తప్ప, ఇప్పుడు జరిగింది చెప్పొచ్చో, చెప్పకూడదో తెలీక కలవరపడిపోతూంది.
    
    "ఏమైందే?"
    
    అనిత రూపం చూడగానే ఉద్విగ్నుడైపోయాడు.
    
    "మాట్లాడవేం?" చెల్లిని పొదివిపట్టుకుని నిలదీశాడు.
    
    "ఎందుకన్నయ్యా....?" బావురుమంది రొప్పుతూ "నీకు అంత గొప్పింటి స్నేహాలెందుకు? అసలు ప్రబంధలాంటిదానితో పరిచయానికి నీ అంతస్తేమిటి?"
    
    "ముందు జరిగింది చెప్పు" కంపించిపోతున్నాడు.
    
    "ఆ కాంపిటీషన్ లో ప్రబంధతో కలిసి ఎందుకు పోటీ చేయనన్నావ్?"
    
    "ఏమైందో చెప్పకుండా ఈ సోదేమిటి....?" అరిచాడు నిగ్రహాన్ని కోల్పోతూ.
    
    "ఇప్పుడు హాస్పిటల్ కి ప్రబంధ అన్నయ్య వచ్చాడు. ప్రబంధతో కలిసి నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే..." అనిత వెక్కుతూంది.
    
    "చేయకపోతే?"
    
    "నన్ను బట్టలూడదీసి.... నడిపిస్తాడట! నా జుట్టు పట్టుకుని..."
    
    "అనితా..." ఎక్కడో విస్ఫోటనం!
    
    గుండె నడిబొడ్డున బల్లెం దిగబడినట్టు కలవరపాటు....! పేలిన మనస్సు గనిలో నుంచి ఎగిసిపడుతున్న రోషాగ్నిల నిప్పురవ్వలు.
    
    "బా.....స్ట...ర్డ్...!" పళ్ళు నూరుతూ బయటికి నడవబోయాడు.
    
    "వద్దన్నయ్యా! అతనితో పేచీ పెట్టుకోకు..." చేతులు పట్టుకుంది ప్రాధేయపడుతూ.
    
    ఎంతటివాడైనా గాని ఎన్ని గుండెలు వాడికి! అనితని వివస్త్రని చేసి నడిపిస్తాడా?
    
    అన్నయ్యలో అలాంటి ఆవేశం చూడటం తొలిసారి. చెప్పి పొరపాటు చేశాననుకుందేమో తనని తానే సరిదిద్దుకుంటున్నట్టుగా ద్వారానికి గడియ పెట్టింది. ఇంకా మొండితనాన్ని ప్రదర్శిస్తున్న ఆదిత్య పాదాల్ని చుట్టేసింది.
    
    ప్రబంధపైన మిగిలిన అణువంత అభిమానమైనా చెరిగిపోయిన చివరి క్షణమది!
    
                                                           * * *
    
    ఉదయం పది గంటల సమయంలో...
    
    అటు పార్టీ అధిష్టానవర్గం జరిగినదానికి సంజాయిషీ యివ్వమని ముఖ్యమంత్రి వాసుదేవరావుకి నోటీస్ జారీచేసి నిలదీస్తున్న సమయాన...
    
    ఇక్కడ ఆంధ్రా యూనివర్శిటీలో కారు దిగిన శౌరిని సమీపించాడు ఆదిత్య "ఆగు!"
    
    ఆదిత్య ముఖకవళికల్ని చూడగానే తొట్రుపడ్డాడు శౌరి. నిర్లక్ష్యంగా వెళ్ళేవాడే. కాని అది తన మిత్రబృందం ఓటమిగా భావిస్తే అసాధారణమైన తన ప్రశస్తికి విఘాతమేర్పడిపోతుంది.
    
    "ఏం కావాలి?"
    
    "నీతో ఒంటరిగా మాట్లాడాలి."
    
    "ఏమిటి మాట్లాడేది? సుధీర్ జోక్యం చేసుకోబోతుండగా ఆవేశంగా రెండడుగులు ముందుకేశాడు ఆదిత్య."
    
    మరొక్క పదం మాట్లాడితే ఆదిత్య షర్టుకాలరు పట్టుకునేట్టున్నాడు. "శౌరీ! నేను మాట్లదాలనుకుంటున్నది నీ ఒక్కడితో కాబట్టి నీ చెంచాగాళ్ళని విడిచిపెట్టి ఆ మూలకి రా."
    
    "ఆదిత్యా!" సుధీర్ తన ప్రతాపాన్ని ప్రదర్శించబోయాడు.
    
    "మర్యాదగా నువ్వు పక్కకి జరిగిపో సుధీర్! ఇది నాకూ, శౌరికి సంబంధించిన విషయం అనవసరమైన జోక్యంతో నన్ను రెచ్చగొట్టకు!"
    
    కనీసం ఇక్కడైనా శౌరి ఆదిత్యని ఖండిస్తాడనుకున్న సుధీర్ అలాంటిదేమీ జరక్కపోవడంతో అవాక్కయిపోయాడు. మామూలుగా అయితే ఆదిత్యకి బుద్ది చెప్పేవాడే కాని దూరంగా ఎక్కడో ఉన్న ప్రబంధ వెంటనే రంగంలోకి దిగిపోతుంది.
    
    సరిగ్గా ఇదే ఆలోచన శౌరిని నిగ్రహంగా వ్యవహరించేట్టు చేయడంతో "పద" అంటూ ఒంటరిగా ఆదిత్యతో పాటు ఓ మూలకి నడిచాడు.
    
    దూరంగా ఉన్న విద్యార్ధులు కొందరు ఇదంతా గమనించారు.
    
    ఇప్ప్దుడేం జరగబోతున్నదీ అర్ధంకాని స్థితిలో శౌరి మిత్రులంతా చూస్తుండగానే అడిగాడు ఆదిత్య. "రాత్రి హాస్పిటల్ కి వెళ్ళావు కదూ?"
    
    "వెళ్ళి ఏమన్నదీ మీ చెల్లి చెప్పే వుంటుందిగా?" ఎగతాళిగా అన్నాడు శౌరి.
    
    ఎంత సంస్కారవంతుడికైనా కొన్ని సరిహద్దులు  వుంటాయి. ఆదిత్య కూడా దానికి అతీతుడేం కాదు.
    
    ఆవేశంతో రొప్పుతున్నాడు. "నీ చెల్లిని నువ్వు అదుపు చేయలేనివాడివి నా చెల్లిని ఎందుకు బెదిరించాలనుకున్నావ్?"
    
    "టిట్ ఫర్ టాట్ అంటే ఏమిటో తెలియచెప్పటానికి."
    
    "చేవ ఉన్న వాడివైతే నాతో మాట్లాడాల్సింది."
    
    వ్యంగ్యంగా నవ్వాడు శౌరి "నీతో మాట్లాడేవాడినే ఆదిత్యా! కాని నా బాధేమిటో నీకు నీ చెల్లి ద్వారా తెలియచెప్పాలనిపించింది."