" కార్యం శరణం గచ్చామి "
కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు
ఒక రాత్రి జంఘాలశాస్త్రి సర్కస్ కంపెనీకి వెళ్లి అక్కడ జరుగుతున్న విచిత్రాలను చూస్తున్నాడు.
ఆ సర్కస్ యజమాని కండలు తిరిగిన యోధుడు, వస్తాదు.గుండెలపై పెద్దనాపరాతి బండలను పెట్టించుకుని సమ్మెటలతో కొట్టించుకుని, పెద్ద పెద్ద గొలుసులను తెంపేసి పళ్ళతో పెద్ద బరువులను లేవనెత్తడం చేశాడు.అన్నీఅయిన తరువాత ఒక వింత ఉపన్యాసాన్ని ఇచ్చాడతను.
“ బుద్ధుడు ప్రేమ మతాన్ని బోధించి జీవహింస చేయరాదని చెప్పి భారత జాతిని పాడు చేశాడు.ఆ మతంలో చేరినవారు మాంసాహారం మానేశారు.అందువల్ల బలహీనులై,పౌరుషం లేక భయ స్వభావులై భారతీయులు పాడైనారు.నేడు ఆ మతం దేశంలో లేకపోయినా దాని పూర్వాచారములు ఇంకా బాధిస్తున్నాయి.కాబట్టి వారు వీరు అనే తేడా లేకుండా అందరూ మాంసం భుజించి దేహ బాల సంపన్నులై పౌరుషవంతులై భారత వీరులనిపించుకోండి.భారత దేశాన్ని ఉద్దరించవలసిన వారు మీరే!” అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
అతని ఉపన్యాసానికి సభలోని వారు మహా ఆనందంతో కరతాళధ్వనులు చేశారు.
జంఘాలశాస్త్రి ఆ సర్కస్ యజమాని అభిప్రాయంతో ఏకీభవించక "తను మాట్లాడటానికి అవకాశం ఇవ్వవలసిందిగా " అడిగాడు.
అందుకు అతను " మాట్లాడడానికి ఏముంది ?ఇదేమన్నా కమ్యూనిటీ హాల్ గాని,పఠన మందిరంగాని, గ్రంథాలయంగాని కాదు.ఇది వ్యాయామశాల కాదు.అలాగే ఉపవ్యాసాలు ఇచ్చే తావు కాదు " అని అన్నాడు.
అందుకు జంఘాలశాస్త్రి " మరి నీవు ఎలా ఉపన్యాసం చేశావు ?” అని ప్రశ్నించాడు.
“ ఇది నా సొంత సర్కస్ కంపెనీ.నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను.నన్నుఅడగడానికి నీవు ఎవరు? ” అని వస్తాదు కసిరాడు.
అందుకు జవాబుగా " మీ సొంతమైతే మీ పనులు ఏం చేసుకున్న మాకు అభ్యంతరం లేదు. మీరు దేశాన్ని గూర్చి భారతీయుల గూర్చి ఏమేమో చెప్పారు.కాబట్టి ఒక సగటు భారతీయుడిగా మీ ప్రసంగానికి ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటున్నాను " అన్నాడు జంఘాలశాస్త్రి.
దాంతో విసుగెత్తిన యజమాని " ఏం చెప్తావో చెప్పవయ్యా !మీ మంచి కోరి ఏం చెప్పినా మీకు పనికి రానప్పుడు ఎవడు మటుకు ఏం చేస్తాడు ?"అని అన్నాడు.
“ సోదరులారా...ఈ సంఘాదిపతి ఈ రాత్రి చేసిన చిత్ర చర్యలన్ని మనకు ఆనందాన్ని
ఇచ్చాయి.అయితే అధిక బాల ప్రదర్శన చూపరులకు అద్భుత వినోదకరం.నిర్జీవబల ప్రదర్శనమే ఆశ్చర్యమైనప్పుడు, సజీవ బల ప్రదర్శనం ఆశ్చర్యం కాకుండా పోతుందా ? ప్రాణం లేని రైలు బండి ప్రయాణం ఒక వింత కాదా!
ఇలాంటివన్నీ నిర్జీవబల ప్రదర్శనలు.సజీవ బల ప్రదర్శనం అంటే మన సర్కస్ యజమాని చేసిన ఫీట్లువంటిది.ఇక్కడ శక్తికి ప్రాణం వుంది.ప్రాణం వెనుక మనసు వుంది.దాని వెనుక ఆత్మ వుంది.సంకల్పబలం, ఉత్సాహం ఇందులో ఉన్నాయి.
ఇది విశేషమైన అలవాటు మీద జరుగుతుంది.దీన్ని కొత్తగా చూసేవారికి ఆశ్చర్యంగానే వుంటుంది. ఇలాంటి బలాఢ్యులు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు.
ఉయ్యాల గొలుసులు తెంపి పిల్లల్ని ఏడ్పించడం.గడ్డపారలు వంచి రైతులను ఏడ్పించడం, నాపరాళ్ళు పగలకొట్టి రజకులను ఏడ్పించడం, డబ్బు దండగతో నిద్ర దండగతోనూ...ఊళ్ళో వారిని ఏడ్పించడం లాంటివి ఒక పనిగా పెట్టుకున్నారు ఇలాంటి వాళ్ళు.
చదువులో సున్నా సర్కసుల్లో పిడుగు. ఆడువారు కూడా ఇలాంటి పనులు సులభంగా చేస్తున్నారు.” అని ముగించ్చాడు.
(హాస్యం పత్రిక సౌజన్యంతో )




