"నాతో స్పెండ్ చెయ్యడంకన్నా అది ముఖ్యమా?" రోషంగా అడిగింది.
    
    "ఇంకోసారి చూపిద్దువుగానిలేరా!" మధ్యలోకి రాబోయింది యశోద.
    
    "ఈ రోజే వెళుతున్నాం ఆల్రెడీ ప్లాన్ చేసేశాం!" కచ్చితంగా చెప్పాడు.
    
    స్మితకి కోపం వచ్చింది. "లీవిట్, ఆంటీ! అతను రాకపోతే నాకు పోయేదేం లేదు!" అంది ఆ తర్వాత తనకి అర్జెంట్ పనులున్నాయంటూ బయలుదేరి వెళ్ళిపోయింది.
    
    "చూశావా, ఆ  అమ్మాయి ఫీలయిందీ!" అంది యశోద.
    
    "నేనూ ఫీలయ్యాను, నేను రాకపోయినా తనకేం పోదన్నందుకు! నా కోసం ఎదురు చూసే మనిషి కావాలమ్మా నాకు! నువ్వు ఎప్పుడు అర్ధం చేసుకుంటావు?" అన్నాడు.
    
    "అయితే స్మితని పెళ్ళి చేసుకోవా?" డైరెక్ట్ గా అడిగేశాడు కేశవరావు.
    
    "స్మితకంటే లిజీ బెటర్ అని నా ఉద్దేశం" అని వెళ్ళిపోయాడు అక్కడనుంచి మాధవ్.
    
    "అమ్మో... అమ్మో...! అనుకుంటూనే ఉన్నానండీ..... వీడి వాలకం చూస్తే అక్కడ ఆ అమ్మాయితో ఏదో గ్రంధం నడిపే వచ్చినట్లున్నాడు!" గుండెలు బాదుకుంటూ అంది యశోద.
    
    "ఉష్... గొడవ చెయ్యకు! అన్నయ్య లోపలున్నాడు, వింటే బాగుండదు!" అన్నాడు కేశవరావు.
    
    "చూస్తూ చూస్తూ దాన్ని ఎలా కోడలుగా ఒప్పుకునేదండీ?" కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటూ అంది.
    
    "అమెరికా నుండి వచ్చినట్లు ఉంటుందనేగా స్మితని పొగుడుతావ్! సాక్షాత్తూ అమెరికనే అయితే ఇంకా సంతోషిస్తావనుకున్నాడేమో నీ పుత్ర రత్నం!" దెప్పిపొడిచాడు కేశవరావు.
    
    "నేను చచ్చినా ఈ పెళ్ళికి ఒప్పుకోను! అవసరం అయితే సత్యాగ్రహం చేస్తాను ఆఁ!" బెదిరిస్తున్నట్లుగా అంది.
    
    గదిలో పడుకుని ఈ భాగోతం ఆలకిస్తూన్న సీతారామయ్య మాధవ్ వైపు 'ఏమిటిది?' అన్నట్లు చూశాడు.
    
    "చూస్తూ ఉండు ఏం జరుగుతుందో!" చిరునవ్వుతో అన్నాడు మాధవ్.
    
                                                            * * *
    
    మర్నాడు పెద్దరికాన్ని పెట్టేబేడలో మోసుకొచ్చినట్లు పెద్దత్తయ్యా, సందడిని సంచుల్లో నింపుకొచ్చినట్లు చిన్నాన్నా వాళ్ళూ, పిల్లకాలవలా పరుగులు తీసే పిల్లలతో పిన్నీ, బాబాయి అందరూ నాకు సమానమే అన్నట్లు భీష్మాచార్యుడిలా నవ్వులు కురిపించే పెద్దనాన్నతో ఇల్లంతా హడావుడిగా మారింది.
    
    ఎప్పుడో అటకలకెక్కించిన ఆప్యాయతలు కిందికి దింపుకున్నారు. బూజుపట్టిన చిన్నప్పటి జ్ఞాపకాల భోషాణాన్ని తెరవడానికి ఎవరు మటుకు వారే ప్రయత్నించారు. ఆడంబరాలూ, భేషజాలూ అనే దుమ్మునీ ధూళినీ తొలగించడానికి చాలా సమయం పట్టింది. మనసులకున్న తాళాలు వీడి తలుపు తెరుచుకోగానే అందరూ అందులో తాము చిన్నప్పుడు దాచిపెట్టుకున్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే.... చిన్నపిల్లవాడు గారడీవాడి సంచిలోంచి తీస్తున్న వస్తువులను గొంతుకి కూర్చుని ఉద్విగ్నంగా చూస్తున్నట్లుగా మారారు.
    
    "అక్కా! అల్లరి చేశానని అమ్మ కొడుతుంటే నీ వీపు అడ్డు పెట్టేదానివి!"
    
    "చిన్న అన్నయ్యా, నేనూ, సైకిల్ మీద సురభి వాళ్ళ నాటకానికి చెప్పకుండా వెళ్ళామని పెద్దన్నయ్య రాత్రంతా కూర్చుని నులకతాడు పేని తెల్లవారగానే, వచ్చిన మా వీపులు చితక్కొట్టాడు!"
    
    "గదిలో పెట్టి అమ్మ గొళ్ళెం పెడితే వాడు పాకుండలన్నీ తినేసి ఇంతలావున ఉబ్బిపోయాడు!"
    
    "ఇంటికెవరైనా వచ్చినప్పుడు అమ్మపెట్టిన ఫలహారాలు వాళ్ళు మర్యాదకి వద్దన్నా కూడా వీడు వెంటనే లాక్కొని లోపలికి తెచ్చేసేవాడు!"
    
    అందరి నవ్వులతో చెళుకులతో ఇల్లు దీపావళినాటి రాత్రిలా మోగిపోయింది.
    
    ఆడబిడ్డలతో అరమరికలు లేని పరిహాసాలూ, మేనల్లుళ్ళతో, మేన కోడళ్ళతో మురిపాలూ, ముచ్చట్లతో యశోదకీ సరదాగానే ఉంది.
    
    "ఇంతకీ మా అందరినీ పిలిపించిన విశేషమేమిటమ్మాయ్?" విశాలాక్షి అడిగింది.
    
    యశోద భర్తవంక చూసింది.

    కేశవరావు తమ్ముడి భార్య పురంధర, తోడికోడలుని "మాధవ్ కి పెళ్ళి సంబంధం ఏమైనా చూశారా అక్కా?" అని అడిగింది.
    
    "వాడు చేసుకుంటానంటే ఈ నిముషంలో చేస్తాం. రాజాలాంటి సంబంధం ఉంది!" కొడుకువైపు కినుకుగా చూస్తూ అంది యశోద.
    
    రాజాలాంటి సంబంధం వాడికెందుకూ రాణీలాంటి సంబంధం కావాలికానీ!" యశోద చెల్లెలు నీలవేణి నవ్వుతూ అంది.
    
    "బాగా చెప్పావు పిన్నీ! జడకుచ్చులూ, పవిట పిన్నులూ, పసుపూ, కుంకుమా మరిచిపోయినా ఫరవాలేదుకానీ, అసలు స్త్రీత్వాన్నే మరిచిపోయిన పిల్లని ఇల్లాలుగా ఎలా భరించడం!
    
    "ఓహో.... ఆ దొరసాని లిజీనా, గిజీనా.....అదైతే ఫరవాలేదా?" అక్కసుగా అడిగింది యశోద.
    
    మాధవ్ మనసులో నవ్వుకుని పైకి "మగాడిలా డ్రెస్సులేసుకున్నా మనసుల్లో మహిళత్వం అక్కడా ఉంటుందమ్మా! ఇష్టమైన వాళ్ళకోసం వంటచేయడం, ఎదురుచూడటం, చర్చికి వెళ్ళి దీపాలు వెలిగించడం వాళ్ళూ చేస్తారు. ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది. అమ్మాయి మనస్తత్వంలో కాదు!" అన్నాడు.
    
    "ఈ లిజీ ఎవడ్రా?" అడిగాడు గోవిందరావు.
    
    అందరూ కుతూహలంగా చూశారు.
    
    "భారతదేశం అంటే పంట పొలాలతో, జీవనదులతో, గుళ్ళూ గోపురాలతో, సదాచారాలతో సాధుసజ్జనులతో అలరాలే భూలోక స్వర్గమని అనుకునే ఓ పిచ్చిపిల్ల! ఇక్కడ కుటుంబం అంటే అమ్మా, నాన్నా, బాబాయ్, పిన్నీ, అన్నా వదినా అందరూ ఉంటారనుకునే భ్రమలో ఉంది. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా పురుషుడి ప్రథమ స్పర్శనీ, ఎబార్షన్ టేబుల్స్ నీ ఎరగరని ఆమెకి ఎవరో చెప్పారట! ఈ అద్భుత లోకం గురించి ఆమె ఎన్నో ఊహించుకుంటోంది. మంచైనా చెడయినా కుటుంబంలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ద వహించడం, ఒకరి బాగుకోసం ఒకరు పాటుపడటం, కాలికి ముల్లు గుచ్చుకున్నట్లుగా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా మిగతా అందరూ కలిసి ఏరిపారేస్తారని భావిస్తూంది!" అన్నాడు.
    
    ఆ గదిలో ఒక్కసారిగా చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది.