'వరల్డ్ ఫేమస్ లవర్' యూనిట్ గప్‌చుప్!
on Feb 15, 2020
విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైంది. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు - రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే నటించారు. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు ప్రెజెంట్ చేసిన ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేయడంలో విఫలమైందని రిపోర్ట్స్ వస్తున్నాయి. యూఎస్‌లో ప్రీమియర్ షోస్ పడగానే, అక్కడ్నుంచే నెగటివ్ టాక్ వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో తర్వాత అదే తరహా బ్యాడ్ టాక్ విస్తరించింది. దాంతో తర్వాతి షో నుంచే కలెక్షన్లు డ్రాప్ అవడం ప్రారంభించాయి. శనివారం అనూహ్య స్థాయిలో టికెట్ సేల్స్ పడిపోయాయని విశ్లేషకులు తెలిపారు.
నిర్మాణ విలువలు చాలా బాగున్నప్పటికీ, కథా కథనాలు ప్రేక్షకులకు నచ్చలేదని తెలుస్తోంది. సెన్సిటివ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాధవ్ ఈ తరహాలో సన్నివేశాల్ని చూపించడాన్ని ప్రేక్షకులు ఏమాత్రం మెచ్చలేదు. విజయ్, రాశీ ఖన్నా, క్యాథరిన్ పాత్రలేవీ వాళ్లను ఆకట్టుకోవడం లేదు. సువర్ణ క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆమె పాత్రను, ఆ ఎపిసోడ్లో విజయ్ చేసిన శీనయ్య పాత్రను డైరెక్టర్ చక్కగా మలచాడు. కాలేజీలో విజయ్, రాశీ మధ్య సన్నివేశాల్ని బాగానే తీసిన దర్శకుడు, వాళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాక తీసిన సీన్లు తలనొప్పి కలిగిస్తున్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. రాశీ ఏడుపు సీన్లు, ఆ సీన్లలో ఆమె చెప్పే డైలాగ్స్ వాళ్లని చికాకు పరుస్తున్నాయి. విజయ్, రాశీ మధ్య ప్రేమకథ 'అర్జున్ రెడ్డి' తరహాలో సాగడం సినిమాకి మరింత నష్టం చేకూర్చింది. తాను సిక్స్ కొట్టాలనే సినిమా చేస్తాననీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'ను కూడా అలాగే చేశాననీ, కాకపోతే బాల్ గాల్లో ఉందనీ విడుదలకు ముందు విజయ్ చెప్పిన విషయం గమనార్హం. ఆ బాల్ ఇప్పుడు బౌండరీ దాటకుండా విజయ్ క్యాచ్ అవుట్ అయ్యాడు!
సాధారణంగా ఒక సినిమా రిలీజైతే అదే రోజో, ఆ మరుసటి రోజో సక్సెస్ మీట్ నిర్వహించడం మన సినిమావాళ్లకు ఆనవాయితీ. అలాంటిది 'వరల్డ్ ఫేమస్ లవర్' యూనిట్ మొత్తం నిర్మాతలతో సహా మౌనం వహించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ సినిమాకు పనిచేసిన ప్రధాన వ్యక్తులెవరూ ఈ సినిమా గురించి పెదవి విప్పలేదు. విజయ్ సైలెంట్ అయిపోయాడు. నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. డైరెక్టర్ ఏం మాట్లాడలేదు. సినిమా విడుదల తర్వాత ప్రమోషన్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. నెగటివ్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా బాగా పడిపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ సినిమా విడుదలయ్యాక ఇంత నిశ్శబ్ద వాతావరణం కనిపించడం ఇదే. దీనిబట్టే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఏ రేంజిలో 'ఇన్‌ఫేమస్' అయ్యాడో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Also Read