ప్రేమంటే నువ్వే!
on Apr 3, 2020
స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మనకు తెలుసు. కానీ ప్రేమంటే ఏమిటో కొడుకు అయాన్ పుట్టాకే తెలిసిందంటున్నాడు బన్నీ. అవును. ఏప్రిల్ 4 అయాన్ పుట్టినరోజు. అతనికి ఆరేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. సోషల్ మీడియా అకౌంట్లో, "నా లైఫ్ అంతా ప్రేమంటే ఏమిటి? అని ఆలోచిస్తూ వచ్చాను. గతంలో అనేకసార్లు నాలో బలమైన ఫీలింగ్స్ కలిగాయి కానీ అది ప్రేమా, కాదా అనే విషయం రూఢిగా తెలియదు. కానీ నా జీవితంలోకి నువ్వు వచ్చాక ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది. ప్రేమంటే నువ్వే. ఐ లవ్ యూ అయాన్. హ్యాపీ బర్త్‌డే మై బేబీ" అని పోస్ట్ చేశాడు బన్నీ.
దాంతో పాటు ఒక ఫొటోనూ షేర్ చేశాడు. అందులో టేబుల్‌పై కేక్ పెట్టుకొని ఒక్కడే కూర్చొని ఉన్నాడు అయాన్. అల్లు అయాన్ అనే పేరును సూచిస్తూ థర్మాకోల్‌తో చేసిన ఏఏ అనే తెల్లటి అక్షరాలు, టేబుల్ ముందువైపు ఆరు సంవత్సరాలను సూచిస్తూ 6 అంకె, ఆరు బెలూన్లు పెట్టారు.
వీలు కుదిరినప్పుడల్లా అయాన్‌ను కూడా షూటింగ్‌కు తీసుకెళ్తుంటాడు బన్నీ. తన తండ్రి ఏం చేస్తున్నాడనేది పిల్లలకు తెలియాలనీ, అందుకే తాను పిల్లలను షూటింగ్‌కు తీసుకెళ్తుంటాని ఇదివరలోనే అతను చెప్పాడు. ఇప్పట్నుంచీ సినిమాలపై ఆసక్తి పెంచుకుంటున్న అయాన్.. ఈమధ్య 'అల వైకుంఠపురములో'ని 'ఓ మై గాడ్ డాడీ' ప్రమోషనల్ సాంగ్‌లో చెల్లెలు అర్హతో కలిసి నటించాడు.