
సినిమా పేరు: చెక్ తారాగణం: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సాయిచంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి స్టోరీ-స్క్రీన్‌ప్లే: చంద్రశేఖర్ యేలేటి సంగీతం: కల్యాణీ మాలిక్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్: అణల్ అనిరుద్ధన్ ఆర్ట్: వివేక్ అన్నామలై నిర్మాత: వి. ఆనందప్రసాద్ దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 2021 కొన్ని దినాలకి ముందు వచ్చిన ట్రైలర్ చూసినంక 'చెక్' సిన్మాపై ఎక్స్పెక్టేషన్స్ మందిలో మస్తుగ పెరిగినయ్. ఆ ట్రైలర్‌తోనే మనకి నితిన్ క్యారెక్టర్ ఏంటనేది సమజైపోయింది. ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నితిన్ కనిపచ్చిండు. గతడ్ని బయటకు తీసకరానీకి లాయర్‌గా యాక్ట్ జేసిన రకుల్ ప్రీత్ సింగ్ శానా కష్టపడ్డం అందులో చూసినం. మూస సిన్మాలు తీయడనీ, విలక్షణ సిన్మాలు తీస్తడనీ పేరు తెచ్చుకున్న డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి అలియాస్ చందు 'చెక్' మూవీని ఎట్ల తీసిండో చూసొద్దామా.. పదండి మల్ల! కథ "యద్భావం తద్భవతి... అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు.".. అనేది కర్మ సిద్ధాంతం. గయితే "అహం నియతిం నిశ్చామి.. నా రాతను నేనే రాసుకుంటాను." అనేది ఆదిత్య నమ్మిన సూత్రం. ఈ సూత్రం మీదనే డైరెక్టరు చందు 'చెక్' కతను రాసుకుండు. చేయని నేరానికి టెర్రరిస్ట్‌గా ముద్రపడి ఉరిశిక్ష పడిన ఆదిత్య జైలుకొస్తడు. గతడి తరపున వాదించనీకి లాయర్ మానస వస్తది. జైల్లో శ్రీమన్నారాయణ అనే ఒగ పెద్దాయన దగ్గర చెస్ నేర్చుకొని టాప్ ప్లేయర్ అయిపోతడు ఆదిత్య. ఎస్పీ కోఆపరేషన్తోని టోర్నమెంట్లలో పాల్గొని నేషనల్ చాంపియన్ అయితడు. కానీ తర్వాత ఆ ఎస్పీ ప్లేస్‌ల నరసింహారెడ్డి అనే ఇంకో ఎస్పీ వచ్చి, ఆదిత్యను టార్గెట్ చేస్తడు. తను టెర్రరిస్ట్‌ని కాదని రుజువు చేసుకోనీకి ఆదిత్యకున్న రస్తాలన్నీ మూసుకుపోతయి. రాష్ట్రపతి క్షమాభిక్ష ఒక్కటే మార్గమయితది. మరి ఆ క్షమాభిక్ష ఆదిత్యకి దొరుకుతదా, లేదా అనేదే 'చెక్' కత.





