అతనికీ, ఆమెకూ మధ్య విద్యుత్తరంగాలూ మొదలయాయి.

 

    "ఉహు! నన్ని వేళ ఏ శక్తి ప్రతిఘటించలేదు. పిచ్చెక్కి, మదమెక్కి ఉన్నాను. దెబ్బలు తిని తిని, బండబారి, మొద్దుబారి ఉన్నాను. ఎన్ని రోజులు నా పరాజయాన్ని అంగీకరిస్తాను? ఇవాల్టితో స్వస్తి చెబుతాను. నా ఆరోగ్యమా? చితికిపోయింది. డబ్బా? నశించిపోయింది. నా అన్న వాళ్ళందర్నీ పోగొట్టుకున్నాను. ఈ అవకాశం వొదులుకుంటే తిరిగి ఎన్నటికీ తిరిగిరాదేమో! ఇప్పటికీ జాప్యం చేశాను."

 

    ఇంకా ముందుకు వొంగుతున్నాడు. ఆమె భుజాలు పట్టుకుందామని చేతులు గాలిలోకి జాచి ఆమెమీదకు వొంగుతున్నాడు.

 

    ఇద్దరిమధ్య దూరం ఎక్కువైనకొద్దీ విద్యుత్ తరంగాలు ఎక్కువవుతున్నాయి.

 

    "వేదితా! విదేశాలనుండి తిరిగి వచ్చాక ఏ దుష్టక్షణాన నిన్ను మొదటిసారి చూశానో, ఆ క్షణంనుండి నాలో దుర్భర పతనం ప్రారంభమయింది. అంతవరకూ విచ్చలవిడిగా, విశృంఖలంగా జీవితాన్ని గడపగలిగినవాడ్ని నీ మోజులోపడి, పరస్త్రీ వ్యామోహానికి స్వస్తి చెప్పాను. స్త్రీ సుఖాన్ని మరిచిపోయాను. నిన్నే ఆరాధించాను. నువ్వు నన్ను జయించావు. పరిపాలించావు. పీల్చి పిప్పిచేశావు. అలాంటి నిన్ను నా సొంతం చేసుకోకుండా ఉండలేను. పిడుగులుపడనీ, భూమి బ్రద్ధలవనీ అటు సూర్యుడు ఇటు ఉదయించనీ, ఇవాళ నా పంతం చెల్లించుకుంటాను.

 

    మరింత ముందుకు వొరిగాడు.

 

    నొప్పి ఆరంభమయింది.

 

    "అవనీ, నే నిప్పుడు రాక్షసుడ్ని, చాలా బలవంతుడ్ని. ఈ ఆటంకాలు లెక్కచెయ్యను ."

 

    అతని చేతులు ఆమె భుజాలు సమీపిస్తున్నాయి. విద్యుత్ తరంగాలు అతన్ని విషనాగుల్లా కాట్లు వేస్తున్నాయి. వారిద్దరి నడుమ మంటలు వ్యాపించినట్లు, వాతావరణం సెగలు ఎగజిమ్ముతున్నది. కళుక్కుమంటున్నది. గుండె నొప్పి నరనరాల్లోంచీ ప్రాకి భుజంలోకి, గుండె ప్రక్కన, దేహానికి మధ్యగా ఉండే బొమిక క్రిందకూ, పొట్టపై భాగంలోకి వ్యాపిస్తున్నది. రక్తనాళాలు ఇరుకైపోయి, రక్తం ఘనీభవించి ప్రవాహం ఆగిపోయినట్లు నొప్పి. శరీరం అన్ని భాగాల్లోంచి స్వేదధారలు. అతని నాడి పలుచనైపోయి వడివడిగా ఆడుతోంది.       

 

    అయినా అతను లెక్కచెయ్యలేదు. మొండిగా, బాధనంతా ఓర్చుకుంటూ, భరిస్తూ ముందుకు జరిగి రాక్షసబలంతో వాతావరణపు ఒత్తిడిని చేధిస్తూ ఆమె భుజాలు పట్టుకున్నాడు.

 

    అవును, నిజంగా ఆమె భుజాలతని చేతుల్లో ఉన్నాయి. ఆ చేతులు మండిపోతున్నాయి. నిప్పులో పెట్టినట్లు, సల సల క్రాగుతూన్న నూనెలో పెట్టినట్లు మాడిపోతున్నాయి.

 

    అయినా లెక్కచెయ్యలేదు. తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా వొంచాడు. అలవిమాలిన బాధను భరిస్తూ పెదవులు బిగపెట్టి, కళ్ళు మూసుకుని అట్లాగే క్రిందకు వొంగుతున్నాడు. ఆమె ముఖం మీదకు వ్రాలుతోంది అతని ముఖం.

 

    ఖణ ఖణ కాల్చిన ఇనుపకడ్డీలు కళ్ళలోపెట్టి కాల్చినట్లు, దహించి వేసే వేడి ఆవిరి అతని ముఖంమీదకు ఊదినట్లు... భయంకరమైన బాధ.

 

    వీటన్నిటినీ మించిన బాధ అతని కాంక్ష. వీటికి వెయ్యిరెట్లు అధికంగా అతన్ని కాలుస్తోంది. దహించివేస్తోంది.

 

    కళ్లు తెరిచి చూచాడు. తన ముఖానికి అత్యంత సమీపంగా ఉంది ఆమె కోమల వదనం. ఇంత జరుగుతున్నా ఆమెకు మెలకువ రాలేదు. నిద్రా పారవశ్యానికి లోటురాలేదు. నిశ్చింతగా పడుకుని ఉంది .

 

    తన పెదవులను ఆమె మృదు అధరాల దగ్గరగా జరిపాడు. గజ గజమని వొణికిపోతున్నాయి అతని పెదవులు.

 

    "ఒకప్పుడు సునాయాసంగా చుంబించగలిగిన యీ లలితాధరాలు నేడు ఎందుకింత నరకయాతన పెడుతున్నాయి" అనుకుంటూ తన తలను క్రిందకు వొంచాడు.  

 

    ఆమెను చు...బిం....

 

    "అమ్మో!" అని పెద్ద కేక కేసి ఒక చేత్తో గుండెను పట్టుకుంటూ వెనక్కి విరుచుకుని పడిపోయాడు శాయి.

 

                                                               * * *

 

    అతను తిరిగి కళ్ళు విప్పేసరికి ఇంకా అలాగే నేలమీద పడివున్నాడు. గదిలో పెద్దలైటు వెలుగుతోంది. గుండెల్లో నొప్పి ఏమాత్రం తగ్గలేదు.

 

    కళ్ళు పక్కకి త్రిప్పేసరికి మోకాళ్ళమీద కూర్చుని అతనివంక చూస్తున్న వేదిత కనిపించింది.

 

    "ఏం జరిగింది?" అన్నది. ఆమె పెదవులే అన్నాయి.

 

    అతనిగొంతు తడారిపోతున్నట్లు అనిపించింది. "మంచినీళ్ళు కావాలి" అని సౌంజ్ఞచేశాడు అతి ప్రయత్నంమీద.

 

    ఆమె లేచి, మూలనున్న కూజాలోంచి మంచినీళ్ళు గ్లాసులోనికి వొంపి, అతని దగ్గరకు తీసుకువచ్చింది. మళ్ళీ నేలమీద కూర్చుని అతన్ని మెల్లగా కూర్చోపెట్టి , ఒక చేత్తో అతని తలపట్టుకుని రెండవచేత్తో మంచినీళ్ళు గ్లాసు అతని నోటి దగ్గర వుంచి కొంచెం కొంచెం త్రాగిస్తోంది.

 

    నీళ్ళు త్రాగటం పూర్తి అయాక మళ్ళీ అడిగింది. "ఎలా వుంది?" అని. ఆమె పెదవులు అడిగాయి.

 

    తన కత్యంత చేరువలోవున్న ఆమె ముఖంకేసి ఆశ్చర్యంగా చూశాడతను. ఆ సంఘటన జరిగి ఎంత సేపయివుంటుందో తెలియదుగాని, పాపపు తలపుతో ఆమెను స్పృశించబోయినందుకే అంత వాటిల్లింది. తల పట్టుకుని మంచినీళ్ళు త్రాగించాక ఇప్పుడు అనాలోచితంగా తన భుజంమీద వేసింది చెయ్యి. ఇందాక ఉద్భవించిన బాధ ఇంకా కొనసాగుతోంది గాని, క్రొత్తగా ఏమీలేదు. ఎంత వ్యత్యాసం!

 

    "నాకు వంట్లో బాగాలేదు" అన్నాడెలాగో హీనస్వరంతో. "సక్సేనాకు ఒకసారి ఫోన్ చేస్తావా వేదితా, వెంటనే బయల్దేరి రమ్మని."

 

    ఆమె తలవూపి లేచి ఫోన్ వున్న గదిలోకి వెళ్ళింది.